ఆలయమును పునరుద్ధరించిన అయ్యప్ప*
తెన్ (దక్షిణ) కాశిలో నివసించుచున్న పాండ్యరాజు వంశస్తులు మహాశాస్తాను తమ కులదైవముగా నెంచి కొలుచుచుండిరి. శాస్తా వారికి స్వప్నము నందు సాక్షాత్కరించి , వారిని *'పందళము'* అను ప్రాంతమునకేగి , అచ్చట నివాసము నేర్పరుచుకొనుమని ఆదేశము నొసగెను. భగవానుడిఆదేశానుసారము వారు నడచుకొనిరి. అతి శీఘ్రకాలమునందే. పందళము ఒక పటిష్టమైన సామంతరాజ్యముగా రూపుదిద్దుకొనెను. ఇల్లత్తూరు , కొన్నియూరు , అచ్చన్ కోవిల్ మున్నగు ప్రాంతములు
పందళరాజ్యాధిపత్యములోనికి వచ్చిచేరినవి.
ఈ విధముగా , బహుసంవత్సరముల కాలము గడచెను. ఉదయనుడను పేరుగల గజదొంగ అక్రమకార్యాలు అధికమై , ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులను గావింపసాగెను.
పందళ రాజ్యమంతటా అరాజకము తలయెత్తనారంభించెను ఆప్రాంతములను పరిపాలించు
రాజులలో మహా పరాక్రమవంతులైరాజు లెవ్వరును గానరారైరి దారిదోపిడీలు , హత్యాపాతకము
సర్వసాధారణమైనవి.
శాస్తాయొక్క దివ్యాలయము నెలకొనియున్న పుణ్యస్థలమైన శబరిమల మీదనూ ఉదయనుడు
దురాక్రమణ గావించెను. అతడాప్రాంతసమీపమున సంచరించుచుండుట వలన , భక్తజనులు
ఆలయములోనికి ప్రవేశించుటకైనను సాహసింపజాలక పోయిరి. ఇక , దైవారాధనమునకు వారు
నోచుకొనజాలకుండిరి.
తత్ సమయమున పందళము యొక్క రాజాంతఃపురమున అలజడులు చెలరేగనారంభించెను.
ఉదయనుడు శబరిమల , తలైప్పాట్టె , ఇంజిప్పాపై మున్నగు ప్రాంతములలో దుర్గములను
నిర్మించుకొనెను. తోడుదొంగల నెందరినో తనకు సహాయముగా గొని , ప్రత్యేకముగా తనకొక రాజ్యమును స్థాపించుకొనెను. రహదారులూ , ఇతరప్రధానమార్గములన్నియు గజదొంగల దుశ్చర్యలతో
భయమును గొలుపుచుండెను. తమిళ , కేరళ దేశ వ్యాపారులకు సహకారమునందించిన
ముఖ్యమైన దారులన్నియూ రాకపోకలు తగ్గి , అల్లకల్లోలములకు ఆకరమయ్యెను.
ఒక పర్యాయము శబరిమలకు సమీపప్రాంతమున కొల్లగొట్టుటకు పూనుకొనెను. కానీ , వారికది
సాధ్యముకాలేదు. అప్పటినుండియు ఉదయనుడి సహచరులవలన , ఆప్రాంత ప్రజలకు కష్టనష్టములు
ఎదుర్కొనవలసిన దుస్థితి కలిగెను. ఒక మాంత్రికుడి నడుగగా , అతడు శబరిమల మీద నెలకొనియున్న భగవానుడు శ్రీధర్మశాస్తా యొక్క అపరిమితమైన శక్తివలన మాత్రమే వారు దండింపబడగలరు , అని
తెలిపిరి.
ఆ మాటలను విన్నంతనే కోపమును గొనినవాడై , శాస్తా దేవాలయమును విధ్వంసము గావించి
తీరవలయునని ప్రతిజ్ఞను చేపట్టెను అడ్డుపడిన అర్చకులను హింసించి చంపెను. శబరిమలలో
పూజలేవియు జరుగకూడదని ఆంక్షలను విధించెను. ప్రజలను ఎంతో క్రూరముగా బాధపెట్టుచుండెను.
