ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత వచ్చే నాలుగోరోజు సంకష్టహర చతుర్థి. ఆరోజున గణపతి ఆరాధన చేయాలి. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను తొలగించి, విజయపథంలో నడిపిస్తుంది. తలపెట్టిన ఏ పనీ ముందుకు పోకుండా, అన్నిటా విఘ్నాలు కలుగుతూ ఉన్నప్పుడు... అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు బాధిస్తున్నప్పుడు... రుణబాధలతో పాటు జీవితంలో అనేక రకాలయిన కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు... ప్రతి మాసంలోనూ సంకట హర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలగడంతోబాటు, కార్యజయం కలుగుతుంది. ఆ వ్రతవిధానం ఇలా ఉంటుంది... సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో వేయాలి. తమలపాకుల్లోరెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మూటకట్టాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవాలి. శక్త్యనుసారం గరిక పూజ కాని , గణపతి హోమం కాని చేయించుకోవచ్చు. తదుపరి గణపతి
ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించిన తరువాత తినాలి.