భక్తురాలిని అనుగ్రహించిన పరమాత్ముడు*
ప్రేమయే భక్తికి ప్రాతిపదిక దైవం పట్ల మనం చూపు అభిమానము ఒక్కొక్కసారి భక్తిగానూ ,ప్రేమగానూ మారుతుంది. పూర్వకాలమున సౌరాష్ట్ర దేశీయులు చేనేత వస్త్రకళను తమ కులవృత్తిగా కలిగినవారు. కేరళ దేశపు తిరువాన్కూరు సంస్థానపు మహారాజునకు పట్టు వస్త్రములు వీరి చేతనే
తయారు చేయబడు చుండెడివి. మధురకు చెందిన సౌరాష్ట్ర చేనేత వస్త్రకారుడు తనచేత నేయబడిన ఉన్నత రకమునకు చెందిన పట్టు వస్త్రములను మహారాజునకు అందజేయుటకై తిరువనంతపురమునకు
బయలుదేరెను. తనతో పాటుగా తన కుమార్తెను కూడా పిలుచుకునిపోయెను. ఆమె స్వామి యొక్క
పరమభక్తురాలు. ఆ భక్తిని గుర్తించిన స్వామి , ఆమెను అనుగ్రహింపనెంచెను.
వారు తిరవనంతపురమునకు వచ్చుదారిలో *'ఆర్యంగావు'* స్థలమునకు వచ్చుసరికి దట్టమైన చీకటి కమ్ముకొనెను. తండ్రీ కూతుర్లు ఆరాత్రికి అచటనే బసచేసి , మరునాడు ఉదయము
బయలుదేరుచుండగా , ఆమె తన తండ్రితో *"తండ్రీ ! ఇక్కడి నుండి నాకు వచ్చుటకు మనస్సు అంగీకరించుటలేదు. స్వామిని ఎంత చూచిననూ తనివి తీరుటలేదు. నేను ఇక్కడనే ఉందును. మీరు వ్యాపారము మీ ముగించుకుని తిరువనంతపురము నుండి వచ్చు తిరుగు ప్రయాణమున నేను మిమ్ములను కలుసుకుందును. "* అనెను ఆస్వామి యందు ఆమెకున్న భక్తి అటువంటిది. ఆడపిల్లను
ఒంటరిగా వదలి వెళ్ళుటకు తండ్రి ఒప్పుకొనలేక పోయెను. అతడు ఎన్ని విధముల చెప్పి చూచిననూ , ఆమె తన పట్టు వీడనిదయ్యెను. మిగతా వారు కూడా , దారి మధ్యలో గల దట్టమైన
అడవియందు ఆడపిల్లతో ప్రయాణము , ప్రమాదమని హెచ్చరించిరి తాము చూచుకుందుమనియూ ,
నిశ్చింతగా వ్యాపారము ముగించుకుని రావలసినది సూచించిరి. చేయునది లేక ఆ తండ్రి , ఆమె కోరినట్లుగానే అచట పూజారి ఇంట ఆమెను వదలివేచి , తన వ్యాపారమునకై సాగిపోయెను.
తిరువనంత పురమున వ్యాపారమును ముగించుకుని , దారిలో తన కుమార్తెను కలసి , ఊరికి పోవ నిశ్చయించుకొనెను. *'ఆర్యంగావు'* నకు వచ్చుచుండగా , ఒక ఏనుగు ఎదురై , అతడిని
తరిమికొట్ట సాగెను. దిక్కూతెన్నూ తెలియని అతడు మదగజ వాహనుడైన స్వామితో మొరబెడ్డుకొనెను.
తక్షణమే ఎక్కడి నుండో ఒక వేటగాడు వచ్చి నిలిచెను. చూచుటకు అతడు నలుపురంగు మేని కలవాడై , గంభీరముగా నుండు యౌవనవంతునిగా అగుపడుచూ వచ్చిన అతడు , గజమును
తరిమికొట్టగా , పిల్లి వలె పారిపోయినది. తనను కాపాడవచ్చిన ఆ యువకునికి కృతజ్ఞత తెల్పుచూ *"అయ్యా ! తమరెవరో గానీ , తగిన సమయములో వచ్చికుల దైవమువలె నన్ను కాపాడిరి "* అంటూ , తన వద్ద మిగిలి యున్న పట్టు వస్త్రములను అతడికి సమర్పించెను. వెంటనే ఆదుస్తులను ధరించి
చూపిన వేటగాడు. *"ఈ దుస్తులను ధరించిన నేను ఎట్లు ఉన్నాను ?”* అని ప్రశ్నించగా , బదులుగా
వర్తకుడు *”పెండ్లి కుమారుని వలె ఉన్నావు నాయనా”* అనెను. *“పెండ్లికుమారునిగానా ! అట్లయినచో మీ వద్ద నుండి నాకొక బహుమానము కావలసి యున్నది” అని వేటగాడు కోరగా , వర్తకుడు తనను కాపాడినందులకు ఏమిచ్చిననూ తగును అనగానే క్షణము కూడా ఆలస్యము చేయక , మీ కుమార్తె నిచ్చి నాకు వివాహము చేయుమని”* కోరెను.
*వ్యాపారి కొంచెమైననూ సంశయించక అట్లే యని అంగీకరించెను. అట్లు ఆ యువకుని సుందరరూపము అతడిని అంగీకరింపజేసెను. ఆ తరువాత అతడు ఆలోచింపసాగెను. తనకు కుమార్తె ఉన్నదను సంగతి ఆయువకునికి ఎట్లు తెలిసి యుండును”* అనుకొనెను.
ఆవేటగాడు 'మరునాడు' ఆర్యంగావు. ఆలయమున కలుసుకుందునని వెడలిపోయెను.
*తన ఆలోచనలను కొనసాగించుచూ ఆ వ్యాపారి ఆర్యంగావును చేరెను. వేకువఝామునే చేరుకొనుట వలన ఆలయపు తలుపులు తెరువకుండా యుండెను. తలుపులు తెరువునంత వరకూ బయటనే వేచి యుండెను. అదే సమయమున ఆలయ పూజారి స్వప్నమందు స్వామి కనిపించి భక్తా ! గుడివాకిట నాభక్తుడు ఒకడు వేచి యున్నాడు. అతడు తన కుమార్తెను నాకిచ్చి వివాహము చేయునట్లు మాట ఇచ్చి యున్నాడు ఆమెను నాలో ఐక్యము చేసుకొంటిని. ఆమె యొక్క భక్తికి మెచ్చి ఆమెను అనుగ్రహించితిని”* అని చెప్పెను. తటాలున నిద్రనుండి మేల్కొనిన పూజారి తన ఇంటనున్న
వ్యాపారి కుమార్తెకై వెదుకగా ఆమె కనిపించకపోయెను. గుడి ప్రాంగణము వద్దకు పోయి చూడగా స్వామి చెప్పినట్లుగానే అచట వ్యాపారి వేచియుండుట చూచి తన స్వప్న వృత్తాంతమును వివరముగా తెలిపి , ఇరువురూ గుడి తలుపులు తెరచి చూడగా , ఒళ్ళంతా పులకరించు విధముగా , ప్రకాశవంతముగా వెలుగొందు స్వామి కనిపించెను. మునుపటి దినమున తాను ఇచ్చిన పట్టు వస్త్రములను ధరించి యుండెను వేటగాని రూపున తాను చూచినది స్వామినే నని గ్రహించెను స్వామికి సమీపమున ఒక
కన్యామణి శిలగా మారియుండు విషయమును గ్రహించి ఆమె తన కుమార్తెయే నని తెల్సుకొనెను.
స్వామికి ఎడమ భాగమున శిలారూపముగా , స్వామి యందు ఐక్యమై ముక్తి పొందిన ఆ సౌరాష్ట్ర
వనిత పుష్కలా దేవి యొక్క అంశగా కొలువబడుచున్నది.
ఈనాటికీ ఆర్యంగావు ఆలయమున , 18 రోజుల పాటు కోలాహలముగా జరుగు స్వామి
కల్యాణోత్సవమున సౌరాష్ట్ర వంశస్థులు , తిరువనంతపుర మహారాజుతో వియ్యమందిన దానికి
నిదర్శనముగా ఘనముగా సారె తీసుకునివచ్చి ఉత్సవమును శోభింపజేయుచురు.
