_*🚩అయ్యప్ప చరితం - 5🚩*_

P Madhav Kumar


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


‘‘నమంతి మునయస్సర్వే , నమంతి అప్సరసాంగణాః

నరాః నమంతి దేవేశ నకారాయ నమో నమః

మహాదేవం, మహాత్మానం, మహాధ్యానపరాయణం

మహాపాపహరం దేవం మకారాయ నమో నమః

శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం

శివమేకపరం నిత్యం ‘శి’కారాయ నమో నమః

వాహనం వృషభస్య దేవో వాసుకి కంఠ భూషణం

వామ్ శక్తర్థం  దేవం ‘వ’కారాయ నమో నమః

యం కారో పరిసంస్థుతే దేవో యంకారం పరమం శుభం!

యం నిత్యం పరమానందం ‘య’కారాయ నమో నమః


ప్రార్థనానంతరం భక్తిపూర్వకంగా నమస్కరించి తప్పుకున్నారు ప్రమధులు!

*‘‘ఆదిదంపతులకు ప్రణామాలు!’’* అంటూ నమస్కరించిన నారదుని వైపు ప్రసన్నంగా చూస్తూ *‘‘నారదా ! త్రిలోక సంచారివి గదా ! నీవు చూసివచ్చిన వింతలేవైనా వుంటే వినిపించు’’* అన్నారు పార్వతీ పరమేశ్వరులు.

*‘‘వింతలలో వింతే మరి ! భూలోకంలో అన్యోన్యంగా జీవిస్తున్న సుందర దత్తుడు , లీల అకస్మాత్తుగా పరస్పరం శాపాలు ఇచ్చుకుని విడిపోవటం చూసి వస్తున్నాను ! ఇందుకు కారణమేమిటో సెలవీయండి’’* అడిగాడు నారదుడు. *‘‘వాళ్లిద్దరిలో తమోగుణం ప్రకోపించడంతో ఆ విధంగా కోపావేశాలకు లోనైనారు ! మానవులకది సహజమే కదా ! సంసార చక్రంలో పరిభ్రమిస్తుండే సామాన్యులకు మోక్షం ఒక్క జన్మలో లభించదు ! అందుకు ఎంతో సాధన, ఆత్మనిగ్రహం అవసరం ! సుందరదత్తుడిలో మోక్షకాంక్ష తలఎత్తేలా స్వప్నంలో అతనిని ప్రబోధించాను ! భువిలో ఒక ముఖ్యకార్యం నిర్వర్తించడానికి అతను తపస్సంపన్నుడు కావలసి వున్నది.  అతని పత్నిలో మాత్రం ఐహిక వాంఛలపట్ల వ్యామోహం , తమోగుణం అధికమవడంతో అటువంటి శాపానికి గురయ్యేలా చేసాయి ! కానీ నారదా !  ఆ శాపం విధిలిఖితం.  భావికాలంలో మణిద్వీపవాసిని జగన్మాత కావించే లీలా నాటకానికి నాంది పలకబోయేది ఈ దంపతులే సుమా!’’* అంటూ వివరించారు పార్వతీ పరమేశ్వరులు! *‘‘అర్థమైంది మాతాపితరులారా! మీ నోట దేవరహస్యాన్ని తెలుసుకుని ధన్యుడినైనాను. ఇక నాకు సెలవిప్పించండి!’’* అంటూ బయలుదేరిన నారదుడిని *‘‘జాగ్రత్త నారదా ! దేవరహస్యాన్ని దేవరహ్యంగానే వుంచాలన్న విషయం మరవద్దు ! ’’* అంటూ హెచ్చరించాడు పరమేశ్వరుడు.


పాతాళలోకంలో -

దానవరాజు దనువు కుమారులు రంభ , కరంభులు దీర్ఘ సమాలోచనలో మునిగి వున్నారు ! *‘‘అన్నా! ఎంతో కాలానంతరం నా భార్య గర్భవతై పుత్రికకు జన్మనివ్వడం సంతోషం కలిగించినా , పుట్టగానే ఆ బాల మహిషి రూపంలో కనిపించడం, అంతఃపుర కాంతలందరినీ భయభ్రాంతులను చేయడం అన్నీ నాకెందుకో అశుభ సంకేతాలుగా అనిపిస్తున్నాయి. మన దానవ పతాకాన్ని మూడు లోకాలలో ఎగరవేసే పుత్రుడు కలగడానికి ఏం చేయాలో గురు శుక్రాచార్యుల వారిని సంప్రదించడం మంచిదని తోస్తున్నది నాకు, ఏమంటావు ? ’’*  అన్నాడు కరంభుడు అన్నగారివైపు చూస్తూ ! రంభుడు గంభీరంగా తలవూపాడు.

*‘‘నిజమే కరంభా ! నాకు కలగకపోయినా నీకైనా పుత్రుడు కలుగుతాడని ఆశతో ఎదురుచూస్తూ వచ్చాను ! ఇప్పుడీవిధంగా జరిగింది. శుక్రాచార్యులను కలుసుకుని కర్తవ్యం ఉపదేశించమని అడుగుదాం ! పద’’* అన్నాడు రంభుడు తమ్ముని ఆలోచనకు అంగీకారం సూచిస్తూ ! వాళ్ల ఆంతర్యం గ్రహించినట్లుగా ఆ సమయానికి శుక్రాచార్యులే అక్కడకు రావటం వాళ్లకు ఆనందం కలిగించింది.

*‘‘ప్రణామాలు గురుదేవా !   మీ రాక మాకెంతో సంతోషదాయకమైంది. ఆసీనులు కండి ! ’’* అంటూ ఆయనకు మర్యాద చేసి పుత్రిక విషయం ఆయనకు తెలియచెప్పారు !

*‘‘ఈ విషయం దివ్యదృష్టితో తెలుసుకునే ఇట్లా వచ్చాను !  రంభ , కరంభులారా !  ఈ శిశువు కారణజన్మురాలు ! దానవుల పేరు ప్రతిష్ఠలు ఈమెవల్ల జగత్ప్రసిద్ధం కాగలవు !  మొదట మహిషి రూపంలో కనిపించింది గనుక ఈమె మహిషి అనే పేరుతోనే ప్రసిద్ధురాలౌతుంది ! ’’* అని తెలియచెప్పాడు శుక్రాచార్యుడు !.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat