*పద్మాక్షి దేవాలయం*
🍁పద్మాక్షి దేవాలయం వరంగల్ జిల్లా హన్మకొండ నగరం నడిబొడ్డున వేయి స్తంభాల గుడికి అతి దగ్గరలో పద్మాక్షి దేవాలయం ఉంది.
*ఆలయ విశేషాలు*
🍁ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయంలోని ప్రధానదైవం పద్మాక్షి అమ్మవారు. కాకతీయ రాజుల ఇలవేల్పు, ఆరాధ్య దైవం పద్మాక్షమ్మ. 10వ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు వేయిస్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించారని కొందరు చరిత్రకారుల వాదన. కాకతీయుల ముసునూరి రాజులు అమ్మవారని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం యుద్థముహుర్తాలకు, శుభగడియలుగా భావించి శత్రువులపై యుద్ధం ప్రకటించి విజయం సాధించే వారట.
🍁ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది. మతపరమైన ప్రకృతికి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను, నగరవాసులను ఆకర్షిస్తున్నది. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ "బసది" అనే జైనమందిరం ఉండేదని చరిత్రకారులు చెపుతున్నారు.
🍁గుడి ఆవరణలో ఇప్పటికీ జైనతీర్ధంకరుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం సా.శ. 1117 లో నిర్మించబడింది. ఈ ఆలయం ఎత్తైన గుట్టమీద ఉన్న ఓ కొండను తొలిచి నిర్మించారు.[1] ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తుంటారు. గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు.
🍁ఆలయ ప్రవేశద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవొచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు. దీనిమీద ఉన్న చెక్కడాలు, శాసనాలు చూసే ఇది జైనుల యొక్క స్తూపం అని, జైనుల దేవత క్దలలయకు అంకితం చేసారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. సంవత్సరం పొడుగునా వొచ్చే సందర్శకులు ఈ స్తంభం యొక్క ఉపరితలాన్నిచూసి ఆశ్చర్యానందాలతో ఈ కట్టడం వెనుక ఉన్న పనితనాన్ని పొగుడుతుంటారు.
🍁గుట్ట పై భాగంలో భక్తులు సేదతీరడానికి ఆలయ ప్రాంగణం ఉంటుంది. అక్కడి నుండి చూస్తే హన్మకొండ నగరమంతా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న గరుడ రూపాన్నే కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజపతాకంగా ఉపయోగించుకొన్నాడట. అంతేకాదు జైన తీర్ధంకరులు శాంతినాద తమ లాంఛనానికి కూడా వాడుకొన్నారట .ఇది మరో గొప్ప విశేషం. పద్మాక్షి దేవి ఆలంయంలో ఒక అద్దం ఉండేదట. అద్దం వెనుక నుండి ఉన్న సొరంగం భద్రకాళి దేవాలయం వరకు ఉండేదని, కాలక్రమంలో దానిని కాస్తా మూసివేశారని కొందరు అంటున్నారు.
🍁పద్మాక్షమ్మ గుట్ట దిగువన ఓ అందమైన చెరువు కూడా ఉంది. ఇక్కడ ప్రతి యేటా బతుకమ్మ, దసరా ఉత్సవాలు తెలంగాణ లోనే అత్యంత వైభవంగా జరుగుతాయి.