శ్రీ మహాశాస్తా చరితము - 63 | అనంతుని ఆశీర్వదించిన ఆర్యభగవానుడు | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 63 | అనంతుని ఆశీర్వదించిన ఆర్యభగవానుడు | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

అనంతుని ఆశీర్వదించిన ఆర్యభగవానుడు

 నాగులకు అధిపతి అయిన ఆదిశేషుడు , శ్రీమన్నారాయణుడంతటి వానికి పానుపు కాగలిగిన
అంతస్థును పొందినవాడై యుండి , ఒకానొక సందర్భమున మిగతా నాగులతో కూడి ఒక
సమావేశమును ఏర్పాటుచేసుకుని. సత్ సంగము చేయుచూ ఈశ్వర పుత్రుని గురించి
సంభాషించుచుండిరి.

నాగుల నివసించు పాతాళ లోకమునకు అతి సమిపముగా , వేయి శిరస్సులు గలిగిన
ఆదిశేషుడు కొలువైయుండెను. భువనములన్నిటినీ తన తలపై భాగమున సదా మోయుచుండువాడు.
ఈతడి గొప్పదనము తెలియని వారులేరు. నాగుల సమావేశమునందు , అధిపతియైన ఆదిశేషుడు
లేకుండునా ?

లోకములన్నిటికీ ఆధారశక్తియై. ఈ భువనమును తనకు లోబడి యుండునట్లు చేసికొని
పరిపాలించువాడైన మహాశాస్తాని గురించి సంభాషించుచుండిరి.

*విధివ్రాతను తప్పించ సాధ్యముకాదు. ఆవిషయము నిరూపణ అగుటకేమో అన్నట్లుగా ఆదిశేషుడు అత్యంత అతిశయమును గలవాడై. ఈ భువనములనన్నిటినీ మోయువాడను నేను. మీవలే నేను పరులకు లోబడియుండు అగత్యములేదు.”* అని అహంభావముతో మాట్లాడెను.

ఈ మాటలు విన్న నాగులు అదిరిపడిరి. ఆస్వామివలననే కదా ఆదిశేషునికి ఇంతటి అర్హత కలిగినది. అది మరచిపోయి , అహంకారముతో రెచ్చిపోవుట సమంజసము కాదు కదా యని తమలో తాము గుసగుసలు పోయిరి.

అహంకారముతో , ఒడలు మరచి పేలిన ప్రేలాపనకు త్వరలోనే ఆదిశేషునకు తగినశాస్త్రి జరిగినది. ఎన్నో ఏండ్లుగా , అతి తేలికగా తలపై మోయుచున్న భువన భారము అంతకంతకూ
ఎక్కువై మోయలేని బరువుగా మారినది. ఊపిరి కూడ పీల్చలేనంతటి స్థితికి చేరుకున్నవాడై.
అరనిమిషము కూడా భారము మోయలేని పరిస్థితి ఏర్పడినది.

తన అతిశయమే తనను ఈ శక్తికి తెచ్చినదని గ్రహించెను. వేరుగతి కానరాక. మిక్కిలి దుఃఖితుడై శ్రీమన్నారాయణుని అనేక విధముల ప్రార్థించెను. ప్రార్థనను ఆలకించిన నారాయణుడు ఆదిశేషుని ఎదుట ప్రత్యక్షమై *“అనంతా ! ఈ దుస్థితికి కారణము స్వయం కృత అపరాధమే తప్పు వేరు ఎవరూ కాదు. భువన భారమును మోయువాడవు నీవే నంటివి కదా ! ఈ సృష్టి యందు చేతానా వస్థలను తీర్మానించు బాధ్యత శాస్త్రాదే కదా ! లోకరక్షకుడైన స్వామిని ప్రార్థించనంత వరకూ , నీ నీ దుర్భరస్థితి మారదు”* అని హెచ్చరించెను.

తన తప్పు తెలుసుకున్న ఆదిశేషుడు పరంధాముని మనస్సున ధ్యానించి , క్షమాపణవేడుటకై
తపమాచరించనెంచెను.

భూలోకమున జీవస్థానముగా ప్రకాశించు జాప్యేశ్వరమును చేరిన ఆదిశేషుడు , విభూతి ,
రుద్రాక్షలు ధరించినవాడై , మేని కృశించు చున్ననూ బాధపడక , ఆహార పానీయములను సైతము
మరచిన వాడై , మనస్సున స్వామిని తప్ప వేరుధ్యాస లేక ఘోరమైన తపస్సు చేసెను. ఆరుమాసకాలము ఉగ్రముగా చేసిన తపస్సు ఫలించి స్వామి అతడి ముందు ప్రత్యక్షమయ్యెను.

ఒళ్ళంతా గడగడా వణకుచుండగా , మాటలు తడబడగా , హరిహరపుత్రుని గాంచినంతనే ,
కూలిపోయిన మహావృక్షమువలె స్వామి పాదములపై పడిన ఆదిశేషుడు , తన తప్పును మన్నించుమని
దీనముగా ప్రార్థించెను. అనాలోచితముగా నోరుజారి ఇంతటి ఉపద్రవమును కొని తెచ్చుకున్న ఆదిశేషుని పట్ల దయగలిగినవాడై , శాస్తా అతడితో *“వేయి శిరస్సులను కలిగి , భువన భారమును మోయు ఆదిశేషా ! నీ తప్పులను మన్నించితిని. నీ ఒక్కొక్క శిరస్సునకూ , మునుపటి కన్నా ఎక్కువ శక్తిని ప్రసాదించుచున్నాను. మునుపటి వలెనే భువన భారమును అతి సునాయాసముగా మోయగల శక్తిని ప్రసాదించుచున్నాను”* అనెను.
*ఈ విధముగా ఆదిశేషుని ఆశీర్వదించెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow