_*అయ్యప్ప సర్వస్వం - 65*_ *శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 7*

P Madhav Kumar


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 7*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ఈనాడు అనేకములు నిద్రలేమిచే బాధపడుచున్నారు. వృత్తి , వ్యాపారము , ఉద్యోగము , కుటుంబ భారము , పిల్లల విద్య , ఉద్యోగము , ఆర్థికసమస్యలు , పరిసర వాతావరణ కాలుష్యము కారణముగా పట్టణ ప్రాంతములలో వుండే ప్రజలు ఎక్కువగా ఆందోళనకు , ఆదుర్గాకులోనై , మానసిక ప్రశాంతతను కోల్పోయి , నిద్రలేమిచే బాధపడుచున్నారు. అందుకొరకై నిద్రమాత్రలు , మత్తుమందులు వాడేవారు ఎందరో కలరు. అయితే వారము రోజులు నిద్రలేకుండా గడిపినవారు సైతము కొద్దిసేపు ఏకాగ్రతతో ధ్యానము చేసినయెడల కలుగు ప్రశాంత నిద్ర నిద్రమాత్రలు , మత్తుమందులు వాడినందు వలన చేకూరదని శాస్త్రజ్ఞుల అంచనా. అందువలన మానసిక ప్రశాంతతకు ధ్యానము , ధారణము ఎంతో ఉపకరించును. దీక్షాకాలములో మనము నిత్యము పూజలు చేయుట , శరణుఘోష ఎలుగెత్తి చెప్పుట భజన కార్యక్రమములలో , ధార్మిక గోష్టులలో పాల్గొనుట మొదలగునవన్నియు ఎంతగానో ఉపకరించును.


అత్యంత ప్రగతి సాధించిన ఆధునిక వైద్యములో నిష్ణాతులైన పాశ్చాత్య వైద్యులు సైతము మనశ్శాంతికొరకు మార్గములన్వేషించి , తీవ్ర పరిశోధనలు జరిపి , రోగశాంతికి , మనశ్శాంతికి ప్రార్థన ధ్యానము , యోగాసనములు దోహదములని కనుగొనిరి. ధ్యానములో మనము మునిగియున్నపుడు ప్రాణవాయువు అవసరము చాలావరకు తగ్గిపోవును. శరీరావయవములకు పని తగ్గును. శక్తి కేంద్రీకరింపబడును. రక్తనాళములకు పని ఒత్తిడి తగ్గును. శ్వాసయొక్క అవసరము అంతగా యుండదు. మెదడులోని ఆలోచనా తరంగములు తీవ్రత తగ్గుముఖము పట్టును. పరిశుద్ధభావములు కల్గును. నిశ్చలత , ప్రశాంతత ఏర్పడును. మనశ్శాంతి వలన శరీరమునకు విశ్రాంతి లభించును.


ఎవ్వడూ పూర్తిగా దుష్టుడు కాడు. ప్రతివానియందు కొన్ని మంచి గుణములు కలవు. ప్రతివానియందు గల మంచిని కనుగొనుటకు ప్రయత్నించుము. మంచిని వెదకు స్వభావము అలవరచుకొనుము. ఇది చెడును వెదకు అలవాటునుండి తప్పించగలదు.


నేటి మోసగాడు , వ్యసనపరుడు రేపు సాధువు కావచ్చును. కావున అతనికి సత్ సాంగత్యము లభింపజేయుము. అతనియందలి మోసమును ద్వేషింపుము. అంతేగాని అతనిని గాదు.


*సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః*


మంచివారి సహవాసముతో భవభంధములను దూరము చేయుటద్వారా మోహమును త్యజించినవాడగును. మోహమును త్యజించుటద్వారా నిశ్చలతత్వము ఏర్పడును. నిశ్చల నిర్వికార మనః ప్రవృత్తి ద్వారా జీవన్ముక్తి ఏర్పడును.


ఎల్లప్పుడు (కనీసం దీక్షాకాలంలోనైనా) దైవప్రీతికరములగు పుణ్యకర్మలనాచరించుచుండిన యెడల పాపము నశించి అంతఃకరణ శుద్ధి కలుగును. పరమేశ్వరోపాసన చేత విద్య , అవిద్యలు నశియించి ధ్యానమందు ఏకాగ్రత కల్గును. ధ్యానము చేయు స్వభావము ప్రతివ్యక్తి అలవరచుకొనవలయును. అందుకు త్రిగుణములు , అష్ట రాగములు , పంచేంద్రియములు నియంత్రించి పుణ్యకర్మలు , దైవభక్తి సాధుసజ్జన సాంగత్యము , సేవ , ఇత్యాదు లత్యంతావశ్యకములు. అట్టి నిరంతర సేవవలననే నిరావరణ , నిరంకుశ బ్రహ్మమైన యావిశ్వబ్రహ్మ సాక్షాత్కారము కల్గును.


*"కలౌః స్మరణానుముక్తిః"* అని కలియుగమునందు భగవన్నామ స్మరణ మాత్రమున మోక్షము కల్గునని మన ఆర్యులు చెప్పియున్నారు. అనన్య భక్తిభావము , సాధన , నిత్యపూజలు , నియమనిష్టలు , సగుణోపాసన తద్వారా నిర్గుణోపాసనకు మార్గము సుగమము గావించి , తద్వారా యోగస్థితినిబొంది తరింపకల్గుటయే జీవిత సర్వస్వము.


నిర్విరామముగ యేదేని ఒక భగవన్నామమునుచ్చరించుట లేక భగవంతుని నిరంతరము తలంచుట , జ్ఞప్తియందుంచుకొనుటయే నిజమైన భక్తియనబడును. అందులో సమిష్టిగాజేయు సంకీర్తనము , భగవంతుని గుణగణములను కీర్తించు కీర్తనలు సంకీర్తన జేయువారికే గాక విన్నవారికిగూడ ఆనందము కలుగజేసి , మోక్షసాధనమునకు సహకరించగలవనుటలో సందేహము లేదు.


నామ శబ్దము "నమ్" ధాతువు నుండి పుట్టినది. ఈ "నమ్" ధాతువు నుండియే "నమ్రత", "నమస్కారము" మొదలైన శబ్దములు వెలువడినవి. నామము భక్తుని మానవత్వమునుండి దివ్యత్వమునకు గొనిపోవుటకు ముందుగా అతనిని "నమృని" జేయును. నమ్రతలేనిదే సత్య పరిశోధన జరుగజాలదు. అందుకే ఆధ్యాత్మిక బాట పయనించువారందరూ వినమృలై యుందురు. ఆధ్యాత్మికముగా భక్తికంటే నమ్రతయే విలువయినది. నమ్రత కలిగియుండుట కంటె భక్తికలిగి యుండుట సులువు. అనేక సందర్భములను బట్టి చూడగా భక్తియే నమ్రతకు ప్రథమ సోపానమని నిరూపించుచున్నవి.


సాధారణముగా జనులు భగవంతుని పలునామములు ఒకే పర్యాయమునుచ్చరించుట సహజము , అలాగాక యెవరో యొక అవతార పురుషుని గంభీర నామము తీసుకొని దానినే నిర్విరామముగా మననము చేయుచు ఆ రూపమునే ధ్యానించిన సాధకుడు త్వరితగతిని తన గమ్యము చేరి , భగవదనుభూతిని పొందుటకు ఎక్కువ అవకాశము కలదు.


భగవన్నామ స్మరణము సుఖములనిచ్చును. భగవన్నామము తెలిసిగాని , తెలియకగాని ఏవిధముగా ఉచ్చరించినప్పటికి లాభకారి అయివున్నది. (నామ మహిమ అగణితము). పూజ , ధ్యానమునకు , యోగసాధనకు కులమతములతో సంబంధములేదు. ఏ జాతి వారైనను , ఏ కులమువారైనను నామ స్మరణమునకు అర్హులే. దీక్ష మంత్రము , నామస్మరణము , పాపులు చదివినంతమాత్రమున దేవుడు , మంత్రము , నామము మైలపడునని చెప్పుట బూటకము. అట్టిమాటలు నమ్మవద్దు. నామ మహిమ అగణితము. నామము స్మరించువారికి శాంతి , సౌఖ్యము , చావు లేమిని ఇచ్చును. నామ మహిమ వర్ణించుట అసంభవము.


ఆత్మజ్ఞానము కావలయునన్న నిరంతర ధ్యానము , నామస్మరణము అత్యంతావశ్యకములు. అట్టి నిరంతర ధ్యానము , నామస్మరణము వలన పలురీతుల పరుగులుతీయు మనస్సుకు ఏదో ఒకనాటికి తప్పక స్థిరత్వము ఏర్పడును. దైవనామ స్మరణము సర్వపాపముల నుండి రక్షించును. సర్వ కష్టములనుండి కాపాడును. సర్వానర్ధముల నుండి రక్షించును.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat