పద కవితా పితామహుడు అన్నమయ్య : డా|| రామ సూర్యనారాయణ

పద కవితా పితామహుడు అన్నమయ్య : డా|| రామ సూర్యనారాయణ

తిరుపతి, 2024 మే 24: అచ్చ తెలుగు పదాలతో కీర్తనలు రచించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన అన్నమయ్య పద కవితా పితామహుడిగా నిలిచారని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రామ సూర్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి.

ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన డా|| రామ సూర్యనారాయణ ”తాళ్లపాక కవులు – పద కవిత్వం” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య పద కవిత పితామహుని తెలిపారు. అదేవిధంగా అన్నమయ్య సతీమణి తిమ్మక్క సుభద్ర కళ్యాణం, కుమారుడు
పెద్ద తిరుమలాచార్యులు ద్విపదలో హరివంశము, మనువడు చిన్నన్న ఉషా పరిణయం, అన్నమయ్య చరిత్ర వంటి ద్విపద కవితలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా, గొప్పవైన సాహిత్య విలువలతో రాశారన్నారు. వంశమంతా కవులైన ఖ్యాతి తాళ్లపాక వంశానికి చెందుతుందన్నారు. బహు భాషా పండితుడైన అన్నమయ్య పదకవిత్వాన్ని భక్తిపథ కవిత్వంగా మార్చారని వివరించారు.

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ మలయ వాసిని ‘ అన్నమయ్య కీర్తనలు – వస్తు వైవిధ్యం ‘ అనే అంశంపై ప్రసంగిస్తూ, అన్నమయ్య మధుర భక్తితో వస్త్రాశ్రయ సాహిత్యం, ఆత్మాశ్రయ సాహిత్యం అనే రెండు అంశాలతో తన సంకీర్తనలను రచించినట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలను ఆధ్యాత్మిక విభాగంలో నాలుగు సంపుటాలు, శృంగారం విభాగంలో 22 సంపుటాలుగా విభజించినట్లు చెప్పారు. ఉత్తర భారత దేశంలో 14, 15, 16వ శతాబ్దాలలో సఖి సాంప్రదాయం వచ్చిందని సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాధాదేవిని సేవించినట్లు తెలిపారు. అదేవిధంగా సఖి సాంప్రదాయాన్ని అన్నమయ్య స్వీకరించి తనను అమ్మవారికి సఖిగా భావించి, శ్రీవారితో మమేకమై శృంగార కీర్తనలను రచించినట్లు వివరించారు

వరంగల్లు కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కాత్యాయని విద్మహే ‘అన్నమయ్య పద కవితలు – లౌకిక విలువలు’ అనే అంశంపై మాట్లాడుతూ, లౌకిక జీవితం లేకుండా భక్తి లేదని, సమాజంలో, వ్యక్తిగతంగా వున్న సమస్యల పట్ల ఆందోళన చెందుతున్న సందర్భంలో భక్తులు అవుతారన్నారు. అన్నమయ్య ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఆకలి, కష్టాలు భగవంతుడిని గుర్తు చేస్తాయని తన కీర్తనల ద్వారా తెలిపారన్నారు. అన్నమయ్య తన కీర్తనల ద్వారా ప్రజలు జీవితంలో అక్రమ సంపాదన ఉండకూడదని, కొద్దిగా ఆయన గౌరవకరమైన సంపాదన ఉండాలని, ఇతరులను నిందించకూడదని, హాని చేయకూడదని, కోపము వంటి దుర్గుణాలను వదులుకోవాలని, అవసరం ఉన్నవారికి సహాయం చేయాలని తెలిపినట్లు చెప్పారు. భక్తి ఉద్యమంలో శ్రీ పురుషులు సమానమని, సామాజిక అసమానతలు ఉండవని తన కీర్తనల ద్వారా భక్తి మార్గాన్ని ప్రబోధించినట్లు వివరించారు.

అంతకుముందు ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ మధుసూదన్ రావు బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు చెన్నై కి చెందిన ప్రియా సిస్టర్స్ బృందం సంగీత సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/kwPHmQs
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!