శ్రీ మహాశాస్తా చరితము - 73 | యక్షిణిని అనుగ్రహించిన తీరు | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 73 | యక్షిణిని అనుగ్రహించిన తీరు | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

యక్షిణిని అనుగ్రహించిన తీరు*

భక్తి ప్రపత్తులతో సదా వెల్లివిరియు కేరళ దేశపు ఒక ప్రాంతమును ధర్మము తప్పని రీతిని ఒక
మహారాజు పరిపాలించుచుండును. అతడి ధ్యాస ఎప్పుడూ మహాశాస్తా యొక్క పదకమలములయందే.

ఒకనాడు ఆస్థాన జ్యోతిష్కుడు మహారాజు యొక్క జాతకమును పరిశీలించుచుండగా , పూర్వజన్మ పాపము కారణముగా ఒక శాపము కలదనియూ , తద్వారా ఒక పెద్ద గండము ఎదుర్కొన బోవుననియూ తెలిపెను.

ఇది విన్న మహారాజు ఏ మాత్రమూ దిగులు చెందని వాడై , మహాశాస్తా యందు తనకు గల
భక్తి విశ్వాసములే , తనను ఈ గండము నుండి కాపాడగలవని అచంచల విశ్వాసము కలిగి , ప్రశాంతముగా నుండెను.

ఒకనాడు ఆ మహారాజు అరణ్యమధ్యమున గల *'అచ్చన్ కోవిల్'* ఆలయమునకు దేవుని
దర్శించుటకై వచ్చుచుండెను.

ఆ వనమునందు ఒకచోట *'వెరిక్కలి'* యను యక్షిణి జీవించుచుండెను. విధివ్రాత ప్రకారము ,
మహారాజునకు గండకాలము ప్రారంభమై యుండెను. తన నుదుటి వ్రాతను తలచుకుంటూ , స్వామి అనుగ్రహమును కోరుకుంటూ అనాలోచితముగా యక్షిణికి లోబడి యున్న ప్రాంతమునకు వచ్చి
చేరెను. అక్కడ నివసించు యక్షిణి సామాన్యమానవ మాత్రురాలు కాదు. మంగళకరమైన
శుభలక్షణములుగల పద్మినీ జాతికి చెందినదై , సౌందర్యవతియై చేతి నిండుగా గాజులు ధరించియూ , దీర్ఘమైన కురులు కలిగియుండియూ , నుదుట కస్తూరీ తిలకమును ధరించినదియూ నవరత్న
ఖచితమైన నూపురములను ధరించియూ యుండి అతిలోక సౌందర్యవతిగా యెప్పుచుండెను.
సాక్షాత్తూ రాజమాతంగి అంశ కలిగినదై యుండెను.

చూచుటకు సౌందర్యవతిగా కనిపించు ఆమె గుణమున అతి రౌద్రకరముగా ఉండి , ఆమె సమీపమునకు పోవుటకు ఎవరికినీ ధైర్యము చాలనట్టిదై యుండెను. శిష్టులను రక్షించుచూ ,
దుష్టులను శిక్షించి , వారి రక్తమును పీల్చివేయునట్టి ఉగ్రముతో రౌద్రముతో , కాళికాదేవిని
తలపించునట్లునుండెను. ఆమె రౌద్రమునకు భయపడి ఆ ప్రాంతపు దరిదాపులకు ఎవరూ
వచ్చుటకు సాహసించువారుకాదు. ఆమెను అణచుశక్తి ఎవరికీ లేకపోయెను. సమయము ఆసన్నమైనపుడు ఆమెను అనుగ్రహించవలెనని స్వామి తలచుచుండెను.

యక్షిణి దాపులకు వచ్చిన మహారాజు , ఆమె సౌందర్యమును దాసుడైనట్లుగా చూచుచుండగా ,
ఆమె అతిభీకరముగా నవ్వుచూ , మహారాజుని బంధించుటకై తరమసాగెను. ఆమె నుండి తప్పించుకొనగోరి మహారాజు పారిపోవు సమయమున కూడా అతడి మనస్సు శాస్తా యందు నిగ్నమై యుండినది. ఎటూ పాలుపోవని అయోమయ స్థితిలో , అనాలోచితముగా అతడి అడుగులు
*'అచ్చన్ కోవిల్'* ఆలయము వైపుగా నడవసాగినవి. అతడి భక్తికి మెచ్చిన స్వామి , మహారాజుని రక్షింపగోరెను. అదే సమయమున యక్షిణి యొక్క రౌద్రమును అణచి ఆమెను అనుగ్రహించవలెనని
తలచెను.

మరుక్షణమే పరమపావనమూర్తియైన శ్రీశాస్తా , యక్షిణి ముందు సాక్షాత్కరించి చిరుదరహాసమును
చేసెను. మహారాజుని వెన్నంటి వచ్చిన యక్షిణి స్వామిని చూచి స్తంభించి పోయి నిలుచుని
యుండగా , ఎక్కడి నుండో వచ్చిన బంగారు సంకెల , ఆమెను చుట్టుముట్టి , ఆమె కాలిని బంధించినది. అంత ఆమెను ఆవరించియున్న రౌద్రము పూర్తిగా ఉపశమించిపోయినది.

అంతవరకూ తాను చేసిన తప్పిదములను క్షమింపుమని దీనముగా స్వామిని వేడుకొనెను.
స్వామి ఆమెను మన్నించెను. తన క్రూరత్వమును అణచివైచిన ఆర్యనాధునికి జీవితాంతమూ సేవ చేయనెంచిన యక్షిణి , *“స్వామీ ! నన్ను కూడా తమరి యొక్క పరివారములలో నొకటిగా చేర్చుకొమ్ము”*
అని వేడుకొనెను.

ఆమె కోరికను మన్నించిన స్వామి *“దేవీ ! ఇకపై నీవు నా పరివారమున ముఖ్యస్థానము వహించి వెలుగొందుదువుగాక. నిన్ను సేవించువారికి సకల సుఖశాంతులు కలిగి , అపూర్వమైన సిద్ధులను పొందుదురుగాక”* అని ఆశీర్వదించును.

తన యొక్క పూర్వ పుణ్యవశమున , స్వామి యొక్క సభయందు కొలువై యుండగల అర్హతను పొందినదైన యక్షిణి. స్వామి అనుగ్రహించిన బంగారు సంకెలను , అభరణముగా ధరించి , అష్టదిక్కుల యందూ ప్రకాశించు వైభవమును పొందినది.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow