శ్రీ మహాశాస్తా చరితము - 76 | శాస్తాని ఉపాసించిన గౌతముడు | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 76 | శాస్తాని ఉపాసించిన గౌతముడు | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శాస్తాని ఉపాసించిన గౌతముడు*

ఒకసారి చాలాకాలము వర్షములు కురియక నేల ఎండుబారిపోయినది. భయంకరమైన క్షామము తాండవించినది. ప్రజలు తినడానికి తిండి దొరుకక అలమటించసాగిరి. అగణిత గుణశీలుడు , హరిహరపుత్రుని ప్రియభక్తుడు అయిన గౌతమమహర్షి మాత్రము దీనిని భిన్నముగా
జీవించసాగెను. కావలసినంత తిండి , మిగతా వస్తువులను పొంది క్షామము యొక్క ఛాయలు కనిపించని విధముగా జీవించుచుండెను.

యజ్ఞయాగాదులకు కావలసిన సరంజామా అయితేనేమీ , మిగతా వస్తువులకేమి , అక్షయపాత్రవలె దేనికీ కొరతలేక యుండెను. మిగతా జనులందరికీ తిండి లేకపోయెనుగానీ , గౌతముని ఆశ్రమ
వాటిక యందు మాత్రము పాలు , తేనెలు ప్రవాహము వలె ప్రవహించసాగినవి.

ఇది చూచిన మిగతావారందరూ *“మనమంతా తపస్సంపన్నుడైన గౌతముని వద్దకు పోవుదుము. ఈ దారిద్ర్యము నుండి మనలను కాపాడి రక్షించును”* అనుకొని అతడి వద్దకు పోయిరి. వచ్చిన వారిని సాదరముగా ఆహ్వానించిన గౌతముడు వారికి కావలసిన అన్నపానీయములను సమృద్ధిగా వడ్డించెను. ఇంతమందికి పంచిననూ అతడి సంపద కొంచెమైననూ తరగలేదు.

ఇదంతయూ గమనించిన ఇంద్రునికి గౌతమునిపై అధికముగా కోపము కలిగెను. వర్షము యొక్క రాక , పోకలకు కారణము అతడే కదా. లోకులను దండించుటకై తాను వర్షము కురియకుండునట్లు చేయగా బాధితులైన వారిని గౌతముడు ఆదరించుటచే ఆగ్రహము బూనినాడు. అదియునూగాక , అంతకు మునుపు గౌతముని భార్య అయిన అహల్యను ఇంద్రుడు బలాత్కరించబోవగా , ఇంద్రుని ఒడలంతయూ వేయి యోనులు కలుగునట్లుగా గౌతముడు శపించి యున్న కారణముగా , ఆ కోపము ఇంకనూ అధికమయ్యెను. గౌతమునిపై కక్ష తీర్చుకొను సమయమునకై వేచి యుండెను.

జనులందరూ క్షామము వాత పడకుండా తప్పించినందులకై పొగడుట చూచిన తక్కిన బ్రాహ్మణులకు ఈర్ష్య కలిగినది. ఇది గమనించిన ఇంద్రుడు తాను కూడా ఒక బ్రాహ్మణుని వేషం ధరించి , వారి మనస్సున గౌతమునిపై గల ఈర్ష్యకు ధూపము వేయసాగెను.

*“గౌతమయుడు సౌమ్యుని వలె కనిపించు వంచకుడు. ప్రతిదినమూ ఒక పశువును చంపి , భుజించువాడు. ఆ విషయము మీకు తెలియునా ?”* అని వారి మనస్సులందు అనుమాన బీజములు నాటెను. తన మాటలు నిజమని నమ్మించుటకై , ఒక మాయ పశువును సృష్టించి , దీక్షలో నున్న
గౌతముని ఎదుట , అతడి తపము భంగము కలిగించునట్లుగా తిరుగాడునట్లుగా చేసెను. తపోభంగమై
కనులు తెరచి చూచిన గౌతముడు కోపముగా తన చేతనున్న దర్భతో పశువును అదలించగా , అది
కింద పడి మరణించినది. ఇది చూచిన తక్కిన బ్రాహ్మణులు , గౌతముడు గోహత్యాపాతకము చేసినట్లుగా భ్రమపడిరి. ఇంతకాలమూ తమను గౌతముడు ఆదరించిన విషయమును సైతము మరచిపోయి , ఇష్టము వచ్చిన రీతిని నానా దుర్భాషలాడిరి. విస్తుబోయిన గౌతముడు జరిగిన దానిని తన జ్ఞానదృష్టితో చూచి , విషయమును అర్థము చేసుకొనెను.

