ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుడిని కూడ నా ఇంటియందు ఉంచుకొందునని నిశ్చయించుకొనెను.
ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను, ఆ రాక్షసుడు దేవీ భక్తుడు మిక్కిలి దివ్యశక్తులను సంపాదించెను, తాను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడ సంపాదించెను. ఆ రక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమె పై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు, శివుని తపముచే మెప్పించి శివుని త్రిశూలమును వరముగా పొందెను. శివుడును వానికి శూలమును ఇచ్చుచు “ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించెదవని” అని చెప్పి ఇచ్చెను. వర గర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువు ఎవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై ఏవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను.
అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి “సుందరీ! నన్ను వరించు" మని యడిగెను, ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక తిరిగి వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను. శుభ ముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ ఏనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తము ఉన్నది, అంత వరకు ఆగమని చెప్పెను.
రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును, ఈ లోపున నిన్నేమియు బాదింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చెదననగా ఆమె ఏమియూ మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల అడుగగా ‘నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగం ఎచట ఉన్నదో చూపు' మని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను.
విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను. ఆశ్చర్యపడి ‘అమ్మాయి! నీవిచటనున్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.
నారదుడు ఆమె చెప్పినదంతయును వినెను. అమ్మాయీ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.
విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను.
నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును, కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును, ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.
హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వర గర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి, సద్గుణ శీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును. అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను.
హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను.
రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను, వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి, అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.
మాఘపురాణం 16వ అధ్యాయం పారాయణం సంపూర్ణం..
