*స్వామి కొలువైయుండు ముఖ్యమైన కొన్ని ఆలయాలు - 3*
*శీర్గాళి కై విజాంజేరి*
వీర మహేంద్రపురిని పరిపాలించిన శూరనాధునిచే బాధింపబడిన దేవతలు *'శీర్గాళి'* యందు
అజ్ఞాత వాసము చేసిరి. పరమశివుని ప్రార్థించుటకై కైలాసమునకు బోవనెంచిన దేవేంద్రుడు , తన భార్యను ఒంటరిగా నుంచుటకు ఇష్టపడనివాడై , లోకపాలకుడు అయిన శాస్తా తప్ప వేరు దిక్కులేదని ఎంచి అతడి వద్ద వదిలి కైలాసమునకు పోయెను
ఇంద్రాణికి తన దళపతి అయిన మహాకాలుని తోడుగా నుంచగా , ఆ సమయమున , స్వామి
యొక్క గొప్పదనము తెలియని రక్కసి అయిన అజముఖి , ఇంద్రాణిని గొనిపోవనెంచగా , మహాకాలుడు ఆమె కరమును తుండించి వైచెను. ఆమె చేయి వదలక శచీదేవి మానమును కాపాడిన స్థలము. కావున కైవిడాన్ చేరి అయిన ఈ స్థలము , కాలక్రమమున కైవిళాంజేరిగా మారినది.
కైవిడాన్ అనగా తమిళమున *'చేయివదలని'* అని అర్థము.
*శ్రీ కాల్యారవ్య మహాక్షేత్ర దక్షిణాచాయయ స్థితః*
*మహాకాలయుధః శాస్తా మయిదాసే ప్రసీదతు*
శీర్గాళియందున్న *'తెన్ పాది'* అను స్థలమున ఈ ఆలయము వెలసి యున్నది.
ఇంద్రాణిని చేయి వదలక కాపాడినందువలన , శాస్తాని నమ్మినవారిని ఆయన వదలక
అనుగ్రహించునని విశ్వాసము.
*తిరుప్పిడవూర్*
అరువది మూడు నాయన్మారులలో ఒకడు , ఈశ్వరభక్తుడు అయిన చేరమానుడు తన మిత్రుడైన సుందరునితో సహా కైలాసమును చేరి శివసాయుజ్యమును పొందెను.
పరమేశ్వరుడు ఉత్సవవేళయందు ఊరేగిన వైభవమును చేరమానుడు ఆశువుగా పాడిన పాటలను విన్న ఈశ్వరుడు ఎంతో ఆనందించేను. పరమశివుని ఆనతిపై , ఈ పాటలను భూలోకమున నున్న ప్రజలందరికీ తెలియజేయవలెనన్న కోరికతో *'పిడవూర్'* అను స్థలమున ప్రచురించెను. తిరుచ్చి నుండి పెరంబలూరు పోవు మార్గమున ఈ స్థలము అమరియున్నది. చేత ఘంటము బూనిన భంగిమలో నున్న శాస్తాను *'అరంగేట్రియ అయ్యనార్'* అని పిలుతురు.
*మేలవాసల్*
మహాశాస్తాయొక్క మహిమలెన్నింటినో కీర్తించుచూ గానము చేయబడిన *'శ్రీమణిదాసుడు'* అను
భక్తుడు పూజించిన స్థలము.
ప్రస్తుతము ఈ ప్రదేశము పునలూరునకు సమీపముగా నుండి *'మేతిల్లా'* అంటూ
పిలువబడుచున్నది.
*సడైయుడైయార్ కోవెల*
తిరునేల్లేలి తాలూకా కల్లిడైకురిచ్చి యను ప్రదేశమనకు సమీపమున ఏటి ఒడ్డున వెలసియున్నది. ఇక్కడ నిలుచునియున్న బాలకుని వలె దర్శనమిచ్చును.
కారడవి యందు నిస్సహాయురాలై దీనముగా అలమటించు ఒక గర్భిణీ స్త్రీకి , జటాజూట ధారిగా స్త్రీ వేషము బూని , చేత ప్రకాశంవంతమగు దీపముతో వచ్చి , స్వయముగా తానే ఒక
వైద్యురాలివలె సుఖప్రసవము అగునట్లు చేసెను.
ఇతడు స్త్రీల పాలిటి కులదైవము. తనను శరణుజొచ్చినవారిని క్షణము కూడా వదలక , సదా తోడుగా ఉండి రక్షించువాడు. జటాధారిని శరణుగోరువారికి వేరు రక్షాకవచము అవసరము లేదు. స్త్రీలు ఈ ఆలయమునకు రాలేకపోయినననూ , సుఖప్రసవము అగునట్లు స్వామికి ముడుపులు కట్టి
యుంచి , స్వామిని ప్రార్థింతురు. తక్షణమే సుఖప్రసము అగును. ఈనాటికీ ఇట్లు జరుగుచున్నట్లు అనేక ఋజువులు కానవచ్చుచున్నవి.
స్వామి జటాధారిగా వచ్చి (స్త్రీ రూపమున) ప్రసవము చేసినందువలన ఇప్పటికీ బ్రాహ్మణుల
ఇంట జరుగు ప్రతి ఉత్సవమునందునూ , హరిజన కులమునకు చెందిన స్త్రీలు , స్వామికి ధూపము చూపు అర్హత కలిగియుందురు.
*నడుక్కాపుడెయార్*
అనేకమంది మునులను , సాధువులను హింసించి బాధించిన శంఖుకర్ణుడు మొదలగు రాక్షసులను ,
మహామునుల గోరికపై స్వామి సంహరించుటకై అవతరించిన స్థలము. ఇచట పూర్ణా , పుష్కలా
సమేతుడై వీక్షించియుండును.
అనేక వృక్ష జాలములచేతనూ , సెలయేర్లచేతనూ కూడి ఉన్న స్థలమైనందువలన స్వామిని
*'చంపకారణ్య శాస్తా'* అనియూ , *'మధ్యారణ్యేశ్వరుడు'* అనియూ కొలుచుదురు.
ఈ స్థలము తిరునెల్వేలి తాలూకాకు చెందిన *'పాళయంకోట్టె'* అను ఊరికి చెందిన శాంతి
నగరునందు స్వామి భక్తులు కోరికలను నెరవేర్చుచుండెను.
*నాగశాస్తా*
*'మయిలాడు దురై'* అను ప్రదేశమునకు సమీపమున నున్న *'వస్త్రరాజపురము'* అను స్థలమున
శాస్తా దర్శనమిచ్చుచుండును. పూర్ణా , పుష్కలాదేవులను ఒడసిపట్టుకున్న విధముగా , దర్శనమిచ్చును.
ఈ ఆలయమునందు నేటికీ కాపలాగా ఒక నాగము ఉండుటచేత *'నాగశాస్తా'* గా
పిలువబడుచుండును.
స్వామి కొరకు తెచ్చిన వస్తువులన్నియూ ముందుగా నాగరాజునకే చెందుచుండుటను ఈనాటికీ మనకు నిదర్శనముగా కనిపించుచున్నది.
*ఎరుమైతలైశాస్తా*
వృషభము యొక్క తలను పొందినవాడు అని అర్థం.
*త్రయాంబక పురాధీశం గణాధిప సమన్వితం గజారూఢం అహం వందే శాస్తారం కులదైవతం*
అను నమస్కార శ్లోకమును తెలియని శాస్తా భక్తులు ఉండరు.
ఆ త్రయంబకమునందు , ఈనాటి *'సేంగాలిపురం'* అను గ్రామమునకు సమీపముగా నుండు
*'ఎరుమైతలై'* అనుగ్రామమున , మామిడిచెట్టు క్రింద , ఏనుగుపై గంభీరముగా బాలశాస్తా రూపమున
దర్శనమిచ్చును. శ్రీ అనంతరామ దీక్షితులవంటి మహనీయులకు ఇష్టదైవముగానూ , కులదైవముగానూ
భాసిల్లునట్టివాడు. ఈనాటికీ కొందరు భక్తులకు బాలాశాస్తాగా చిన్నపిల్లవాని రూపమున దర్శనమిచ్చుట
మనకు తెలిసినదే.
శ్రీ మహాశాస్తా చరితము - 115 | స్వామి కొలువైయుండు ముఖ్యమైన కొన్ని ఆలయాలు - 3 | Sri Mahashasra Charithamu
October 12, 2025
Tags
