సర్వపూజా ప్రకరణము
ప్రార్థన
ఓంకార అయసద్గురుం పరశివం మాహేశ్వరం భాస్కరం| నందీశాదిగణాన్ ప్రణమ్యమునిభిః సర్వైః ప్రణీతంపురా || తత్సం గృహ్య జగద్ధితాయసుధియాంతోషాయ రుద్రాభిధో | దైవజ్ఞో ద్వ్యసయం పురోహిత ఇతిగ్రంథః కృతస్ముద్రా ||
శ్రీ సూర్యోదయమునకు ముందే (అరుణోదయంతో) నిద్రలేచి శివుని స్తుతించి (ధ్యానించి) నిత్యకర్మలను ముగించి, స్నానమొనర్చి, భస్మ ధారణము జేసికొని, శుచియై, పూజోపచార ద్రవ్యములను సంగ్రహించుకొని, (పూజకు అవసరమైన పూజా సామాగ్రిని సిద్ధపరచుకొని) కంబలాది (గొంగడి మున్నగు) ఆసనమునందు కూర్చొని, ఆచమన ప్రాణాయామముల నాచరించి, స్థిరమనస్కుడై, “శ్రీమన్మహా గణాధిపతయే నమః ఉమా మహేశ్వరాభ్యాం నమః మాతాపితృభ్యాం నమః | ఏతత్కర్మ ప్రధాన దేవతాభ్యో నమః |”
“అవిఘ్నమస్తు” అని ఉచ్చరించి “మదీయ అభిప్సితార్థ సిద్ధ్యర్థం పూజితోయః సురాసురైః | సర్వవిఘ్న హరస్త స్మై గణాధిపతయేనమః”
అని ధ్యానించి
“ఆగమార్దంతు దేవానాం - గమనార్థంతు రక్షసాం | కుర్యాద్ఘంటారవంభక్త్యా - దేవతాహ్వానలక్షణం || ఘంటామూలేతధాదేవి - గర్భేద్వశిరమూలకే | వసవశ్చూలమగ్రస్థా - సర్వేవసతు శంకర” ||
అని ఘంటానాదముజేసి, తరువాత సంకల్పమును పఠించాలి.
“ఓం శివ శివ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్వాద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే మేరోర్దక్షిణ దిగ్భాగే భరతఖండే, భరతవర్షే దండకారణ్యే గోదావర్యాః దక్షిణకూలే శాలివాహనశకే బౌద్ధావతారే శివక్షేత్రే అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే ¹అస్మిన్ సంవత్సరే, అస్మిన్నయనే, అస్మిన్ ఋతౌ, అస్మిన్ మాసే, అస్మిన్ పక్షే, అస్మిన్ తిథౌ, అస్మిన్ వాసరే, అస్మిన్ శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ, యుక్తాయాం అస్యాం శుభ పుణ్యకాలే మమ ఆత్మనః వేదోక్త (వాపురాణోక్త) ఫలప్రాప్త్యర్థం అస్మాకం సహకుటుంబానాం సపరివారాణాం క్షేమ, స్థైర్యవిజయాయురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం సమస్త మంగళ ప్రాప్త్యర్థం సమస్తాభ్యుదయార్థంచ శ్రీ ²అముక దేవతా ప్రీత్యర్థం యథా మిలితోపచారద్రవ్యై ధ్యానావాహనాది షోడశోపచార ద్రవ్యైః పూజాం కరిష్యే “ఆరబ్భస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీ మహాగణపతిపూజాం కరిష్యే”
అని యుచ్చరించి, పూజజేయువారు స్త్రీలైనయెడల
¹అస్మిన్ననేచోట పూజా దినమునందున్న సంవత్సరాదులను పేర్కొన వలయును. వీరశైవులికిది వర్తింపు కాదందురు కొందరు. ²అముకనేచోట తాను పూజించే దేవతా నామమును జేర్చుకొనవలెను.
మంత్రము :- “మమఇహజన్మని, జన్మాంతరేశుచ, అఖండ సౌభాగ్యాది మనోవాంఛిత కామానా సిద్ధ్యర్థం “అముక” దేవతా ప్రీత్యర్థం యథా మిలితోపచారై...పూజాం కరిష్యే” అని యుచ్చరించునది.
తదుపరి పూజకొరకు దెచ్చిన కలశమును (శుద్ధజలముతో నింపిన చెంబు లేదా కడవను-బిందెను) తనకు కుడి భాగమున ఉంచి
మంత్రము :- “ఓం తత్త్వా యామి బ్రహ్మణా వందమానస్త దాశాస్తే యజమానో హవిర్భిః | అహేడమానో వరుణేహ బోధ్యురుశగ్ం సమానఆయుః ప్రమోషీః” అస్మిన్ కలశే ఓం వరుణ ఇహాగచ్ఛేహతిష్ఠ.
ఇతి వరుణమావాహయామి అని యుచ్చరించి వరుణుని ఆవాహించి
మంత్రము :- “ఓం అపాంపతివరుణాయ నమః గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పం సమర్పయామి”
అని యుచ్చరించి గంధాక్షతాదులతో పూజించి కలశోదకముచేత పూజా ద్రవ్యములను శుద్ధి యొనర్చునది.
మంత్రము :- “ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోఽపివా | యస్స్మరేద్దే వదేవేశం సబాహ్యాభ్యంతరశ్శుచిః”
అని యుచ్చరించి, పూజాద్రవ్యములపై నీరును బ్రోక్షించి, శుద్ధము గావించుకొనవలెను. పిదప దీపమును
దీపమును పూజించు క్రమము
మంత్రము :- “భోదీపత్యం బ్రహ్మరూప అంధకార నివారక | ఇమా మయాకృతా పూజాంగృహ్లాస్తేజః ప్రవర్ధయ” అని యుచ్చరించి,
“ఓం దీపాయ నమః గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పం సమర్పయామి” అని పఠించి పూజించవలెను. తరువాత
గణపతి స్థాపనా క్రమము
గణపతి విగ్రహమునుగాని, అథవా చిత్రపటమునుగాని, లేదా రెండు పోకలను తమలపాకులపై బెట్టిన అది గణపతి స్థాపన యగును. ఇకముందు ఆ పోకలనే గణపతిగా భావించి,
మంత్రము :- “ఓం మహా గణాధిపతయే నమః గంధంధారయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి”
అని పంచోపచారములతో గణపతిని పూజించాలి.
