*శ్రీదేవీభాగవతము - 54*

P Madhav Kumar


*చతుర్థ స్కంధము - 14*

                      

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 54*


*మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ!*

*మహామాయా మహాసత్త్వా మహాశక్తిర్మహారతిః!*


*నిన్నటి భాగములో.........* 


*నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం*   చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు

*భూదేవి మొర*  చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


 🙏 *భూదేవి మొర* 🙏


*జనమేజయా !* అతిమహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను. తెలుసుకో. నీ సందేహాలకు అన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. అదీకాక ఇది అద్భుతమైన దేవీ చరిత్ర కూడా.


ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ, దీనురాలై, గోరూపం ధరించి త్రివిష్టపానికి (దేవలోకం) వెళ్ళింది. శక్రుడు ఈ దీనావస్థను గమనించి, ఏమిటమ్మా కారణం, ఎవరు నిన్ను హింసించారు, నీకు వచ్చిన భయమేమిటి, ఎందుకూ దుఃఖిస్తున్నావు ? అని ఆప్యాయంగా పలకరించాడు. దుఃఖం ఆపుకోలేక భూదేవి బావురుమంది.


*శచీపతీ !* దుఃఖం ఎందుకని అడుగుతున్నావా ? తెలియకే అడుగుతున్నావా ? చూడు - నేనెంత భారాన్ని మోస్తున్నానో, నన్ను ఎవరెవరు ఏలుతున్నారో - గమనించు.


జరాసంధ, శిశుపాల, రుక్మి, కంస, నరక, శాల్వ, కేశి, ధేనుక - వత్సక ప్రభృతులు నాకు ఏలికలు. ముచ్చటగా చెప్పుకుందామంటే ఒక్కటంటే ఒక్కటి - సద్గుణం లేనివారు. సర్వధర్మ విహీనులు. సకల దుర్గుణ విరాజితులు. వీళ్ళు పరస్పర విరోధులు. మదోన్మత్తులు. కాలరూపులు. పాపాచారులు. నిరంతరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు. ఈ పాపభారాన్ని నేను మొయ్యలేను. ఏమి చెయ్యాలో, ఎవరిని శరణువేడాలో తోచక ఆత్మీయుడవుకదా నీ దగ్గర మొర పెట్టుకుందాం ఏదైనా ఉపాయం చెబుతావని ఇలా వచ్చాను.


అలనాడు విష్ణుమూర్తి వరాహావతారం ధరించి నాకు చేసింది ఉపకారమే అనుకున్నాను. ఇప్పుడనిపిస్తోంది - అది ఉపకారంకాదు అపకారమే అని. చిన్న దుఃఖం నుంచి పెద్ద దు:ఖంలోకి తెచ్చిపడేసినట్టయ్యింది. కశ్యపాత్మజుడు దుష్టహిరణ్యాక్షుడు నన్ను లుంగజుట్టి మహాసముద్రంలోకి విసిరేస్తే శ్రీహరి వరాహరూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి, తన బంగారు కోరమీద నన్ను తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా ! అప్పటినుంచి *స్థిర* అనే పేరు నాకు దక్కిందికదా ! ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తోంది. అలా చేసిఉండకపోతే, పాతాళంలో సుఖంగా ఉండేదాన్ని. ఈ పాపాత్ముల చేతుల్లో పడి ఇంత పీడ అనుభవించాల్సిన దుర్దశ ఉండేది కాదు. 


*ఇంద్రా !* ఈ దుష్టుల భారాన్ని నేనింక మొయ్యలేను. ఇరవై ఎనిమిదవ కలియుగం రాబోతోంది. ఈ పాపభారం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడెలాగూ రసాతలానికి పోకతప్పదు. ఈలోగా ఈ దు:ఖసముద్రం నుంచి నన్ను గట్టెక్కించు. భారం తొలగించు - నీ కాళ్ళు మొక్కుతాను.


ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చలించిపోయాడు. అమ్మా ! నేనేమి చెయ్యగలనూ ? నీ బాధ తీర్చలేను. ఆర్చలేను. బ్రహ్మదేవుడొక్కడే దీనికి సమర్థుడు. అతణ్ణి శరణువేడు. నేనూ తోడు వస్తాను. పద. ఇదే నేను చెయ్యగల ఉపకారం - అన్నాడు.


దేవతాపరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది. చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు. పొంగివస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడకొంగుతో కళ్లు ఒత్తుకుంటూ భూదేవి బదులు పలికింది.


*సరస్వతీ వల్లభా !* కలికాలం రాబోతోంది. చాలా భయంగా ఉంది. ప్రజలంతా పాపాచారులైపోతారు. పాలకులు దుర్మార్గులవుతారు. పరస్పర విరోధులవుతారు. రాక్షసులుగా మారిపోతారు. అన్నీ దొంగ పనులే చేస్తారు. ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. నాకు భారం పెరిగిపోయింది. మొయ్యలేకపోతున్నాను. ఒక్కొక్కరికీ ఎంతెంత సైన్యమని ! ఈ రాజులనూ సైన్యాలనూ సంహరించి నాకు భారం వదిలించు. ఇందుకోసమే కోరి నీ దర్శనానికి వచ్చాను.


*భూదేవీ !* ఇది నావల్ల అయ్యే పనికాదు. జనార్దనుడే సమర్థుడు. పద. నేనూ వస్తాను. అతడిని అభ్యర్ధించుదాం - అని బ్రహ్మదేవుడు హంస వాహనంపై బయలుదేరాడు. అందరూ విష్ణుసదనం చేరుకున్నారు. ముందుగా చతుర్ముఖుడు శ్రీమహావిష్ణువును స్తుతించాడు -


*సహప్రశీర్షా త్వమపి సహస్రాక్షః సహస్రపాత్ |* 

*త్వం వేదపురుషః పూర్వం దేవదేవ: సనాతనః ||*


*మధుసూదనా !* నువ్వు సహస్రశీర్షుడవు. సహస్రాక్షుడవు. సహస్రపాదుడవు. వేదపురుషడవు. దేవదేవుడవు. సనాతనుడవు. భూతభవిష్యద్వర్తమానాలన్నీ నీకు స్పష్టంగా తెలుసు. మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే. నువ్వు ఎంతటి మహిమాన్వితుడవో ఎవ్వరూ ఊహించలేరు.


జగత్కర్తవు నువ్వే. రక్షకుడవు నువ్వే. భక్షకుడవూ నువ్వే. సర్వజగత్తుకు ప్రభువు-నువ్వు.


విరించి ఇలా స్తుతించితే విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. అందరికీ దర్శనం అనుగ్రహించాడు. స్వాగతం పలికాడు. ఏ పనిమీద వచ్చారని ప్రశ్నించాడు.


భూదేవి పక్షాన బ్రహ్మదేవుడే పలికాడు. దయానిధీ ! కలియుగం రాబోతోంది. కనక ఈ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు. భూదేవి ఆవేదనను తీర్చు - అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు.


*(రేపు.... శ్రీహరి పరాధీనత )*


🙏 *అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.* 🙏

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


 *శ్రీదేవీభాగవతము -  55*

*చతుర్థ స్కంధము - 15*

                    


*లలితా సహస్రనామ శ్లోకం - 55*


*మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా!*

*మహాబుధ్ధిర్మహాసిధ్ధి ర్మహాయోగేశ్వరేశ్వరీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*భూదేవి మొర* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు

*శ్రీహరి పరాధీనత* 

*దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం* చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *శ్రీహరి పరాధీనత* 🌈


*భూదేవీ ! బ్రహ్మాది దేవతలారా !* ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేనే కాదు బ్రహ్మదేవుడూ శివుడు ఇంద్రుడూ దిక్పాలకులు చంద్రుడు సూర్యుడూ అగ్ని - ఎవ్వరూ స్వతంత్రులు కారు. 

*సృష్టి అంతా యోగమాయావశంవదం.* బ్రహ్మాదిస్తంభపర్యంతమూ గుణసూత్ర గ్రథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్ఛ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటే అలా చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశులమే. 


నేను స్వతంత్రుడినే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగానూ ఒక తాబేలుగానూ జన్మిస్తానా ? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా ? పోనీ అంటే, క్షుద్రజంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా ? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యానంటారు ? ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ - ఎవరైనా ఎన్నడైనా ఇష్టపతారా ? ఇరవైయొక్క సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తురుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం ! ఎంత నీచం ! గర్భస్థ శిశువులనుకూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా ? తరవాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాలలో నివసించాను. జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాలలో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న (పచ్చి) మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా, సిగ్గు పడవలసిన విషయమా ? మీరే చెప్పండి.


బంగారులేడి కనపడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటిరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడుకూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు. నామాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు భిక్షురూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతోంది. అడవులన్నీ మారుమ్రోగేట్టు విలపించాను. కార్యవశాత్తూ సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞచేసి వాలిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను.


నేనూ నా సోదరుడూ నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్య పోయినవారే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాము. అప్పుడు నేనెంత దిగులుపడ్డానో మీకు తెలుసా ! దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు, ప్రియ భార్య అపహరించబడింది, కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడనై అసహాయుడనై పాదచారినై భార్యతో కలిసి పధ్నాలుగేళ్ళు గాఢారణ్యాలలో గడిపాను.


క్షత్రియుడనై పుట్టి బోయవాడుగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగిపొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలం ! లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్యా వియోగ దుఃఖం. వద్దు, పగవారికైనా వద్దు. కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది.


రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి. 


*చతుర్వదనా !* నీకు తెలుసును గదా ! నువ్వూ రుద్రుడు ఇంద్రుడూ అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు అధీనులమే. 


*(అధ్యాయం - 18, శ్లోకాలు - 60)*


*దేవతలారా !* మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. జగద్గురువును స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడూ శాంతుడూ అయిన పరమపురుషుడిని మర్చిపోతున్నాం. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడను - అని అహంకరించి మోహితులమవుతున్నాం. అతి సనాతనమూ పరాత్పరమూ అయిన వస్తువును తెలుసుకోలేకపోతున్నాం. ఐంద్రజాలికుడి చేతిలో కొయ్యబొమ్మలాగా నేనూ ఇంతే. ఎప్పుడూ మాయామోహితుడినై ప్రవర్తిస్తూంటాను.


*పద్మసంభవా !* కల్పారంభంలో నువ్వూ నేనూ శివుడూ కలిసి వెళ్ళి క్షీరసముద్ర మధ్యభాగాన మణిద్వీపంలో మందార తరుచ్ఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాంకదా ! సర్వకామప్రద అయిన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి. మనస్సుల్లో స్మరించండి.


శ్రీమహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకలభువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్తకంఠంతో స్తుతించారు.


*జగన్మాతా !* సాలీడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీనుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తు అంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరీ ! ఓ కరుణాసముద్రమా ! నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు సంవిద్రూపవు (జ్ఞాన రూప). దేవీ ! మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మీ ! ఓ మహాశక్తి ! మమ్ము నడిపించు.


*ఓ భువనార్తి హారిణీ !* అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావుకదా ! కంస కేశి సాల్వ జయద్రథాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వారినందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు. త్రిమూర్తులకుకూడా లొంగని మహామహాదానవులను నువ్వు ఒక కేళీవిలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చెయ్యలేరుగదా ! అనంతుడు ఈ భూమిని ధరించలేడుగదా ! ఓ చంద్రకళావతంసా ! మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగించు - అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు. అభ్యర్థించారు.


*జగన్నాయకీ !* సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చినదానవు నువ్వేకదా - అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు.


*ఓ త్రిలోకీ !* నీ కళావైభవాన్ని మాకు అందించావు కనక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం. ప్రభుత్వం చెలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే - అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు.


జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులికించింది. దేవతలారా ! పని ఏమిటో చెప్పండి. ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైనా సురల కోరిక తీరుస్తాను. మీకుగానీ ఈ భూదేవికిగానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి - అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు.


*భువనేశ్వరీ !* పాలకులందరూ దుష్టులై పీడిస్తూంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్ధురాలవు నువ్వే అని నిన్ను ప్రార్ధించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు. దుష్టులను వెంటనే సంహరించు. ఇదివరలో నువ్వు మహిషాసురుడిని సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ నిశుంభ రక్తబీజ చండముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహాదైత్యవీరులను క్రూరాతిక్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్టభూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లీ !


దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది. కన్గొసలు ఎరుపెక్కాయి. మేఘగంభీర స్వరంతో పలికింది -


 🌈 *దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం* 🌈


*దేవతలారా!* ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీమీ అంశలతో భూలోకంలో జన్మించాలి. భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను. 


కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో అనకదుందుభి గా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతాకార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణీ గర్భసంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్టసంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు.


వాయుదేవుని అంశతో భీముడూ, అశ్వినీ దేవతల అంశలతో నకులసహదేవులూ, అష్టమవసువుగా (వసు అంశంతో) భీష్ముడూ జన్మించి శత్రుబలాలను క్షీణింపజేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది. 


మీరంతా నిమిత్తమాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీష, మోహమూ, కామమూ మొదలైన దోషాలతోనూ, బ్రాహ్మణశాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాపకారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీమీ అంశలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు. అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.


*(అధ్యాయం - 19, శ్లోకాలు - 46)*


*(రేపు.... వ్యాసకృత యోగమాయా ప్రశంస )*


 *🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే .......‌‌‌‌‌‌‌.🙏* 

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat