*శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 22*

P Madhav Kumar



*ధూమ్రలోచన వధ - 1*


ఋషి పలికెను : దేవి పలికిన ఈ మాటలు విని కోపంతో ఆ దూత మరలవచ్చి ఆ మాటలను సవిస్తరంగా రక్కసులటేనికి తెలిపాడు.


అంతట దూత చెప్పిన ఆ మాటలను విని అసురరాజు మిక్కిలి కోపంతో దైత్యాధిపుడైన ధూమ్రలోచనునితో ఇలా చెప్పాడు: “ఓ ధూమ్రలోచనా! నీవు నీ సైన్యసమేతుడవై త్వరితంగా వెళ్లి ఆ దుష్టురాలిని బలాత్కారంగా వెండ్రుకలు పట్టుకొని లాగి, భయంతో శరీరం స్వాధీనం తప్పునల్గొనర్చి, ఇచటికి తీసుకురా.


"ఇతరుడు ఎవడైనా ఆమెను రక్షించడానికి నిలువబడినచో, వాడు వేలుపైనా, యక్షుడైనా, గంధర్వుడైనా వాడిని చంపు.”


ఋషి పలికెను : శుంభునిచే ఇలా ఆజ్ఞాపించబడి ఆ దైత్యుడు ధూమ్రలోచనుడు అంతట అరువైవేల మంది అసురులతో కూడి శీఘ్రంగా వెళ్ళాడు. 


మంచుకొండపై కూర్చొని ఉన్న ఆ దేవిని చూసి, "శుంభనిశుంభుల వద్దకు రమ్ము” అని గట్టిగా అరచిచెప్పాడు.


"నీవు ఇప్పుడు నా ప్రభువు వద్దకు ప్రీతితో రాకపోతే, నిన్ను బలాత్కారంగా వెండ్రుకలు పట్టుకుని ఈడ్చి, భయంతో ఒడలిపై స్వాధీనం తప్పేటట్లు చేసి, కొనిపోతాను.”


దేవి పలికెను : “నీవు అసురపతిచేత పంపబడ్డావు; బలం గలవాడవు; సైన్యసమేతుడవు. నీ విట్లు నన్ను బలాత్కారంగా కొనిపోతే, నిన్ను నేను ఏం చేయగలను?”


ఋషి పలికెను : 

ఇలా పలుకగా ఆ అసురుడు ధూమ్రలోచనుడు ఆమె వైపునకు పరుగెత్తాడు. అంబిక అంతట హుంకారమాత్రం (“హుం” అని గర్జించుట) చేత అతనిని భస్మీకరించింది.


అంతట ఆ అసుర మహాసైన్యం క్రోధంతో అంబికపై వాడియమ్ములను, భల్లములను, గండ్రగొడ్డండ్లను కురిపించారు.


 *సశేషం.........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat