*శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 30*

P Madhav Kumar


*అధ్యాయము - 9*


*నిశుంభ వధ - 1*


రాజు (సురథుడు) పలికెను: మహాత్మా! రక్తబీజవధ విషయంలో దేవి చేసిన మహాకార్యాన్ని గూరించి మీరు ఇప్పుడు నాకు తెలిపింది విచిత్రమైనది.


రక్తబీజుడు కూల్పబడిన పిదప మిక్కిలి కుపితులైన శుంభ నిశుంభులు ఏమి చేసారో ఇంకా వినగోరుతున్నాను.


ఋషి పలికెను : రక్తబీజుడు కూల్పబడుటను, యుద్ధంలో ఇతరులు కూడా హతులవడాన్నీ, విని శుంభాసురుడు నిశుంభుడు అపారమైన కోపం పొందారు.


ఆ మహాసైన్యం తెగటార్చబడడం చూసి రోషపూరితుడై అసుర సేనలలో ముఖ్యులతో నిశుంభుడు వేగంగా యుద్ధానికి వెళ్ళాడు. అతని ముందూ, వెనుక, ప్రక్కల మహాసురులు కోపంతో పెదవులను కొరుకుతూ దేవిని చంపడానికి నడిచారు.


మాతృకలతో యుద్ధం చేసి, పిదప కోపంతో చండికను వధించడానికి, మహావీర్య సంపన్నుడైన శుంభుడు స్వసైన్యపరివేష్టితుడై బయలుదేరాడు. అంతట దేవికి, శుంభ నిశుంభులకూ మహాయుద్ధం ప్రారంభమయ్యింది. వారు మేఘాల వలే అత్యుగ్రమైన శరవర్షాన్ని ఆమెపై కురిపించారు.


చండిక వారుప్రయోగించిన బాణాలను తన బాణ సమూహాన్ని త్వరితంగా త్రుంచివేసి, ఆ అసురేశ్వరుల అంగాలను తన శస్త్ర సమూహంతో కొట్టింది.


నిశుంభుడు ఒక పదను గల ఖడ్గాన్ని, మెరుస్తున్న డాలును తీసుకుని దేవి యొక్క ఉత్తమవాహనమైన సింహాన్ని తలపై కొట్టాడు.


వాహనాన్ని కొట్టడంతోనే దేవి నిశుంభుని ఆ ఉత్తమ ఖడ్గాన్ని ఒక వాడి బాణంతో త్రుంచివేసి, అతని డాలును, ఎనిమిది చంద్రబింబాలు గల దానిని, కూడా త్రుంచివేసింది.


డాలును ఖడ్గాన్ని ఛేదింపబడడంతోనే ఆ అసురుడు బల్లెమొకటి ప్రయోగించాడు. తన మీదికి వస్తున్న ఆ బల్లెమును ఆమె తన చక్రంతో రెండుగా ఖండించింది.


పొంగిపొరలుతున్న కినుకతో నిశుంభాసురుడు అంతట ఒక శూలాన్ని తీసుకున్నాడు. అది వస్తుండగా దానిని కూడా దేవి పిడికిడి పోటుతో చూర్ణంచేసింది.


అంతట అతడు గదను ఆడిస్తూ చండికపై దానిని విసిరింది. దానిని ఆమె త్రిశూలంతో ముక్కలు చేయగా అది బూడిదైపోయింది.


ఆ దానవశ్రేష్ఠుడు అంతట గండ్ర గొడ్డలితో తనమీదికి వస్తుండగా దేవి బాణసమూహాన్ని ప్రయోగించి అతన్ని భూమిపై పడజేసింది.


సశేషం....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat