*చండముండ వధ - 2*
ఆ దైత్య బలమంతా క్షణమాత్రంలో కూల్చివేయబడడం చూసి, చండుడు అతిభయంకరరూపయై ఉన్న ఆ కాళిక మీదకు ఉరికాడు.
ఆ మహాసురుడు (చండుడు) అతిభయంకరమైన బాణవర్షంతో, ముండుడు వేనవేలు చక్రాలను విసరివేయడంతో, ఆ భీషణనేత్రను (కాళిని) కప్పివేసారు.
ఆ అనేక చక్రాలు ఆమె నోట్లో అదృశ్యమైపోవడం అనేక సూర్యబింబాలు మేఘమధ్యంలో అదృశ్యమైపోతున్నట్లుగా ఉంది.
అప్పుడు భయానక గుర్జారావం చేస్తూ, భయంకరమైన నోటిలో దుర్నిరీక్ష్యంగా మెరుస్తున్న పళ్ళతో కాళి అత్యంత రోషంతో భయంకరంగా నవ్వింది.
అంతట ఆ (కాళికా) దేవి తన మహాసింహంపై ఎక్కి, చండుని మీదికి ఉరికి, జుట్టుతో పట్టుకొని అతని శిరస్సును ఖడ్గంతో ఛేదించింది.
చండుడు కూలడం చూసి ముండుడు కూడా ఆమెపైకి ఉరికాడు. ఆమె అతణ్ణి కూడా రోషంగా తన ఖడ్గంతో కొట్టి నేలగూల్చింది.
చండుడు, అత్యంతశౌర్యవంతుడైన ముండుడు కూల్చబడడం చూసి, అప్పటికి చావక మిగిలి ఉన్న సైన్యమంతా సంభ్రమంతో దిక్కులబట్టి పారిపోయింది.
కాళి చండముండల శిరస్సులను తన చేతులతో పట్టుకొని చండిక వద్దకు పోయి ప్రచండంగా, బిగ్గరగా నవ్వుతూ ఇలా పలికింది :
“ఈ యుద్ధయజ్ఞంలో యజ్ఞపశువులుగా సమర్పింపబడిన చండముండులను నీ వద్దకు తెచ్చాను. శుంభనిశుంభులను నీవు స్వయంగా చంపుతావు.”
ఋషి పలికెను : అంత తన వద్దకు తేబడిన ఆ చండముండ మహాసురులను చూసి శుభమూర్తియైన చండిక కాళితో మనోజ్ఞంగా ఇలా పలికెను : “నీవు చండముండులను ఇరువురినీ నా వద్దకు తెచ్చావు కనుక దేవీ! నీవు ఇక లోకమందు చాముండ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు.”
శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమస్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “చండముండవధ” అనే సప్తమాధ్యాయము సమాప్తం.
*సశేషం.....,....*