*శ్రీ దేవీ మహత్యము -* *దుర్గా సప్తశతి - 26*

P Madhav Kumar


ఋషి పలికెను : చండదైత్యుడు వధింపబడి, ముండుడు కూల్పబడి, సైన్యంలో చాలా భాగం నాశనమైన పిదప దైత్యనాథుడూ ప్రతాపశాలి అయిన శుంభుడు కోపంతో పరవశతనొందిన మనస్సుతో అసుర సెన్యాలనన్నింటిని సన్నద్ధమై ఉండమని ఆదేశించాడు.


ఇప్పుడు ఎభై ఆర్గురు అసురులు- ఆయుధాలు ఎత్తి సిద్ధంగా పట్టుకొని- తమ బలాలు అన్నిటితో, స్వబలపరివేష్టితులైన ఎనభై నలుగురు "కంబులు”* వెడలిపోవుదురు గాక.


“నా ఆజ్ఞను పరిపాలించి కోటివీ ర్యాసుర* కుటుంబాలు ఏభై, ధౌమ కుటుంబాలు నూరూ బయలు వెడలుగాక.


“కాలక దౌర్హృదులు. మౌర్యులు, కాలకేయులు – ఈ అసురులందరూ కూడా నా ఆజ్ఞానువర్తులై వెంటనే యుద్ధసన్నద్ధులై బయలుదేరుతారు గాక.”


ఈ ఆజ్ఞలను ఇచ్చి చండశాసనుడు, అసుర నాథుడు అయిన శుంభుడు అనేకసహస్ర సంఖ్యగల మహా సైన్యంతో తాను బయలుదేరాడు.


అతిభయంకరమైన ఆ సైన్యపు రాకను చండిక చూసి తన అల్లెత్రాటి టంకారధ్వనితో భూమ్యాకాశాల మధ్య ప్రదేశాన్నంతా నింపివేసింది.


అంతట, రాజా! సింహం మహానాదం చేసింది. అంబిక ఆ సింహనాదాలను తన ఘంటానాదంతో ఇంకా వృద్ధిపరిచింది.


కాళి తన నోటిని విస్తారంగా తెరిచి, దిక్కులను హుంకార శబ్దాతో నింపి, ధనుష్టంకారం యొక్క, సింహం యొక్క, ఘంట యెక్క నాదాలను వినబడకుండేట్లు చేసింది.


ఆ నాదాన్ని విని అసుర సైన్యం రోషంతో (చండికా) దేవిని, సింహాన్ని, కాళిని నాలుగు దిక్కులా చుట్టుముట్టారు. 


ఓ రాజా! ఆ సమయంలో సురవైరులను నాశనం చేయడానికి, అమరేశ్వరుల శుభం కొరకూ బ్రహ్మవిష్ణుమహేశ్వరుల, కుమారస్వామి, ఇంద్రుని శరీరాల నుండి బహుబలపరాక్రమాలు గల శక్తులు: బయలువెడలి ఆయాదేవతల రూపాలతో శక్తి వద్దకు వచ్చారు.


ఏ దేవునిది ఏ రూపమో, అతని భూషణాలు వాహనాలతో ఆ విధంగానే అతని శక్తి అసురులతో యుద్ధం చేయడానికి వచ్చింది.


హంసలు పూన్చిన విమానమెక్కి, మాలా కమండలువులతో బ్రహ్మ యొక్క శక్తి వచ్చింది. ఆమె పేరు బ్రహ్మాణి. 


ఎద్దు పై ఉత్తమమైన త్రిశూలం ధరించి, పెద్ద సర్పాలను గాజులుగా కలిగి, చంద్రరేఖ విభూషణంగా దాల్చి మాహేశ్వరి వచ్చింది.


చేత బల్లెం దాల్చి, చక్కని నెమలిని ఎక్కి, కుమారస్వామి రూపంతో, అంబికా కౌమారి దైత్యులతో యుద్ధానికి వచ్చింది.


అలాగే విష్ణుశక్తి గరుడునిపై ఎక్కి, శంఖం, చక్రం, గద, శాస్రం (ధనుస్సు), ఖడ్గం, చేతులలో ధరించి వచ్చింది.


 *సశేషం.........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat