శ్రీ మహాశాస్తా చరితము - 80 | అగస్త్యుడికి శాస్తా దర్శనము లభించుట | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 80 | అగస్త్యుడికి శాస్తా దర్శనము లభించుట | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

అగస్త్యుడికి శాస్తా దర్శనము లభించుట*

బహుకాలమునకు పూర్వము , కైలాసనాథుడైన పరమశివుడు పర్వతరాజుకు కుమార్తెగా జన్మించిన పార్వతీ దేవిని వివాహమాడెను. అప్పుడు వరుడి అలంకారముతో ఉన్న పరమేశ్వరుడి సుందర రూపమును చూడగోరి ముప్పది ముక్కోటి దేవతలూ , ఋషులూ , అసురులూ మున్నగు వారందరూ
విచ్చేసిరి. ముల్లోక వాసులందరూ ఒకే చోట కూడినందువలన ఆ బరువు వల్ల దక్షిణ భాగము స్థూలముగాను సూక్ష్మముగాను వంగినవిధముగా ఉండెను. ఉత్తరము వైపున భారము ఎక్కువైనందున , దానికి సమముగా దక్షిణము వైపు లేదు కనుక , దానిని గమనించిన శివుడు , దానిని సమముగా
చేయుటకు అగస్త్య మహర్షిని పిలిపించెను.

కైలాసములో కొలువు దీరియున్న దేవతలు , మునులు , వీరందరికీ సమముగా అగస్త్యుడు ఒక్కడే చాలును , అతడు ఒక్కడు మాత్రము దక్షిణము వైపుకు వెళ్లినచో , ఉత్తర దక్షిణములు రెండూ
సమమగును. కాబట్టి పరమశివుడు అగస్త్యుడిని దక్షిణ దేశమున కేగి , అచ్చట నివసింపుమని
వేడుకొనెను.

తన కప్పుడు భగవంతుడి వివాహమును చూడగల అవకాశము లభించదు కదా అని అగస్త్యుడు
చింతించెను. అందులకు , పరమశివుడు *“నీవు ఉన్నచోట మేము దర్శనమొసగుదుము. దక్షిణ దేశములోనే యుండి మా పరిణయ దృశ్యమును కన్నులారా గాంచగలవు”* అని వరమొసగెను.

పొట్టివాడైన ఆ మహాముని , పొదుగైమలై చేరెను. అంతట అతడి మహిమవలన భూమి
సమస్థితికి వచ్చెను. ఈశ్వరుడి అనుజ్ఞను నెరవేర్చిన సంతృప్తితో అగస్త్యుడు పొదిగైమలై లోనే స్థిరనివాసము నేర్పరచుకొనెను. పరిపూర్ణతను పొందవలయునని తలచి బహు కాలము తపము
నొనరించెను.

ఆ ముని పుంగవుడు దక్షిణ దేశమునకు వచ్చుచున్న మార్గములో , గణపతి కాకము (కాకి)
రూపములో వచ్చి , అగస్త్యుడి కమండలములోని జలమును క్రింద పడునట్లుగా చేసెను. తన్మూలమున రూపొందిన పుణ్యనది *'కావేరి'* అను పేరిట సుప్రసిద్ధమయ్యెను. కమండలములో మిగిలియున్న జలమును దక్షిణ దేశమున వెదజల్లుగా అదొక జీవనదిగా మారి *'తామ్రపర్ణి'* అను పేరిట
ప్రఖ్యాతి వహించెను.

ఒక దినమున , యోగముద్రలో నున్న అగస్త్యమహామునికి అత్యంత తేజో మయమైన జ్యోతి
గోచరించెను. దాని దర్శనభాగ్యము వలన అతడికి పరవశత్వము కలిగెను. దానికి కారణము
తెలియక పోగా , అగస్త్యుడు తన దివ్య దృష్టితో పరిశీలించెను. శివపుత్రుడైన మహాశాస్తా సకలపరివార గణసమేతుడై , పుష్పకళాసహితుడై , ఆదిభూతనాధ స్వరూపుడై అగస్త్యుడి జ్ఞాన నేత్రముల యెదుట
గోచరించెను.

*"ఆహా ! ఏమి నా భాగ్యము ! శాస్తా యొక్క అద్భుత స్వరూప సందర్శనము”* కలిగినది అని తన అదృష్టమును తానే కొనియాడుకొనెను. విభూదితో వెలుగొందుచున్న ఆ మహార్షిమేను పులకరింతలతో గగుర్పొడిచెను. కన్నులనుండి ఆనందాశ్రువులు స్రవించెను. సత్యశీలుడైన ఆ మహాముని శాస్తాకు
నమస్కృతులనొసగెను.

ఆ కుఱుచముని తనకంతటి భాగ్యమును కలిగించిన శాస్తాను కన్నులారాగాంచి మనసారా స్మరించి సంతోషించెను.

*“అగస్త్యా ! నాకెంతో ప్రీతి పాత్రుడవైతివి. నాప్రియ భక్తుడిగా నీవు ప్రధాన స్థానమును అలంకరించుదువుగాక , కవిగా , మహామునిగా , సిద్ధుడిగా , యోగిగా , దైవముగా అందరి చేతనూ స్తుతింపబడుదువుగాక , ఉత్కృష్టమైన దశ నీకు ప్రాప్తించునుగాక”* అని అనుగ్రహించెను.

*" నావలన ఏర్పడిన తామ్రపర్ణి నదీ తీరమున మీరు నెలకొని యుండవలయునని " అగస్త్యుడు శాస్తాను వేడుకొనెను.*

*అందులకు శాస్తా "మునివర్యా ! పవిత్ర గంగానదితో సమానమైన తామ్రపర్ణి నాకెంతో ప్రియమైనది. తామ్రపర్ణినది ప్రవహించు ప్రాంతములతో అనేక స్థలములలో నేను అవతరించుదును. భక్తులకు " దర్శన భాగ్యమును కలిగించుదును గాక”* అని వరమొసగెను.

అగస్త్యుడికి శాస్తా సాక్షాత్కరించిన దినము ఆషాడ మాసము , అమావాస్య. *“ఈ శుభదినమున , ఇచ్చటికి వచ్చి , ఈనదిలో స్నానము చేసి , మిమ్ము పూజించిన భక్తులకు సకల దోషములు హరించునట్లుగాను , సకల ఐశ్వర్యములు సిద్ధించునట్లుగాను అనుగ్రహింపుము”* అని అగస్త్యుడు శాస్తాను ప్రార్థించెను.

భక్తజనులను అనుగ్రహించుటకు భగవానుడు సర్వదా సంసిద్ధుడై ఉండును కనుక , *“నీవు అడిగిన విధముగానే జరుగును గాక”* అని అందులకు అంగీకరించెను.

ముప్పది ముక్కోటి దేవతలు రాజాధిరాజైన ఆ లోక నాయకుడికి *'దిగ్విజయమస్తు'* అనుచు జేజేలు పలికిరి. శాస్తా మీద పుష్పములను వెదజల్లిరి ఆ దృశ్యము చల్లని వర్షపు జల్లువలె ఉండెను.

ఆ ప్రాంతమున నెలకొన్న భగవానుడికి *'పొన్ పొరియుమ్ ముత్తయ్యన్'* అను పేరు ఏర్పడెను.

ఆది గురువైన అగస్త్యుడు ఉండిన ప్రాంతము కనుక , శాస్తా వెలసిన క్షేత్రములలోనే ఇది
మూలాధారక్షేత్రముగా పేరుపొందెను. కాలక్రమేణా , పలువురు పరివార భూతములూ గణములూ
శాస్తాతో ఉండుటకై విచ్చేసి , అచ్చట స్థిరనివాస మేర్పరచుకొనిరి. సంగిలిభూతము , కార్తవ రాయన్ ,
పాతాళ భూతమ్ , సుడలైమాడన్ , కరడిమాడన్ , భట్టవరాయన్ మున్నగువారు అయ్యప్ప వెలసిన చోట నివసించిరి.
శాస్తా వెలసిన ఐదు ప్రధాన క్షేత్రాలలో ఒకటిగా పేరొందిన ఈ క్షేత్రమును గురించి మణిదాసుడు తన భక్తి గీతములలో పేర్కొని యుండుట విశేషము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow