*చండముండ వధ - 1*
ఋషి పలికెను :
అంతట అతనిచేత ఆజ్ఞాపింపబడినవారై అసురులు చతురంగబల సమేతులై, ఆయుధాలు పైకెత్తి, చండముండులు ముందు నడుస్తూ బయలుదేరారు.
ఆ పర్వతరాజంపై ఒక గొప్ప బంగరు శిఖరంపై సింహంపై కూర్చుని చిరునగవుతో ఉన్న దేవిని వారు చూసారు.
ఆమెను చూసినప్పుడు కొందరు ఉత్సాహపూరితులై ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇతరులు వంపబడిన ధనుస్సులతో, ధరింపబడిన ఖడ్గాలతో ఆమెను సమీపించారు.
అంతట అంబిక ఆ శత్రువులపై ప్రచండ రోషపూరితయయ్యెను. ఆమె ముఖం సిరా వలె నల్లనయ్యింది.
బొమముడిపాటుతో భయంకరంగా ఉన్న ఆమె నొసటి నుండి హఠాత్తుగా ఘోర ముఖంతో, ఖడ్గపాశాయుధాలను ధరించి కాళికాశక్తి వెలువడింది.
విచిత్రమైన పుట్టెతలతో ఉన్న దండం దాల్చి, పుప్లైలపేరు ఆభరణంగా ధరించి, పెద్దపులిచర్మాన్ని కట్టుకొని, కండలు శుష్కించడంతో మిక్కిలి భీషణమై కనబడుతూ, తెరుచుకొని ఉన్న నోటితో, భయానకంగా వ్రేలాడు నాలుకతో, లోతుకుపోయిన ఎఱ్ఱని కన్నులతో, దిక్కులు పిక్కటిల్లే గర్జిరావాలతో ఆమె ఆ సైన్యంలోని మహాసురులపై రభసంగా పడి చంపి, ఆ సురవైరి బలాలను భక్షించివేసింది.
ఏనుగులను, వాటి వెంబడి వారితో, మానటీండ్రతో, స్వారి చేసే యోధులతో, ఘంటలతో సహా ఒక్క చేతితో లాగి పట్టుకొని నోట్లోకి విసరి వేసుకుంటూ ఉంది.
అలాగే తురగబలాన్ని, గుర్రలతో, రథంతో, సారథితో సహా నోటిలో వేసుకొని అత్యంత భయంకరంగా పళ్ళతో నమలివేసూ ఉంది.
ఒకణ్ణి జుట్టుపట్టి, మరొకణ్ణి మెడపట్టి లాగుకొంది. ఒకణ్ణి కాలితో తొక్కి, మరొకణ్ణి బొమ్ముతో నెట్టి సుగుజేసింది.
ఆ అసురులు ప్రయోగించిన శస్త్రాలను, మహాస్త్రాలను నోటితో పట్టుకొని రోషంతో పళ్ళతో నమలివేసింది.
దుష్టులు బలిష్ఠులు అయిన ఆ రక్కసుల సైన్యాన్నంతా, కొందరిని భక్షించి, మరికొందరిని కొట్టి, నాశమొనర్చింది.
కొందరు ఖడ్గంతో నరకబడ్డారు; కొందరు ఆమె ఖట్వాంగం (పుట్టెతల బెత్తం)తో కొట్టబడ్డారు. కొందరు ఆమె పంటిమొనలతో నమిలి వేయబడి నశించారు.
*సశేషం.........*