*అధ్యాయము - 8*
*రక్తబీజ వధ - 4*
అతని శరీరం నుండి ఎన్ని రక్తబిందువులు నేలపై పడ్డాయో అంతమంది బలసాహస పరాక్రమాలలో అతని వంటివారు పుట్టారు.
అతని రక్తం నుండి ఉత్పత్తియైన వీరులు కూడ మాతృకలతో సమానంగా, అతిభీషణంగా, అత్యుగ్రశస్త్రాలు ప్రయోగిస్తూ పోరాడారు.
మళ్ళీ ఆమె వజ్రాయుధపు తాకిడికి అతని శిరస్సుగాయపడి అతని రక్తం ప్రవహించగా, ఆ రక్తం నుండి వేలకొద్ది వీరులు పుట్టారు.
ఆ అసురేశ్వరుణ్ణి వైష్ణవి తన చక్రంతో, ఐంద్రి తన గదతో, యుద్ధంలో కొట్టారు.
వైష్ణవియొక్క చక్రంచే చీల్చబడినప్పుడు కారిన రక్తం నుండి పుట్టిన అతని ప్రమాణాలు గల మహాసురసాహస్రంతో జగత్తు నిండిపోయింది.
కౌమారి బల్లెంతో, వారాహి ఖడ్గంతో, మాహేశ్వరి త్రిశూలంతో రక్తబీజమహాసురుణ్ణి కొట్టారు.
రక్తబీజుడు కూడా కోపావేశంతో ఆ మాతృకల నందరినీ తన గదతో గట్టిగా కొట్టాడు.
శక్తి శూలాది ఆయుధాల వల్ల అతనికి కలిగిన పెక్కుగాయాల నుండి భూమిపై పడ్డ రక్తసమూహం నుండి వందల కొద్దీ అసురులు ఉద్భవించారు.
ఆ రక్కసుని రక్తం నుండి ఉద్భవించిన ఆసురులు జగత్తునంతా వ్యాపించారు. అందుచే దేవతలు మహాభీతి చెందారు.
విషాదమొందిన దేవతలను చూసి చండిక నవ్వి, కాళితో ఇలా పలికెను : ఓ చాముండా ! నీనోటిని విస్తీర్ణంగా తెరువు!
నా బాణాలు తగలడంతో కలిగే రక్తాన్ని, ఆ రక్తబిందువుల నుండి ఉత్పత్తైన మహాసురులను ఆ నోటితో వెంటనే మ్రింగివేయి.
“అతని వల్ల పుట్టే మహాసురులను భక్షిస్తూ యుద్ధంలో సంచరించు. ఈ దైత్యుడు అట్లు రక్త క్షయం వల్ల మరణిస్తాడు.
"నీవు ఇలా వారిని భక్షిస్తే క్రొత్త ఉగ్రరాక్షసులు ఉత్పత్తి కారు.” ఆమెకు ఇలా చెప్పి దేవి అతణ్ణి అంతట శూలంతో పొడిచింది.
అంతట కాళి రక్తబీజుని నెత్తుటిని తన నోటితో త్రాగేసింది. అతడు అంతట చండికను తన గదతో కొట్టాడు.
ఆ గద దెబ్బవల్ల ఆమెకు అత్యల్పవేదన కూడా కలుగలేదు. కాని, గాయపడిన అతని శరీరం నుండి రక్తం మిక్కుటంగా కారింది.
అలా కారిన రక్తాన్ని ఎప్పటికప్పుడు చాముండ తన నోటితో మ్రింగుతుండెను. తన నోట్లోని రక్తం వల్ల పుట్టిన మహాసురులను చాముండ మ్రింగుతూ, రక్తబీజుని నెత్తుటిని సైతం త్రాగివేసింది.
దేవి శూలంతో, వజ్రాయుధంతో, బాణాలతో, ఖడ్గంతో ఈటెలతో రక్తబీజుణ్ణి కొట్టింది. చాముండ అతని రక్తాన్ని త్రాగివేసింది.
రాజా! ఆ రక్తబీజమహాసురుడు అనేక శస్త్రాలతో మిక్కిలి గాయబడి రక్తహీనుడై భూమిపై కూలాడు.
రాజా! అంతట దేవతలు మిక్కిలి హర్షం పొందారు, వారి నుండి పుట్టిన మాతృకాగణం రక్తపానోన్మత్తతతో నృత్యం చేసారు.
శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “రక్తబీజవద" అనే అష్టమాధ్యాయము సమాప్తం.
సశేషం