గజదొంగల బారికి గురియై , వారి చేత వధింపబడిన నంబూద్రి అనునతడికి పండ్రెండ్రేళ్లు
వయస్సు గల జయంతుడను నొక కుమారుడు గలడు. అతడు శాస్తామీద అపరిమితమైన
ఆరాధనాభావము కలిగియుండెను. తన తండ్రి హత్యకు కారకుడైన ఉదయనుడిని ఎట్లయినను నాశనము చేయవలయునని కంకణము కట్టుకొనెను. అతడికి ఎవ్వరునూ చేయూత నందించగలవారు
లేరైరి. ఉదయనుడి మీద పగ దీర్చుకొననెంచి ,
జయంతుడి పొన్నంబలమేడులో ఉండి , శాస్తాను గూర్చి తపస్సు చేసెను. అను నిత్యము శ్రీ శాస్తా దివ్య నామమును స్మరించుకొనుచూ , శబరిమల
ఆలయమునకు సంభవించిన దీనావస్థను గూర్చి చింతించుచుండెను. దేవాలయమునకు పూర్వ
వైభవ స్థితి కలుగవలయునని మనసారా ప్రార్థించుచుండెను.
భక్తజన రక్షకుడగు శాస్తా అతడికి స్వప్నములో దర్శనమొసగి జయంతా ! దిగులుపడవలదు
సుమా ! అతి త్వరలో , సమస్త విషయములు సర్దుకొనును. అధర్మము పూర్తిగా నశించును. ధర్మము నెలకొని తీరును. ఆలయమునకు పూర్వము కంటెను అధికముగా పేరుప్రతిష్టలు కలుగగలవు. అని
అభయమునొసగెను.
శబరిమల దేవాలయమును పడగొట్టిన పిమ్మట , ఉదయనుడికి మదగర్వము అతిశయించెను
ప్రధాన నాయకులూ , సామాతరాజులూ అతడికి భయపడసాగిరి. అతడికి , తానూ ఒక గొప్ప రాజై ,
రాజమర్యాదలను స్వీకరించవలయునను కోరిక అధికము కాజొచ్చెను. పందళ దేశ రాజకుమార్తెను
వివాహమాడదలచినవాడై , బలాత్కారముగా ఆమెను చెఱపట్టెను.
శాస్తా దయానుగ్రహమును పొందిన జయంతుడు , ఉదయనుడి మీద పగదీర్చుకొనవలెనని
యెంచి , అతడి కన్నుగప్పి అతడి వద్దనున్న గజదొంగలలో నొకడుగా మారెను. రాకుమార్తెకు
మాత్రము ఈ రహస్యమును తెలియపరచెను. ఉదయనుడి చెఱనుండి ఆమెను విడిపించి తన
శపధమును నెరవేర్చుకొనుటకై ఆమెను వివాహమాడెను. ఆకాశమార్గమున నుండి దేవతలు దిగివచ్చి
శాస్తాను పూజించునట్టి , ఆకాశగంగ అయిన *కుంభదళతీర్థమునకు* చేరి , భగవానుడి అనుగ్రహమును
పొందగలిగెను. అతడి దయానుగ్రహము వలన తనకు జన్మించిన కుమారుడికి అతడిని నిస్మరించుకొను విధముగా అయ్యప్ప అని పేరు పెట్టుకొనెను.
చిఱుప్రాయమునుండి అతడికి తెలివితేటలు మెండుగా నుండెను. శస్త్రవిద్యలనభ్యసించి వాటిలో నైపుణ్యమును గడించెను. అత్యంత పరాక్రమవంతుడై , వెలుగొందుచు తన లక్ష్యసాధనమునకై
ముందంజవేసెను.
పందళ మహారాజు అడవిలో వేటనిమిత్తమై యేగుదెంచి , జయంతుడిని గాంచెను. అతడి మీద
మమతానురాగములను కలిగిన వాడై , అతడిని తనతో తీసుకొని వెళ్లి పెంచసాగెను. అతడు సకల కళావిశారదుడై విరాజిల్లెను.