తనపై కక్షబూనిన ఇంద్రుని చూచి , *“మూఢుడా ! నాపై నిందవేసిన నీవు , ఇరువురు బ్రాహ్మణులను చంపి , బ్రాహ్మహత్య పాతకమును పొందుదువుగాక"* అని శపించెను.

తన వలన మేలు పొందియూ , తన పట్ల అనుచితముగా ప్రవర్తించిన బ్రాహ్మణులనుద్దేశించి *“విప్రులారా ! బుద్ధిహీనులై , కృతఘ్నులై మీరు చేసిన పని నన్ను అమితముగా బాధించినది. మీలోని జ్ఞానము నశించిపోవుగాక. ఆచార సంప్రదాయములను మరచి నాస్తికులై సంచరింతురుగాక. భగవంతుని చేరు మార్గమును గుర్తెరుగని వారగుదురుగాక , ఈ శాపము మీ యొక్క సంతానమునకునూ వర్తించునుగాక”* అని శపించెను.

చేసిన తప్పును గ్రహించిన బ్రాహ్మణులు , గౌతమునికి ఎన్నో విధముల ప్రార్థనలు చేసి , తమ
శాపవిమోచనమును చేయుమని ప్రశ్నించిరి. ముందుగా ఆగ్రహించిననూ , తరువాత వారి పట్ల కరుణబూనినవాడైన గౌతముడు *“బ్రాహ్మణులారా ! కలియుగమునందు మీరు బ్రాహ్మణులై జన్మించి , జ్ఞానతత్వమును మరచిపోవుదురుగాక. నిత్యకర్మలను , ఆచార సంప్రదాయములను గ్రహింపకుందురు గాక. మిమ్ములను కాపాడుటకై అవతరించిన జ్ఞానబోధ తత్వమును మీరు గ్రహించిన తరువాతనే మీకు విమోచన కలుగును. విధివ్రాతను ఎవరూ తప్పించలేరు.*

వారిని పంపిన పిమ్మట గౌతముడు తనలో తాను ఇట్లు అనుకొనసాగెను. *"మాయ పశువే కావచ్చునుగాక. దాని మరణమునకు నేనే కారణమగునట్లు చేసితిరి కదా !”* అని నిందించుకొనెను. తన బాధలు తీరుటకై పాపసంరక్షకుడూ , భక్తవత్సలుడూ అయిన మహాశాస్తాని గూర్చి తపము
చేయనెంచెను.

నిందమోపబడినవాడై , వేదనాపరుడై , దట్టమైన సోమారణ్యము అను అడవికి , జయంతీ అను క్షేత్రమునకు మధ్య గల గ్రామమును చేరిన గౌతముడు , ఒంటరిగా తపోదీక్ష పూని , మహాశాస్తాని గూర్చి యాగము చేయసాగెను.

గౌతముని యొక్క ధృడభక్తికి , చేసిన యాగమునకు మెచ్చిన శాస్తా పూర్ణా పుష్కలాసమేతునిగా దర్శనమిచ్చెను. అంత గౌతముడు హరిహరాత్మాజా , రైవతాచల నిలయా ! సకల కల్యాణగుణ సంపన్నా , దోషరహితా ! మీ పాదపద్మములే శరణు అనుకొని జీవించుచున్న , నా యొక్క పాపమును పరిహరింతువుగాక" అని అర్థించెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow