శ్రీ మహాశాస్తా చరితము - 57 | స్వామి అనుగ్రహము పొందిన శ్రీరాముడు | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 57 | స్వామి అనుగ్రహము పొందిన శ్రీరాముడు | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

స్వామి అనుగ్రహము పొందిన శ్రీరాముడు:

మునుపు ఒకమారు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు గొప్పవాడా , లయకారకుడైన శివుడు గొప్పవాడా యని వాదించుకొనుచుండిరి. ఆ వాదము శివ , కేశవులు కూడా అన్వయించుకుని , తపస్సు చేయుటలో తనకు ఎదురేలేనివాడైన అగస్త్య మహాముని దేహము నుండి వెలువడిన రెండు చీలికలను ధనుస్సులను గావించుకుని ఒకరితో ఒకరు యుద్ధము చేయసాగిరి.

భూమ్యాకాశములు దద్దరిల్లునట్లుగా యుద్ధము ఆరంభమైనది. ఒక ఘట్టము నందు విష్ణువు యొక్క శక్తికి కోపగించిన ఈశ్వరుడు తన చేత నున్న విల్లును ఉగ్రమూర్తియై వంచగా , ఆ వింటి నాదము
కర్ణకఠోరముగా వినిపించినది. ఎక్కడ పరమశివుడు తన మూడవకన్నును తెరచునో అన్న భయము పొందిన దేవతలు , పరమశివుని సమాధాన పరచి యుద్ధమును ఆపిరి.

యుద్ధమున ఉపయోగించబడిన శివధనస్సు , భూలోకమున జనకమహారాజునకు అప్పగించబడినది. తన కుమార్తె అయిన సీతా స్వయంవరము జరుపనెంచిన జనకుడు , శివధనస్సును వంచగల
ధీరునికే వివాహము చేయ నిశ్చయించెను.

ఆ సమయమున శ్రీమహావిష్ణువు దశరధ మహారాజునకు పుత్రునిగా , శ్రీరామనామధేయము
బూని జన్మించియుండెను.

రాక్షసరాజైన రావణ సంహారమునకై దాల్చబడినదే శ్రీరామ అవతారనము కానీ రామావతారుడైన
మహావిష్ణువు శుద్ధ సాత్విక రూపుడై ,
కోమల స్వరూపునిగా తీర్చిదిద్దబడెను. మరి రాక్షస సంహారము
చేయవలెనన్నచో క్షాత్ర అంశము పొంది యుండవలెనుకదా ! కారుణ్యరూపముతో పాటు ధార్మికము ,
రౌద్రము తోడైనప్పుడు కదా పూర్ణావతారముగా రూపుదాల్చును ?

సీతాస్వయంవరమునకు రావణుడు కూడా వచ్చి యుండెను. పరులకు శివధనస్సు నెత్తగల
శక్తి లేకయుండునుగాక.

భక్తసులభుడు , అశుతోషియునైన పరమశివుడు , తన భక్తుడైన రావణునికి సహాయము చేయకుండునా ? సాక్షాత్తు కైలాస పర్వతమునే ఎత్తగలిగిన శక్తిగల రావణునికి శివధనస్సును ఎత్తగల
శక్తి లేకయుండెనా ?

ఇదంతయు తెలిసిన అమరులు వేదన చెందిరి. చివరకు భూమియందు అవతరించిన శివధనస్సుకు రక్షకునిగా శివుని పుత్రుడైన మహాశాస్తా ఉండు విషయమును తెలిసికొని , వేలకొలది రక్కసులను తన మాయోపాయము చేత వధించగల శక్తిమంతుడు , ధర్మపరిపాలకుడు అయిన
మహాశాస్తా తప్ప తమకు సహాయము చేయగలవారు లేరని భావించిరి. తమకు సాయము చేయుమని పరిపరి విధముల ప్రార్థించిరి. దేవతల కోరిక మేరకు శాస్తా , తన రౌద్రశక్తిని శివధనస్సు
నందు పొందుపరచెను. స్వామి యొక్క శక్తి శివధనస్సులో పొందుపరచబడిన కారణముచే , శక్తివంతమైన ఆ శివధనస్సును వంచగల శక్తి ఎవరికీ లేకయుండెను. మహాబలశాలియైన
రావణునికి కూడా సాధ్యము కానిదయ్యెను.

ఈ సంగతిని తన జ్ఞాననేత్రముద్వారా పరిశీలించిన విశ్వామిత్రుడు శ్రీరాముని అవతారము , పరిపూర్ణ అవతారము దాల్చుటకై , జనకుని సభకు , శ్రీరాముని రప్పించెను. ఆ శివధనస్సును స్పర్శించినంత మాత్రమునే , దేవతలు కోరిన విధముగానే స్వామి యొక్క రౌద్రశక్తి శ్రీరాముని
చేరినది. స్వామి యొక్క శక్తిని పొందిన శ్రీరాముడు , క్షాత్ర అంశము పొంగి పొరలగా , శివధనస్సును
అవలీలగా వంచగలిగెను.

శాస్తా సంకల్పించిన రీతిగానే శ్రీరాముడు తన అవతార లక్ష్యమును నెరవేర్చగలిగెను. సీతాదేవిని పరిణయమాడి ధర్మపరిపాలన గావించెను. ఈ నిజమును గ్రహించిన పరశురాముడు సైతము , తన శక్తిని శ్రీరామునకు ధారపోసి , తన ఇష్టదైవమైన శాస్తా యొక్క అంశను పూర్తిచేయదలచి రామావతార లక్ష్యమును నెరవేరుటకు సాయపడెను. శ్రీరాముడు స్వామి యొక్క శక్తిని పొందినవాడై తన అవతార లక్ష్యమును పూర్తిగావించెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow