మాఘ పురాణం - 17వ అధ్యాయము | ఇంద్రునికి కలిగిన శాపము: | Magha Purana - Chapter 17 | The Curse of Indra:
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

మాఘ పురాణం - 17వ అధ్యాయము | ఇంద్రునికి కలిగిన శాపము: | Magha Purana - Chapter 17 | The Curse of Indra:

P Madhav Kumar
వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను…

రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగానది తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభం అగును. అటువంటి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాప నాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతః కాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడు అయినట్టుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు…

పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను అధ్యయనం చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి, ఆమె ఒక నాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహ పరవశుడయ్యెను. అమెను ఎటులనైనా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను.

మిత్రవింద ముని తెల్లవారు జామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశమై ఇంద్రుని పొందుకు అంగీకరించెను, కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్లేందుకు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవు ఏవడవని అడిగెను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవు అయి స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగా నదీ తీరమును చేరి అక్కడ తపము ఆచరించి యోగ శక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను.

ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజైన ఇంద్రుడు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరముల యందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసము అగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించు కొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి, మునులు వారిట్లనిరి.

దేవతలారా వినుము మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకమునందు స్నానము చేయుట శ్రీమహా విష్ణు పూజ, పురాణ పఠనము, యధా శక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘ శుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిల దానము ఆవూప దానము, పాయస దానము, వస్త్రకంబళముల దానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహా విష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు, మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి.

దేవతలును దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి.

స్వామీ! నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఏవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులు అయినారు. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ! అటువంటి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు.

పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును యెరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వ వ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉర్దవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై, పూర్వమువలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు, కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.

దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వగ్ధుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపి ముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాస కాలము అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి.

అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీ చన్నీటి స్నానము బాదాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆశక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను అతని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వుడి భార్య మాఘ స్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు.

విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, ” విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామ వాంఛకులోనై నీ తపశ్శక్తిని అంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

దేవతలారా! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.

మాఘపురాణం 17వ అధ్యాయం పారాయణం సంపూర్ణం..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow