🔱 శబరిమల వనయాత్ర - 20 ⚜️ పంబా ⚜️

P Madhav Kumar


⚜️ పంబా ⚜️


వలియాన తావళమునుండి సుమారు రెండు కి.మీ. దూరము చిరియాన వట్టం మార్గముగా నడచినచో పురాణ ప్రసిద్ధమగు పుణ్యపంబానదీతీరమును చేరుకొన వచ్చును. దేశపు పలుభాగముల నుండియు , వాహనాదుల ద్వారా పంబానదీతీరము చేరుకొనే మార్గములు ప్రస్తుతము చక్కగా నిర్వహించబడుచున్నది. రాకపోకలను సరిచేయుటకును , నిర్వహించుటకును , వాటిని కర్తవ్యపాలనతోను వ్యవహరించి రహదారి విపత్తులను లేక జేయుటకు కృషిచేయుచున్నారనిన మిన్నగాదు. అలాగే టెలిఫోను డిపార్టుమెంటువారు , రక్షకభటులు , ఆరోగ్యశాఖ , అగ్నిమాపక కేంద్రమువారు , విశ్వహిందూపరిషద్ వారు , అఖిలభారత అయ్యప్ప సేవాసంఘము వారని పెద్దపట్టికతో కూడిన వీరందరూ అచ్చట గుమిగూడి భక్తాదులకు సేవచేయుటకై భాద్యతనిండిన తమవంతు కర్తవ్యాన్ని చేస్తూ స్వామివారికి ప్రీతిపాత్రులగుచున్నారు.


పంబాసరస్థటం లోకమనోహరం - సంప్రాప్యవిస్మయం పూండరుకీడినాన్ క్రోశమాత్రం విశాలం విశదామృతం - కేశవినాశనం జంతుపూర్ణస్థలం

ఉత్పలపద్మ కలార కుముదినీలోత్పల మండితం హంసకారండవ షట్పద కోకిల కుక్కుట కోయష్టి సర్ప సింహ వ్యాప్తు సుకరసేవితం పుష్పలతా పరివేష్టిత పాద పసల్పల సేవితం సంతుష్ట జంతుకం

కండుకౌతూహలం పూండ తర్ కుడిచ్చిండలుం తీర్తుమందం నడన్నీడినాన్"


యని శ్రీరామలక్ష్మణాదులు గాంచిన పంబను ఆధ్యాత్మ రామాయణమందలి

తెలుపబడియున్నది ఈ స్థలమునుగూర్చియే అయివుండాలి అని ఎంచురీత్యా ఆ పరిసర ప్రాంతమున వనలావణ్య ప్రవాహినియై గలగల పారే పంబానది ఇచ్చట యుండు త్రివేణి నుండి భిన్నమై ప్రవహించుచున్నది. కల్లారు మరియు కక్కాటారులు పంబతో సంగమించి ప్రవహించే త్రివేణి సంగమునకు వెడలి భక్తాదులు స్నానమాడెదరు , త్రివేణి మొదలు సిరియాన వట్టం వరకున్న విశాలమైన ఇసుకబారిన పంబానది తీరమునందే వేలసంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తజనము విరి ఏర్పరచుకొని స్నానమాడి , ఆహారాదులు సమకూర్చుకొని , పూజలు , భజనలు చేసి శ్రీ స్వామివారికి తాము వండిన ఆహార పదార్థములను నైవేద్యము చేసి వాటినే ప్రసాదముగా భుజించి విశ్రాంతి పొంది శబరిమలకు తరలెదరు. పితృతర్పణము పంబలో ఒక ప్రఖ్యాతిగాంచిన ఆచారముగా అనుష్టింపబడుచున్నది. ఏ కులస్థులైనను ఏ మతస్థు లైనను సరే ఈ పుణ్యభాగీరథియగు పంబలో పితృతర్పణము చేసినచో వార్ల యొక్క మునుపటి ఏడు తరాల వారు సద్గతి పొందుతారన్నది ఇచ్చట

గుమిగూడు వారి దృడవిశ్వాసము , ఇచ్చట ఇట్టి తర్పణములను చేయించుటకు , దానాదికాలను పొందుటకును కావలసినంత కేరళ పురోహితులు అచ్చట వేచియుంటారు. సాక్షాత్తు భగవత్స్వరూపుడైన శ్రీ అయ్యప్ప సైన్యసమేతుడై

ఇంజిప్పార , కరిమల మున్నగు దుర్గములయందు దాగియుండిన శత్రువులను హతమార్చిన పిమ్మట సైన్యములతో సహా ఈ పంబానదీతీరము చేరి విశ్రాంతి పొందినారట.


పిదప తాను వధించిన వారి ఆత్మశాంతి కొరకు తర్పణము దానము వంటి కర్మలను చేసినారనియు , ఆచర్యను అనుసరించు రీత్యా సలుపబడేదే నేటి శబరిమల యాత్రీకుల పంబా తర్పణము అని చెప్పబడుచున్నది. పిదప పలు విధములైన పిండివంటలతో గూడిన 'పంబాసద్ధి' తయారగుచున్నది. తదుపరి భక్తి పారవశ్యపు భజనలో శ్రీ స్వామివారిని పిలిచి స్తుతించెదరు. అచ్చటగూడియున్న ప్రతివారి విరిలోకి ఏదో ఒక రూపమున శబరిగిరినాధుడు పంబాసద్ధి భుజించుటకు వస్తారనునది ఐతిహ్యము. ఆ విశ్వాసముతో స్వామి అయ్యప్పతో సమబంతి భోజనము భుజించిన తృప్తితో పంబాసిద్దిని ముగించెదరు. అలనాటి పంబా తీరమున ఆలయములు ఏవియు ఉండేవి కావు. ఇప్పుడు అచ్చట నాలుగు దేవాలయములు ఏర్పడి , ఆ దేవాలయములన్నిటిలోను నిత్యపూజలు సలుపబడు చున్నది. శ్రీ మహాగణపతి , పార్వతి , శ్రీ రాముడు , శ్రీ హనుమంతుడు అను నాలుగు విగ్రహములు ఇచ్చట ప్రతిష్టించబడి భక్తులకు దర్శనమొసంగుచున్నది. పంబానది తీరమునుండి గణపతి , సన్నిధానము వరకు నిటారైన రాతిమెట్లను నిర్మించి

యున్నారు. పంబనుండి శబరిగిరివైపు వెడలే ప్రతి యొక్క భక్తుడును దర్శనము చేసుకొంటూ వెళ్ళేలా ఈ నాలుగు దేవాలయాలు నిర్మించబడి యున్నది. ఆ పంబాతీరమున విరి ఏర్పరచుకొని నివసించే ప్రతి యొక్క నిమిషమును ఆధ్యాత్మిక చింతనతో గూడిన ప్రపంచములో నివసించునట్టి అలౌకికానుభూతిని

కలుగజేయుచున్నదనిన మిన్నగాదు.


రేయిని గూడా పగలులా చూపించే దీపపు కాంతి కిరణాలలో *'కచ్చవడక్కార్'* అనబడు వ్యాపారస్తుల పిలుపులు , మైకులో ఎడతెగని అనౌన్స్ మెంటు శబ్దాలు , ప్రతియొక విరియందును వినిపించే భక్తిపూరిత మంత్రధ్వనులు , భజనపాటలు , వారి వారి భక్తి ప్రపత్తులను వెలుబుచ్చే శరణధ్వనులు , వెడలినవారు వెళ్తూ యుండగా , క్రొత్తగా వచ్చేవారు , వారి సంభాషణలు , సందడులు , మధ్యమధ్యలో సంకేతముగా వినిపించే శబ్దమంతయు స్వామి శరణనామములే వినిపించు ఆ పంబా తీర పరిసర ప్రాంతము అచ్చట గుమిగూడి యున్న భక్తజన హృదయములను ఆనందభరితులు గావించి అందరినీ పునీతులుగావించుచున్నదనియే చెప్పవచ్చును.


సముద్రపు అలలవలె పంబాతీరము చేరుకొనుచున్న భక్త బృందములకు వివరింపలేని రద్దీవలన ఆపదలేవియు కలుగక యుండుటకు మాలాధారులైన పోలీసుబృందము పరిసర ప్రాంతమంతయు తిరుగుతూ కర్తవ్య నిర్వహణ చేయుచున్నారు. అఖిలభారత అయ్యప్ప సేవాసంఘమువారు , వాలంటీర్లు , విశ్వ హిందూ పరిషత్ వారు , సేవామానసంతో తగురీత్యా తగు సదు పాయములను రేయి , పగలనక ఎల్లవేళల భక్తులకందజేయు చున్నారు. అచ్చట ఆయుర్వేద , అలోపతి , ఆసుపత్రులు నిర్వహింప బడుచున్నవి. అయ్యప్ప సేవాసంఘమువారి ఆయుర్వేద , అలోపతి మరియు హోమియోపతి ప్రథమచికిత్స శిబిరముల ద్వారా రేయి పగలనక ఎల్లవేళల వ్యాధిగ్రస్థులైన భక్తులకు వైద్యసదుపాయములను అందజేయుచున్నారు.


ఇదిగాక టెలిఫోను , వైర్లెస్ , తంతి - తపాల శాఖ , విద్యుచ్ఛక్తి సరఫరా కేంద్రము , అటవిశాఖ , ఎక్సైజ్ డిపార్టుమెంటు , నీటిసరఫరా , రవాణా సంస్థ అని పేరు పేరున ప్రతి డిపార్టుమెంటు వారు కర్తవ్యాచరణ ధృక్పథముతోను , మెలుకువతోను , ప్రవర్తించి లక్షలాది భక్తులు గుమిగూడే ఆ దినములలో ఆపదలేవియు కలుగక యుండుటకు కృషి చేయుచున్నారు అనియే చెప్పవచ్చు. ఎంతగా వారు మనకు సాయపడుటకు ముందడుగు వేసినను మనము గూడా (అచ్చటచ్చట గుమిగూడే జనావళిలోని ప్రతియొక్క భక్తుడును) తమవంతు కర్తవ్యముగా నియమనిబంధనలు ఉల్లంఘించక బాధ్యతతో తమ యాత్రా సమయము నందుగూడా మెసలు కొన్నచో మనకు సాయపడుటకొరకై డ్యూటి నిమిత్తం అచ్చట యుండువారి ఉద్దేశ్యము గూడా చక్కగా నెరవేరి ప్రతివారు సంతోషముగా శ్రీ స్వామివారిని దర్శించుకొని మరలే అవకాశము లభించును. కొబ్బరాకులతో కప్పిన *‘విరి'* అనబడు చిన్ని చిన్ని గుడిసెలే అచ్చట మనకు నివాసస్థలము.


అందుండియే అచ్చట చేరుకొనే వేలాది భక్తులు తమతమ ఆహారములను

తయారు చేసుకొనవలసియున్నది. అగ్ని ఎంత ఉపకారియో అంతటి అపకారి గూడ. కావున పనిముగిసిన తరువాత నిప్పును పూర్తిగా ఆపివేసిన పిమ్మటే ఇతర పనులు మొదలిడవలెను. ఎవరైనను నిర్లక్ష్యముగా అగ్నిని రగిలించి ఆర్పక అలాగే వెడలియున్నను వాటిని బాధ్యతాయుక్తముగా మనము ఆపు జేయుటకు ఏ మాత్రము వెనుకాడరాదు. ఎవరిపొరబాటు వలనైనను సరే అగ్ని అంటుకొంటే బాధితులయ్యేది మనమందరమే గదా ? అందుకే ఈ ముందు జాగ్రత్త. అలాగే మన భోజనానంతరము విస్తరులను ఎక్కడపడితే అక్కడ యని విసిరి పారేయుటయో లేక లక్షలాది భక్తులు పాపనాశినిగా ఎంచి స్నానమాడే పంబానదిలో వదులుటయో చేయక అందుల కొరకై యున్న స్థలము నందే నిక్షేపించవలెను. మలమూత్ర విసర్జనములను అందుకొరకై యున్న మరుగు స్థలములందు భక్తాదులు తమలో తాము కలహించుకొనక వీలైనంత వరకు సహనముతోను , ఔదార్యముతోను , స్నేహభావము తోను మెసలుకొనుట ఎంతో ఆవశ్యకరమైనదగును. పోలీసు అయ్యప్పల ఆజ్ఞలను ఉల్లంగించక కట్టుబడి మెసలుకొనుట ఆవశ్యకమగును. పై సూత్రములను పాటించడము వలన పలువిధములైన ఆపదలనుండియు , రోగములనుండియు రక్షింపబడి ఆనందముగా స్వామివారిని దర్శించి క్షేమముగా స్వగ్రామమునకు మరలే అవకాశము ఎంతగానో కలదు.


🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🪷🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat