*శక్రాదిస్తుతి - 2*
"దేవీ! నీ ప్రసాదంతో ధన్యుడైనవాడు మిక్కిలి ఆదరంతో నిత్యం సర్వధర్మకార్యాలను చేస్తాడు. అందుకే అతడు స్వర్గాన్ని పొందుతాడు.
కాబట్టి దేవి! ముల్లోకాలలో ఫలితాలను ప్రసాదించే తల్లివి నీవే కదా !
'కష్టవేళలలో నిన్ను తలచుకునే వారందరికీ నీవు భయాన్ని నివారిస్తావు. స్వస్థులై సుఖించేవారు నిన్ను తలిస్తే అంతకన్నా శుభాధికమైన బుద్ధిని ఇస్తావు. పేదరికాన్ని, కష్టాలను, భయాన్ని పోగొట్టే ఓ దేవీ! ఎల్లరకు ఉపకారం చేయగల చల్లని చిత్తం నీకు తప్ప మరి ఏ దేవతకు ఉంది?
"వీరిని చంపడం వల్ల లోకాలకు సుఖం కలుగుతుంది. వీరు చిరకాలం నరకంలో నుండదగిన పాపాలు చేసినవారైనా, చివరకు (నా తో) యుద్ధంలో మృతులై స్వర్గాన్ని పొందుతారుగాక' అని ఇలా తలచి దేవీ! నీవు (మా) శత్రువులను చంపుతావు..
“అసురులందరనీ నీ చూపుమాత్రంతోనే భస్మం చేస్తావు గదా! నీవు వారిపై శస్త్రాలను ప్రయోగించడమెందుకు? అని అంటే 'శత్రువులుగా కూడా ఆ శస్త్రాల చేత పవిత్రత పొంది ఉత్తమ లోకాలను పొందుతారుగాక' అని నీకు వారిపై కూడా గల అత్యంత సాధుచిత్తం ఇటువంటిది.
“నీ ఖడ్గం నుండి వెలువడే భయంకరద్యుతుల చేత, నీ శూలాగ్రం నుండి వెలువడే కాంతిసమూహం చేత అసురుల కన్నులు విలయం చెందకుండడానికి కారణం, (చల్లని) కాంతులు వెదజల్లే బాలచంద్రుని పోలు నీ యోగ్యమైన ముఖాన్ని కూడా వారు చూడడమే.
“దేవీ! దుష్టుల ప్రవర్తనను అణచడమే నీ స్వభావం. అలాగే ఈ నీ అసమాన సౌందర్యం ఇతరులకు దురవగాహమైనది. దేవతల పరాక్రమాన్ని అపహరించిన వారిని నీ శక్తి నాశనం చేస్తుంది. ఇలా నీవు నీ దయను వైరులపై కూడా ప్రకటించావు.
“నీ ఈ పరాక్రమాన్ని దేనితో పోల్చతగుతుంది? అత్యంత మనోహరమయినా, శత్రువులలో భీతిని కలిగించే నీ సౌందర్యం మరెక్కడ కనిపిస్తుంది! హృదయంలో కృప, యుద్ధంలో నిష్ఠురత మరెక్కడ కనిపిస్తుంది! దేవీ! వరప్రదాయినీ! ముల్లోకాలలో నీలో మాత్రమే ఇవి కానిపిస్తాయి.
"వైరులను వినాశమొనర్చి నీవు ఈ మూడు లోకాలను రక్షించావు. యుద్ధంలో వధించి శత్రుగణాలను కూడా స్వర్గానికి చేర్చావు. మదోన్మత్తులైన సురవైరుల భయం మాకు తొలగించావు. నీకు ప్రణామాలు.
*సశేషం.........*