🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸14 నాట్యసమత్తాండి కధ
పూర్వం కంచిలో నాట్యసమత్తాండి అనే భక్తుడుండేవాడు.ఆయన ఒకసారి శివాలయానికి వెళ్ళి అక్కడ తాండవ లింగమూర్తి దర్శనం చేశాడు.
🌿తాండవ శివుడు ఎలా వుంటాడో మీకు తెలుసుగా? ఒక కాలు నేల మీద మోపి, ఇంకొక కాలు ఆకాశానికి ఎత్తి, వంగిన నడుము ఆ భంగిమ చూసి గుడి పూజారితో ఆ భక్తుడిలా అడిగాడు..
🌸ఈ శివుని ఆకారమిలా వికృతంగా వుందేమిటి? ఒక కాలు నేల మీద, ఇంకో కాలేమో ఆకాశంలో, శరీరమంతా ఒక పక్కకి ఒరిగి వుంది. చేతులూరికే కదులుతున్నవి.
🌿పిడికిట్లో ఏదో పట్టుకున్నాడు. చెయ్యి కదిలినప్పుడల్లా అదేమిటో వింత ధ్వని చేస్తున్నది. కనులు మూసుకున్నాడు.మెడలో హారాలన్నీ చిక్కుబడి వున్నాయి.
🌸జుట్టు విరబోసుకున్నాడు. పక్కన పార్వతీ దేవి లేదు.ఆవిడో పక్కన కూర్చుని చూస్తున్నట్లున్నది.ఇవ్వన్నీ చూస్తే నాకు భయం వేస్తోంది.
🌿ఏమిటి ఈ శివయ్య పరిస్ధితి? ఎందుకీలా వున్నాడు? ఆయనకేమీ అనారోగ్యం చెయ్యలేదు కదా?అని ఆ అమాయక భక్తుడు అర్చకుణ్ణి మరీ మరీ అడుగుతుండటంతో అర్చకుడు ఆ భక్తుణ్ణి మోసం చెయ్యాలనుకున్నాడు.
🌸ఓ భక్తవరేణ్యా, నీకేమని చెప్పను? ఈ పరమేశ్వరునికి ఒక మహా వాత రోగం వచ్చింది. తగిన మందు పడకపోతే అదిచాల ప్రమాద మవుతుంది తగిన ధనము లేక నేనివ్వలేక పోతున్నాను.
🌿అనగానే ఆ అమాయక భక్తుడు పరుగున తన ఇంటికి పోయి తనకున్న ఆస్తినంతా తెగనమ్మి ధనము తీసుకొచ్చి అర్చకుడి చేతికిచ్చి వెంటనే మందు చేసి ఇవ్వండి. ఈ రోగము త్వరగా తగ్గించండి.
🌸శివయ్య రోగం తగ్గితే నా భార్యా, పుత్రులు, నేను, మా జీవితాంతం మీకు ఊడిగం చేస్తూ వుంటాము.అని వేడుకున్నాడు.
🌿ఆ అర్చకుడు ఒక పొయ్యి పెట్టి, పెద్ద గిన్నె పెట్టి అందులో కొంత నూనె, కొంత ఆముదము పోసి, ఆముదపాకులు, జిల్లేడు ఆకులు, ఇంకా కొన్ని ఆకుల పసరు తీసి పోశాడు.
🌸బాగా మరిగించి దించి, వడగట్టి దానిని ఆ భక్తుడి చేతికిచ్చి ఇది నేను ప్రత్యేకించి తయారు చేసిన తైలము. దీన్ని మహా వాయు తైలము అంటారు.
🌿దీనికిదే మందు. నువ్వు ప్రతి రోజూ దేవుని శరీరానికీ తైలాన్ని మర్దన చేస్తూ వుండు. జబ్బు నయమవుతుంది” అని చెప్పాడు.
🌸ఆ భక్తుడు ప్రతి నిత్యము ఆ తైలాన్ని మృత్యుంజయుని శరీరానికి మర్దించ సాగాడు.కొన్నాళ్ళకా తైలము అయిపోవటంతో తానే మరి కొంత తైలము ఆకు వసరులు కలిపి వండి,
🌿స్వామి శరీరానికి రాయసాగాడు. ఇసుక మూటలతోను, వేడినీళ్ళల్లో గుడ్డ ముంచీ కాపడం పెట్టేవాడు.ఎన్ని చేసినా శివుడు కుదుట పడకపోయే సరికి విసిగి ఇంక నీ రోగము ఈ మందులతో నయం కాదు.
🌸ఇట్టి వాతములకు మహామావియె తగిన మందు. మహామావి అంటే సలసల మరిగే నూనెలో వుడికిన సర్వావయోపేత మానవ దేహపు మాంసం ముద్దకదా.
🌿నేనట్లాంటి మందివ్వకపోతే నీ రోగం తగ్గదు.కనుక ఇప్పుడే అట్లాఅవుతాను అని కాగుతున్న పెద్ద గంగాళంలో నూనెలో దుముకబోతుండగా శివుడు ప్రత్యక్షమై,వత్సా, నీ భక్తికి మెచ్చాను.
🌸ఏదైనా వరం కోరుకో” అన్నాడు. ఈ భక్తుడు స్వామీ, నా వరం సంగతి తర్వాత. ముందు నీకీ రోగం ఎట్లా వచ్చిందో అది చెప్పండి.ఇది ఎట్లా మానుతుంది
🌿ముందీ రోగాన్ని తగ్గించుకుని నీ ఆరోగ్యమైన శరీరాన్ని నాకు చూపించు” అన్నాడు.దానికి ఆ పరమేశ్వరుడు, నాయనా, ఇది రోగము కాదు.
🌸నేను మహా నటుడను. నాట్యము చెయ్యాలనుకుంటే నా ఆకారమిలాగే వుంటుంది. నేను జగన్నాటక సూత్రధారుడను.భూమియే నా నాట్యరంగము.
🌿అలాగే ఆకాశం కూడా నేను తాండవ మాడునపుడు నా అర్ధాంగి నా తాండవమునకు సాక్షియై చూస్తూ వుంటుంది.
🌸అందుకే ఆవిడకి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అనే పేరు కూడా వుంది. ఒక్కోసారి సకల దేవతల ముందు కూడా తాండవ మాడుతుంటాను.
🌿నేనెప్పుడు నాట్యము చేసినా పార్వతి నా ప్రక్కనే కూర్చుండి చూస్తూవుంటుంది. ఇది తాండవ వేషమే గాని రోగము లేదు.
🌸ఈ నా తాండవ రూపమును దర్శించినవారికి మరు జన్మలేదు. నీకూ మరో జన్మలేదు. నువ్వూ నాతో కైలాసానికి వచ్చి ఈ శరీరంతోనే నా సన్నిధిలో వుండు అని ఆతనిని తనతో తీసుకుని వెళ్ళాడు శివుడు.
🌿చూశారా, అమాయకంగానైనా శివుణ్ణి అంతలా నమ్మినవారికి మోక్షము తప్పక వస్తుందని ఈ కధ నిరూపిస్తుంది కదా...సశేషం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