*విజ్ఞానిని , జ్ఞాన స్వరూపాన్నీ ,ప్రాణులలో ప్రాణస్వరూపుడను నేనే* 🌹
🌺పరమేశ్వరా! భోగాన్నీ మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి వుంటుంది . యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికీ ధ్యానానికీ గమ్యమైనవాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్త్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా :
🌺నేను విష్ణువును. నేనే అందరికీ ఈశ్వరుడను. నేనే అనంతుడను. షడూర్మ రహితుడను నేనే. నేను వాసుదేవుడను. నేనే జగన్నాథుడను. బ్రహ్మరూపమూ నాదే. సమస్త ప్రాణుల శరీరాలలోనుండు ఆత్మనూ, సర్వదేహ విముక్తుడైన పరమాత్మనూ నేనే.
🌺 షదూర్మ - శోకమోహొ జరా మృత్యూ క్షుత్పిపానే షదూర్మయః - అని శబ్ద కల్పద్రుమంలో చెప్పబడింది. శోకం, మోహం, ముసలితనం, మరణం, ఆకలి, దప్పిక అనే ఆరు ఊర్ములు మనిషిని బాధిస్తాయి. యోగిని బాధించలేవు.
🌺 క్షరానికీ (ప్రపంచం) అక్షరానికీ (చేతన) అతీతుడను, శరీరధర్మరహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రి యుడను, శ్రోతను, ఘాత (గంధాన్ని) గ్రహించు నేనే.
🌺అందరి మనసులలో నేనుంటాను గాని నాకు మనసు లేదు. విజ్ఞానిని జ్ఞాన స్వరూపాన్నీ నేనే. ప్రాణులలో ప్రాణస్వరూపుడను, అహంకారాది రహితుడను, అహంకార జన్య వికారాల నుండి కూడ ముక్తుడను నేనే.
🌺ఈ జగత్తుకి సాక్షినీ, నియంతనూ నేనే. పరమానంద స్వరూపమూ నాదే. జగత్తు యొక్క జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలకు సాక్షీభూతుడనైన నాకు ఏ అవస్థలూ వుండవు. తురీయ బ్రహ్మనూ ,విధాతనూ నేనే. "దృగ్రూప పరమాత్మను నేనే. (సమస్త ప్రపంచానికి ద్రష్టం, దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ మూడూ పరమాత్మే. ఆయనే దృగ్రూపుడు) నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప 'పరమాత్మను నేనే'.
🌺ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని, తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి, ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యానయోగము. సువ్రతులలో ఉత్తముడవగు శంకరదేవా! నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలిగావు. ఇకపై ఈ ధ్యాన యోగమును పఠించిన వారికి చింతన, మననాలను చేసేవారికీ విష్ణులోకం ప్రాప్తిస్తుంది.