అంతరింద్రియముల శుద్ధి కొరకు ప్రాణాయామమును నిష్ఠించవలెను. సాధకుడు పద్మాసనాసీనుడై కూర్చుండి మూలబంధ, ఉడ్యాణబంధముల నాచరించి కనిష్ఠ-అనామిక వేళ్లతో ముక్కు యొక్క ఎడమ భాగమును బిగియబట్టి, మాత్రాగణనము లేకుండగ ముక్కు యొక్క కుడి రంధ్రము నుండి లోపలి వాయువును పూర్తిగా వెలుపలికి వదలవలెను. (రేచకము)
పిదప ముక్కు యొక్క కుడి భాగమును బొటన వేలితో బిగియబట్టి, ఎడమ రంధ్రము నుండి నెమ్మదిగా (విధాసముగ) ౧౨ మాత్రల కాలము వాయువును లోపలికి పీల్చుకొని (పూరకము) కనిష్ఠానామికలతో దానిని బిగియబట్టి ౧౨ మాత్రల కాలము కుంభకము (నిల్పి) జేసి, మరల అన్నే మాత్రల కాలము కుడి భాగము నుండి రేచకము గావించ (వెలుపలికి వాయువును వదలి) వలెను.
ఇట్లు మూడు సార్లు ఆచరించిన మధ్యమ ప్రాణాయామమనియు ఇట్లే 36 మాత్రల కాలము ఆచరించినచో శ్రేష్ఠమైన ప్రాణాయామమని పేరు. దీనిని గురు ముఖమునుండి దెలిసికొని చాల మెలకువతో జేయవలెను. తరువాత చేయి కడుగుకొనవలయును.