*ధూమ్రలోచన వధ - 2*
అంతట దేవి వాహనమైన సింహం కోపంతో కేసరాలు (జూలు) విదుల్చుతూ, మిక్కిలి భయంకరంగా గర్జిస్తూ అసురసైన్యం పై పడింది.
కొందరిని తన ముంద్రి కాలి దెబ్బతోను, కొందరిని తన నోటితోనూ, మరికొందరు మహాసురులను తన వెనుక కాళ్లతో తొక్కి అది చంపింది.
సింహం తన గోళ్లతో కొందరి లోకడుపులను చీల్చింది; మరికొందరి శిరస్సులను తన "పంజా" దెబ్బతో ఖండించి వేసింది.
ఇతరుల బాహువులను శిరస్సులను విచ్ఛిన్నమొనర్చింది. జూలు విదుర్చుతూ మరికొందరి లోకడుపుల నుండి రక్తపానం చేసింది.
మిక్కిలి కినుకబూని ఉన్న ఆ దేవీ వాహనమైన వీర్యవంత మైన సింహం క్షణకాలంలో ఆ సెన్యానంతటిని నాశనం చేసింది.
ధూమ్రలోచనాసురుడు దేవిచే చంపబడడం, పిదప ఆమె సింహంచే అతని సైన్యమంతా పరిమార్పబడడం విని దైత్యాధిపతి అయిన శుంభుడు రోషంతో పెదవి అదుర, చండముండ మహాసురులను ఆజ్ఞాపించాడు :
“ఓ చండా! ఓ ముండా! అచటికి బహుసైన్యసమేతులై పోయి, ఆమె తలపట్టి ఈడ్చుకొని గాని, బంధించి గాని, త్వరగా కొనిరండి. అలా చేయడానికి మీకేమైనా సంశయం కలిగితే, అసురులందరూ యుద్ధంలో ఆమెను తమ ఆయుధాలన్నింటితో హింసిస్తారుగాక.
“ఆ దుష్టురాలు గాయపరచబడి ఆమె సింహం పడగొట్టబడి నప్పుడు ఆ అంబికను పట్టుకొని, బంధించి ఇచటికి శీఘ్రంగా కొనిరండి.”
శ్రీ మార్కండేయ పురాణంలో సావర్ణి మన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “ధూమ్రలోచనవధ” అనే షషాధ్యాయము సమాప్తం.
*సశేషం..........*