గతంలో పదునెట్టాంబడి ఎక్కే భక్తులూ, దిగే భక్తులూ మెట్టు మెట్టుకూ కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో 1985 నవంబర్ 30న పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. అప్పటి నుంచీ దీనికి ‘పొన్ను పదునెట్టాంబడి’గా పేరు వచ్చింది. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు.
1998లో, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విజయ్ మాల్య ఇచ్చిన మూడున్నర కోట్ల రూపాయల విరాళంతో ఆలయానికి బంగారు తాపడం చేశారు. అప్పుడే ఆలయానికి ఉత్తర, దక్షిణ గోడల మీద సుమారు పదహారు చదరపుటడుగుల్లో శ్రీ అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను చెక్కించారు. గర్భగుడి ప్రధాన ద్వారానికీ, తలుపులకూ, హుండీకీ కూడా బంగారు పూత పూయించారు.
అరిగిపోయిన పద్ధెనిమిది మెట్లకు కొత్తగా పంచలోహపు మెట్ల తొడుగు ఈ మధ్యే చేయించారు. వానలు వస్తే ఇబ్బంది లేకుండా పైభాగంలో కప్పులా రేకులు అమర్చారు. ఈ మెట్లు అయిదడుగుల పొడవు, తొమ్మిది అంగుళాల వెడల్పు, ఒకటిన్నర అడుగుల మందం కలిగి ఉంటాయి. భక్తులు ఎక్కినప్పుడు సహకరించడానికి పడికి రెండువైపులా పోలీసులుంటారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు మిగిలినవారిని ఆపేసి వారిని మాత్రమే అనుమతిస్తారు.
అయ్యప్ప వాహనం పులి కాదా?
అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద ‘వాజి’ వాహనం అంటే ‘గుర్రం’ వాహనం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం. అంతేకాని పులి కాదు. పులి పాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందళ రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు.