శ్రీ మహాశాస్తా చరితము - 81 | కార్తవీర్యుడు భగవదను గ్రహమును పొందిన విధము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 81 | కార్తవీర్యుడు భగవదను గ్రహమును పొందిన విధము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

కార్తవీర్యుడు భగవదను గ్రహమును పొందిన విధము

*శైల పర్వత ప్రాంతమును కృతవీర్యుడను రాజు సుభిక్షముగా పరిపాలించుచుండెను. సంతాన భాగ్యమునకు నోచుకొనని ఆ రాజు వినాయకుడిని గూర్చి తపస్సు చేసెను. ఆ పంచహస్తుడి అనుగ్రహము వలన , అతడి భార్యసుగంధి గర్భమును దాల్చెను నెలలు గడచిన పిమ్మట , ఒక కుమారుడికి జన్మినిచ్చెను. ఆ బాలకుని పేరు కార్తవీర్యుడు. జన్మతః ఆ బాలకుడికి కాళ్లు చేతులూ లేవు. పుట్టుకతోనే అంగవికలుడైన పుత్రుడిని గాంచి దంపతులిరువురూ శోకసంతప్తహృదయులైరి మనస్సును సమాధానపరచుకొని అతడిని పెంచసాగిరి ఇట్లు పండ్రెండ్రేళ్లు గడచినవి.

ఒక పర్యాయము , త్రిమూర్తుల అంశమున భూలోకములో జన్మించిన శ్రీదత్తాత్రేయమహర్షి. రాజు యొక్క అంతఃపురమునకు విచ్చేసెను. అంగవికలుడైన బాలుడిని చూచిన క్షణముననే , అతడి హృదయము ఆర్ద్రమైనది. ఆ బాలకుడు వినాయకుడి యొక్క అనుగ్రహముతో జన్మించెను కనుక , ఆ ఏకదంతుడే అతడి అంగవైకల్యమును తీర్చునుగాక" అని పలికి , వినాయకుడే అతడిని కాపాడునట్లుగా చేసెను , వినాయకుడతడి అంగవైకల్యమును తొలగించి , కాళ్లు చేతులను ప్రసాదించెను.

అయినను రాజు నాకు తదనంతరము ఇతడు రాజగును కదా ? అస్త్ర శస్త్ర విద్యలలో అతడికి అభ్యాసము లేదుకదా ? పండ్రెండ్రు సంవత్సరములు ఎట్టి అభ్యాసము చేయుటకు అవకాశము లేక పోయెను గదా ? ఇక మీదట సమరవీరుడిగా , ధీరుడిగా ఎట్లు నిలువగలదు ?" అని రాజు పరిపరివిధములుగా , తన కుమారుడిని గురించి చింతించుచుండెను.

కార్తవీర్యుడు క్రమ క్రమముగా జౌన్యత్యమును పొందుటను గాంచి దత్తాత్రేయుడు , *"రాజా ! నీ కుమారుడిని గురించి బాధపడవలసిన అవసరములేదు. అతడికి నేను రాజరాజేశ్వరుడూ , సకలలోక రక్షకుడూ , పరమాత్మ స్వరూపుడూ అయిన శ్రీశాస్తా మూలమంత్రమును ఉపదేశించుదును.*

లోకములను తన ప్రకాశముతో వెలిగింపజేయునట్టి సూర్య భగవానుడికి , రేవంతుడను పేరు గల కుమారుడు జన్మించెను. సూర్యపుత్రుడైన రేవంతుడు వైవశ్యతపతిగా విరజిల్లు మహాశాస్తా మీద మితిమీరిన భక్తి కలిగియుండెను. శాస్తా యొక్క పరమానుగ్రహమును పొందిన రేవంతుడు అనేక విధములుగా శాస్తాను ఆరాధించి , అపూర్వమైన అతడి మంత్రమును ఉచ్చరించెను. అతడి వలన విరాజమానమైన శాస్తా మూలమంత్రము కల్పవృక్షముతో పోల్చదగినది. అంత సులభముగా దాని ప్రభావము నెఱుగుట మనకు సాధ్యము కాదు ," అని పలికి కార్తవీర్యుడికి శాస్తా యొక్క అపూర్వమైన మూలమంత్రమును ఉపదేశించెను.

గురువుయొక్క పరమానుగ్రహమును పొందిన కార్తవీర్యుడు సదాసర్వకాలములయందునూ శాస్తా మూలమంత్రమును స్మరించుచుండెను. కొన్ని సంవత్సరముల కాలము గడిచెను. కార్యవీర్యుడు గావించిన తపస్సుకు సత్ఫలము లభించెను. అతడి తపస్సుకు మెచ్చి కరుణాసింధువైన శాస్తా మందహాసవదనుడై , కోటి సూర్య ప్రకాశముతో , సమస్త పరివారగణముల మధ్య నిలిచినవాడై దర్శనమొసగెను. శాస్తాను కన్నులారా గాంచిన , కార్తవీర్యుడు భక్తి పరవశత్వముతో ఆనందాశ్రువులు స్రవించుచుండగా, అంజలి ఘటించి నిలచెను. మేను మరచిన స్థితిలో వరమును కోరుకొనవలయునను విషయమును సైతము మరచెను.

శాస్తా అతడి నిస్స్వార్థమైన భక్తి భావనకు సంప్రీతుడయ్యెను. *"కార్తవీర్యా ! నీవు రోగగ్రస్తుడవు కాకుండా ఆరోగ్యవంతుడవై సుదీర్ఘకాలము జీవించుదువుగాక ! అత్యంత పరాక్రమశాలివై , గురువు యొక్క ఆదరణకు పాత్రుడవై రాజ్యపరిపాలనమును గావించి యశోవంతుడవు అగుదువుగాక. రాజాధిరాజుగా పేరొందగలవు. నా దయకు పాత్రుడవు కాగలవు. నీ పరాక్రమానికి సాటివచ్చు వీరులెవ్వరూ ఇక జన్మించరు. చివరికి నా అనుగ్రహముతో నారాయణుని అంశతో ఇహలోక జీవితమును గడిపి , అమరత్వసిద్ధిని పొందగలవుగాక"* అని వరమును అనుగ్రహించెను.

శాస్తా యొక్క దివ్యవర ప్రసాదమును పొందిన వాడైన కార్తవీర్యుడు ఆ రావణుడినే జయించగలిగిన మహావీరుడిగా , యశోవంతుడయ్యెను.

మరియు శాస్తా యొక్క దయతో అనేకములైన అపూర్వ సిద్దులను పొందగలిగెను.

కార్తవీర్యుడు తన రాజ్యములో నివసించుచున్న ప్రజలు ధర్మవర్తనులై ఉండవలయునని కోరెను. ద్రోహిచింతనతో ఎవ్వరైనను దుష్కృత్యముల పాల్పడినచో , తక్షణమే ఆస్థలమున ప్రత్యక్షమై వారిని నిరోధించుచుండెను. కార్తవీర్యుడు శాస్తా మహిమతో బలపరాక్రమములు పొంది సమస్త లోకములు స్తుతించు విధముగా , ధర్మపాలనముగావించి , ఆ దేవేంద్రుడు సైతము అవనతవదనుడగు రీతి నీతివంతుడై నడచుకొనెను.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow