శ్రీ మహాశాస్తా చరితము - 98 | బుధవార వ్రతము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 98 | బుధవార వ్రతము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar


బుధవార వ్రతము*
శ్రీ బుధగ్రహము యొక్క పురాణము

ఒకానొక సమయమున ఆకాశమున సంచరించు వాడైన చంద్రుడు , తన గురువైన బృహస్పతి
యొక్క భార్య అయిన తారపై మోజు పడి , మోహించెను. గురుపత్ని అయిన తార కూడా చంద్రుని పట్ల ఆకర్షితురాలైనది. మాతృసమానురాలైన తారను , లోకోపవాదమునకు కూడా భయపడక తన
భవనమునకు తీసుకొని వచ్చి , ఆమెతో సుఖింపసాగెను.

దేవ గురువైన బృహస్పతి , ఇది విని మిక్కిలి కోపము బూని , అగ్రహావేశములతో చంద్రుని వద్దకు వచ్చి
తన భార్యను తనతో పంపివేయుమనియూ , లేనిచో ఉపద్రవమును ఎదుర్కొన వలసి వచ్చునని యూ హెచ్చరించెను.

*భగవంతునితో సమానుడైన గురువు అని కూడా చూడక , నిర్లక్ష్య వైఖరిని అవలంబించుచూ” సకల శాస్త్ర పారంగతురాలైన నీ భార్య , నన్ను ఇష్టపడి తనంతట తానే నాతో వచ్చినది. మీరు కావలసినచో వేరు స్త్రీని వివాహమాడుము”* అని హేళన చేసెను.

వేదన చెందిన బృహస్పతి , దేవరాజైన ఇంద్రుని సహాయము కోరెను. జరిగిన అనీతికి
ఎంతగానో చింతించిన దేవేంద్రుడు , చంద్రునికి గుణపాఠము నేర్పదలచి , తన సేనలను యుద్ధమునకై సమాయత్త పరచసాగెను.

ఈ సంగతి నెరింగిన రాక్షసగురువైన శుక్రాచార్యుడు , చంద్రునికి సహాయము చేయదలచి ,
ఇంద్రునితో పోరుకి సిద్ధమయ్యెను. వార్త తెలిసిన బ్రహ్మదేవుడు చంద్రుని పిలిపించి *"నీతి తప్పి చరించిన నీ వలన భయంకరమైన యుద్ధము జరుగబోవుచున్నది. ఇది నీకు తగునా”* అని
హెచ్చరించి పంపెను.

ఇది విన్న చంద్రుడు , తాను చేసిన పనికి సిగ్గుపడుచూ , తారను తన గురువుతో పంపివైచెను.

ఆ సమయమున తార గర్భవతిగా నుండెను. కొంతకాలమునకు ఒక మగబిడ్డ కలిగెను.
పరపురుషుని సాంగత్యమున నున్నపుడు ధరించిన గర్భముకావున , ఆబిడ్డను బయటనే వదలివేసి రమ్మని బృహస్పతి చెప్పెను. తార అట్లే చేసెను. విషయము తెలిసిన చంద్రుడు , అందముగా అలరారు ఆ బిడ్డను తాను చేరదీసి *'బుధుడు'* అను పేరు పెట్టి , ప్రేమగా పెంచుకొనసాగెను.

కొంచెము పెరిగి పెద్దవాడైన తరువాత , విద్యను నేర్చుకొనుటకై గురుకుల వాసమునకు పంపెను. మిగతా విద్యార్థులు అతడి పుట్టుక గూర్చి హేళన చేయుటతో అవమానపడుచూ
ఒంటరిగా దుఃఖించసాగెను. ఆదారిన వచ్చుచున్న దేవఋషి నారదుడు , బుధుని చూచి ఒంటరిగా
దుఃఖించు చుండుటకు కారణమేమని ప్రశ్నించెను కారణమును వివరించిన బుధునితో *"వత్సా ! నీ వేదన తీరుటకు ఒకే ఒక ఉపాయము కలదు. నీపై నున్న అపఖ్యాతి తొలగి , కీర్తింపబడవలెనన్నచో , కరుణా సముద్రుడైన మహాశాస్తాని కొలువుము. తనను నమ్మి వచ్చిన వారిని , తప్పక , కాపడగల ప్రత్యక్ష దైవము మహాశాస్తా”* అని ఊరడించెను.

*నారదుడు చెప్పినట్లే , బుధుడు చాలా కాలము పాటు స్వామిని గూర్చి కఠోర తపస్సు చేసిన పిదప , శాస్తా ప్రీతిచెంది , అతడి ముందు ప్రత్యక్షమయ్యెను తేజోమయమైన అద్భుత స్వరూపముతో భూతనాధుడు బుధుడి ముందు ప్రత్యక్షమవ్వగా శరీరము వణకుచుండగా , కనుల వెంట ఆనంద అశ్రువులు జాలువారుచుండగా , స్వామి యొక్క పాదములపై బడి పలువిధముల స్తుతించెను.”* భకా !
నీ తపస్సు సాధారణమైనది కాదు సకల విద్యలను
ఇకపై నీవు గురుకులమునకు పోయి
నేర్చుకొనవలసిన అగత్యము లేదు. సకల విద్యాజ్ఞానమును నీకు ప్రసాదించుచున్నాను. నిన్ను ఎవరైతే హేళన చేసితిరో , వారే బుద్ధికి మారుపేరు బుద్ధుడు అంటూ పొగడు విధముగా , నీవు
లోకమున వెలుగొందుదువు గాక. *లోకులకు మంచి చెడ్డలను ప్రసాదించు నవగ్రహనాయకులలో , వారమున గల నాలుగవ రోజునాడు ఆదిపత్య పదవిని పొంది ప్రకాశింతురు గాక”* అనెను.

*“మరియూ నీవు అధిపతిగా నుండు దినమున , ఎవరు ఈ వ్రతముబూని ఆరాధింతురో వారు పుత్రలాభము. జ్ఞానము , విద్య , వాక్చాతుర్యము మొదలగు వాటిని అపరిమితముగా పొందగలుగుదురు అను వరమును ప్రసాదించుచున్నాను”* అని పలికెను.

అట్టి విధముగా బుధుడు , శాస్తా యొకక అనుగ్రహము వలన మనోవేదన తీరినవాడై , గ్రహ ఆదిపత్య పదవిని పొంది , ముల్లోకములూ పూజించునట్టి వాడయ్యెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow