శ్రీ మహాశాస్తా చరితము - 60 | దైత్యాదిపుని సంహారము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 60 | దైత్యాదిపుని సంహారము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

దైత్యాదిపుని సంహారము 

ఇదే సింధునదీ తీరమున జరిగిన మరియొక సంఘటన. మునుపొకమారు సింధునదీ తీరమున
దైత్యాదిపుడను రాక్షసుడు వెలసెను. బాల్యమునందే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అతడిని , అతడి పినతండ్రి పెంచి పెద్ద జేసి యుక్త వయస్సు రాగానే పెండ్లి కూడా చేసెను. అతడి పినతండ్రి ఉన్నత గుణములు కలిగినవాడు.

మంచి విద్యాబుద్ధులు పిన తండ్రి ఎన్ని నేర్పించిననూ , సహజసిద్ధమైన రాక్షస గుణములు గలిగినవాడై , ఆధిపత్య భావములు మెండుగా కలిగిన వాడయ్యెను.

బ్రహ్మదేవుని గూర్చి కఠోర తపస్సు నాచరించి. పెక్కువరములను పొందిన కారనముగా , ముల్లోకములను జయించి తనకంటూ ఒక ప్రత్యేక లోకమును నిర్మించుకుని పరిపాలించసాగెను.
అష్టదిక్పాలకులను పదవీచ్యుతులను చేసి , తన కుమారులను ఆస్థానమున నియమించెను.

రాక్షసుని క్రూరత్వము నానాటికి పెరిగిపోగా , భయపడి పారిపోయిన బ్రహ్మదేవాది అమరులు.
ఒక అడవియందు అజ్ఞాత వాసము చేయసాగిరి. తమ్ము కాపాడుమని శ్రీమహాశాస్తాని ప్రార్థించుచూ , అనేక పూజలు , యజ్ఞములు చేయసాగిరి.

వారి పూజలను అంగీకరించిన శాస్తా , దివ్యరధమున అమరియుండి వారిముందు ప్రత్యక్షమయ్యెను. ఆనందపరవశులైన అమరులు , శాస్తానిచూచి ఆనందముగా , అనేక విధముల స్తుతించుచూ , తమ బాధలను ఏకరువు పెట్టిరి. ఎట్లైననూ రాక్షసుని సంహరించి , తమకు మేలు చేయమని ప్రార్థించిరి. వారికి అభయమునొసగిన స్వామి , ముందుగా , తన తప్పు తెలిసికొనుమని ఒక సందర్భమును రాక్షసునకు ప్రసాదించగా , పినతండ్రి యొక్క జ్ఞానబోధనలను పెడచెవిన పెట్టిన దైత్యాదిపుడు *“వినాశ కాలే విపరీతబుద్ధి”* అన్నట్లుగా , తన కుమారులతో సహా స్వామిపై యుద్ధమును
ప్రకటించెను.

అమరులను కాపాడుటకై కంకణము కట్టుకున్న భగవంతునకు అమరసేన తోడై అసురులతో
యుద్ధమునకు తల పడినది. ఇరువైపు సైనికులూ భీకరముగా యుద్ధము చేయసాగినవి.

యుద్ధ రంగమంతయూ బాణ వర్ణముచే నిండిపోయినంది. కనిపించిన దైత్య సైనికులనందరినీ
అమరసేన చంపసాగినది. యుద్ధరంగమంతా సైనికుల హాహాకారములతోనూ , రక్త ప్రవాహములతోనూ
నిండిపోయెను.

దైత్యాదిపుని ఎనమండుగురు పుత్రులను , స్వామి అనుచరులైన మహాకాలుడు , మహావీరుడు మొదలైన వారు సంహరించిరి.

ఈ సంగతి తెలిసిన దైత్యాదిపుడు కోపోదేకుడై పిచ్చి పట్టిన వానివలె , యుద్ధరంగమున కనిపించిన దేవ సేనను సంహరించసాగెను. వెంటనే శాస్తా , దైత్యాదిపుని తానే అంతమొందించుటకై
యుద్ధమునకు దిగెను.

శక్తివంతమైన అస్త్రములు ఇరువైపులా ప్రయోగింపబడసాగినవి. రాక్షసుడు వేయు బాణములు స్వామి దగ్గరకు కూడా రాలేకపోయెను. స్వామి యొక్క అస్త్రముల దాటికి దైత్యుడు ఆగలేకపోయెను. ఇక ఉపేక్షింపజాలని శాస్తా తన చేత నున్న దండాయుధమును అతడిపై ప్రయోగించెను. అది దైత్యుని శరీరమును తునాతునకలు చేసెను. మిగిలిన సైనికులను , దేవ సైనికులు తరిమి తరిమి చంపివైచిరి.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow