శ్రీ మహాశాస్తా చరితము - 82 | వీరభద్రుడికి బ్రహ్మహత్యాపాతకము తొలగిపోవుట | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 82 | వీరభద్రుడికి బ్రహ్మహత్యాపాతకము తొలగిపోవుట | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

వీరభద్రుడికి బ్రహ్మహత్యాపాతకము తొలగిపోవుట

*బ్రహ్మ యొక్క మానస పుత్రులలో ప్రధానుడైన దక్షప్రజాపతి మనువు యొక్క కుమార్తె అయిన ప్రసూతిని పెండ్లాడి , ఆమె మూలముగా పలువురు కుమార్తెలను పొందెను. అశ్విని మొదలు రేవతి వరకు గల 27 మంది కన్యకలను చంద్రుడికిచ్చి వివాహము చేసెను. సాక్షాత్ లోకమాత ఉమాదేవి *'సతి'* అను పేరుతో అతడికి కుమార్తెగా జన్మించి , ఈశ్వరుడిని పరిణయమాడెను.

సాక్షాత్ పరమశివుడే తనకు అల్లుడిగా లభించిన భాగ్యమునకు దక్షుడు అతి గర్వముతో విఱ్ఱవీగనారంభించెను. మామగారి స్థానములో నున్న తనను అల్లుడు గౌరవించవలెనని తలచెను. పరమేశ్వరుడిని గురించి పరుల యెదుట హేళనముగా మాట్లాడనారంభించెను. పరమ శివుడిని ఆహ్వానింపకయే ఒక మహాయాగమును నిర్వహించెను.

ఆ యాగమునకు విచ్చేసిన దధీచి మహర్షి చేసిన శివస్తోత్రమును , ఎవ్వరూ అతడి మాటనూ పట్టించుకొనరైరి. వెంటనే అతడు అందరిని శపించి , అచ్చటినుండి వెడలెను. అందులకై కోపగింపిన తన తండ్రి నిర్వహించు యాగమును గూర్చి విన్న ఉమాదేవి పుట్టింటి మీద గల అభిమానముతో , భర్త పరమశివుడు నిరోధించినను వినక పిలువని పేరంటానికి వెళ్లినట్లుగా యాగశాలకు ప్రవేశించెను. ఎంతో ప్రేమతో వెళ్లిన అంబికా దేవికి అచ్చట అవమానమే ఎదురయ్యెను. అహంభావి అయిన దక్షుడు ఆమెపట్ల నిర్లక్ష్యముగా ప్రవర్తించెను. అందరి యెదుట పరమశివుడిని గూర్చి అవమానకరముగా మాట్లాడెను. ఎంత తండ్రి స్థానములో నున్నప్పటికినీ , అది తగునా ? పతివ్రతా శిరోమణి అయిన అంబిక క్షణమాత్రమైనను ఆస్థలములో నిలువజాలకపోయెను. అవమాన భారమును వహింప ఆమెకు దుస్సహమయ్యెను.

*'మూర్ఖుడైన దక్షుడి యజ్ఞము విధ్వంససమగుగాక"* అని శపించెను. అతడివలన కలిగిన అవమానమును సహింపజాలక అగ్నిలో దూకి దేహత్యాగమును గావించుకొనెను.

తన ధర్మపత్ని సతీదేవి ఆత్మత్యాగము గావించుకున్న విషయము నెరిగినవాడై పరమశివుడు

అగ్రహముతో మండిపడెను. తన జటాజూటములోనుండి క్రోధావేశపరుడైన వీరభద్రుడిని సృష్టించెను. అతడు యాగశాలలో స్వైరవిహారము గావించెను. తన తల్లి అంబికకు జరిగిన అవమానమును తలచుకొని , అందరిమీదనూ పగ తీర్చుకొనదలచెను. యాగములో పాలుపంచుకొన్న వారినందరినీ , ఒక్కరిని కూడా వదలక , కఠినముగా శిక్షించెను. దేవతలను , భూత గణములను నానావిధములుగా హింసించెను. యాగశాలను చిందర వందరగావించెను. దక్షుడి దేహాంగములను బాధించి , అతడి శిరస్సును ఖండించి మండుచున్న అగ్ని గుండములో పడవైచెను. యాగశాలను యుద్ధ భూమిగా మార్చివేసెను. బాధితులైన దేవతలు వీర భద్రమూర్తి కాళ్లపై బడి మొఱలిడి మన్నించుమని ప్రార్థించిరి. అత్యంతావేశాగ్రహములతో అందరినీ పట్టి చెండాడుతున్న వీరభద్రుడిని శాంతింపజేయుటకు ఎవ్వరి వలన నూ సాధ్యము కాలేదు చివరికి ఆ పరమశివుడే యాగశాలకు ఏతెంచెను. వీరభద్రుడి కోపము నణచి శాంతింపజేసెను.

పిదప ఈశ్వరుడు , మృతులైన వారినందరినీ బ్రతికించెను *"ఇక మీదట మాకు ద్రోహము చేయునట్టి తలంపు మానవలయును. అట్లు చేయదలచిన వారికి సహకరింపవలదు , అని వారిని హెచ్చరించెను. ఒక అజము యొక్క తలను నరికి , దానిని దక్షుడి మొండమునకు అమర్చి , అతడిని ప్రాణములతో నిలబెట్టెను.

*దక్షుడు ఎంతటి క్రూర కృతమును తలపెట్టినను , అతడు బ్రహ్మయొక్క కుమారుడు. ప్రజాప్రతులలో ప్రథముడు సాక్షాత్ అంబికాదేవికి కన్నతండ్రి. పుణ్యవంతుడు వీరభద్రుడు క్రోధావేశపరుడై బ్రహ్మాది దేవతలందరిని నొప్పించెనుగదా ? ఆ పాపము ఊరకపోవునా ? అంతటి మహేశ్వరుడికి పుత్రుడిగా జన్మించియూ వీరభద్రుడికి బ్రహ్మహత్యా పాతకము అంటుకొనెను. అత్యంత పరాక్రమవంతుడనైనను , నాకిట్టిదుర్గతి లభించినదికదా , నా ఔన్నత్యమునకిది తీరని కళంకము నొసగును కదా"* అని చింతించెను. ఆ బ్రహ్మహత్యా దోషము నివారించుమని ఆ సర్వేశ్వరుడిని ప్రార్థించెను.

పరమాత్మ , *"వత్సా ! నీవు బాధపడవలసిన పనిలేదు. దోషరహితుడూ , అనాది మధ్యాంతుడూ , విశ్వపాలకుడూ అయిన శ్రీమహాశాస్తాను ఆరాధింపుము. పుణ్యభారతదేశమున దక్షిణ ప్రాంతమున తిరుక్కోట్టిక్కావల్ అను క్షేత్రమును చేరుకొనుము. అచ్చట వెలిసియున్న ఆలయమునకు పశ్చిమదిశలో ఒక దివ్యమైన తీర్ధమును సృష్టించి , అందులో స్నానమాడి , పరిశుద్ధుడవై హరిహరపుత్రుని పూజించినయెడల నిన్ను పట్టి పీడించునట్టి మహాపాతకము తొలగిపోవును"* అని ఆశీర్వదించెను.

తదాదేశానుసారము భూలోకమును చేరుకొన్న వీర భద్రమూర్తి తిరుక్కోట్టిక్కావల్ ను చేరుకొని , పడమటి దిశలో నెలకొనియున్న శాస్తాను పూజించెను. అచ్చట భూతతీర్థములో స్నానముచేసి శాస్తాను ఆరాధించుచుండెను. ఆ విధముగా శాస్త్రాను శ్రద్ధాభక్తులతో కొలుచుచుండ , మహాశాస్తా అతడి భక్తికి సంతోషించి , దర్శనమొసగెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow