నవగ్రహ పురాణం - 7 వ అధ్యాయం - పురాణ ప్రారంభం - 7

P Madhav Kumar


*పురాణ ప్రారంభం - 7*


స్వాయంభువమనువు చేతులు జోడించి నమస్కరించి , వెనుదిరిగాడు. శతరూప ఆయన్ను అనుసరించింది.


బ్రహ్మ సంతృప్తిగా నిట్టూర్చాడు. జీవుల సృష్టికి బీజావాపం జరిగింది. నవగ్రహాల ఆవిర్భావానికి నాంది జరిగింది ! మానసపుత్రులు , మనువు తమ కర్తవ్యాలను పాలిస్తారు.

సృష్టికర్త తన తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు.


విధాత అనుశాసనానికి అనుగుణంగా ఆయన మానసపుత్రులు ఆశ్రమాలు నిర్మించుకుని అనుష్ఠాన జీవనం ఆరంభించారు.


కాలక్రమాన తగిన కన్యలు వాళ్ళకు సహధర్మచారిణులుగా లభించారు.


అత్రి 'అనసూయ'ను , కర్దముడు 'దేవహూతి'ని , భృగువు 'ఖ్యాతిని , పులస్త్యుడు 'భూతి'ని , పులహుడు 'సంభూతి'ని , క్రతువు 'క్షమ'ను , అంగిరసుడు 'శ్రద్ధ'ను , వసిష్ఠుడు ‘ఊర్జ'ను ధర్మపత్నులుగా స్వీకరించి గృహస్థాశ్రమ జీవితాలు ప్రారంభించారు.


కాలచక్రం తిరుగుతోంది. విశ్వంలోని వివిధ లోకాలలో సృష్టి విన్యాసం

కొనసాగుతోంది. బ్రహ్మమానస పుత్రులూ , ప్రజాపతులూ సంతానవంతులయ్యారు. దేవహూతీ కర్దమ ప్రజాపతి దంపతులకు 'కళ' అనే పుత్రిక జన్మించింది. యుక్త వయస్కురాలైన 'కళ'ను బ్రహ్మ మానసపుత్రులలో ఒకడైన మరీచి వివాహం చేసుకున్నాడు. నారదుని ద్వారా బ్రహ్మదేవుడి ఆదేశాన్ని అందుకున్న కర్దముడు తన కుమార్తెను మరీచికి ధారబోశాడు. మరీచీ కళలు గృహస్థాశ్రమ స్వీకారం చేశారు.


అచిరకాలంలోనే ఆ దంపతులకు కుమారుడు జన్మించాడు. మరీచి కుమారుడికి 'కశ్యపుడు' అని నామకరణం చేశాడు. కశ్యపుడు తండ్రిని ఆదర్శంగా స్వీకరించి విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు.


సృష్టికర్త బొటనవేలి నుండి ఆవిర్భవించిన దక్షప్రజాపతి కూడా తండ్రి అయ్యాడు. ఆయనకు 'హర్యశ్యులు' అనబడే అయిదు వేలమంది పుత్రులు కలిగారు. అయితే యీ హర్యశ్వులు దక్షునికి ఆయన పత్ని ప్రసూతి ద్వారా జన్మించిన వారు కారు ; దక్ష ప్రజాపతి సంకల్ప సంభవులు ! తనకు జన్మనిచ్చిన సృష్టికర్తనే ఆదర్శంగా తీసుకున్న దక్షుడు ఆయన విధానాన్ని అనుకరిస్తూ ఐదువేల మంది హర్యశ్వుల్ని 'మానస పుత్రులు'గా పొందాడు.


దక్షుని దక్షత అసంగతమనీ , అవాంఛనీయమని గ్రహించిన నారదుడు దక్షపుత్రులైన హర్యశ్వులను కలిసి , విశ్వరహస్యాన్ని తెలుసుకొమ్మని ఉద్బోధించాడు. ఆ బోధనతో హర్యశులలో తీవ్రమైన జిజ్ఞాస మొలకెత్తింది. జగత్తు అంతాన్ని చూసి , విశ్వవిజ్ఞానాన్ని ఆర్జించే ఆశతో దక్షపుత్రులు అంతం లేని అన్వేషణలో పడి ఎటో వెళ్ళిపోయారు.


ఆ విధంగా పుత్రుల్ని కోల్పోయిన దక్షుడు మళ్ళీ వెయ్యి మంది మానసపుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళకు 'శబలాశ్వులు' అని నామకరణం చేశాడు.


నారదుడు శబలాశ్వులను కూడా తన తత్వబోధతో రెచ్చగొట్టి , శాశ్వత అన్వేషణలో వెళ్ళిపోయేలా చేశాడు. ఆ విధంగా దక్ష ప్రజాపతి పుత్రులు - రెండు బృందాలూ ఆయనకు దూరమయ్యారు. అందుకు కారకుడు నారదుడని తెలుసుకున్నాడు దక్షుడు. తన పుత్రుల్ని సంచారులుగా మార్చిన నారదుడు కూడా 'నిత్య సంచారి'గా మారిపోయేలా శపించాడు. ఆ శాపం సృష్టికర్త నారదునికి ఇచ్చిన శాపానికి అనుబంధంగా మారింది.


దక్షుడు బ్రహ్మను దర్శించి , తన పుత్ర వియోగ విచారాన్ని విన్నవించి , తరుణోపాయం అనుగ్రహించమని అర్ధించాడు. నారదుడు తనకు చేసిన అన్యాయాన్ని వివరించాడు. దక్షుని మానస పుత్రులు ఆరువేల మందీ ఆ విధంగా శాశ్వతంగా దూరం కావడం తన సంకల్పమే అన్నాడు బ్రహ్మ. అందుకు కారణం ఇలా వివరించాడు. *"నువ్వు సృష్టి కార్యదక్షుడు కావాలన్న ఆశయంతో నిన్ను సృష్టించాను. కానీ , నువ్వు అజ్ఞానంతో నన్ను అనుకరించి మానస పుత్రుల్ని సృష్టించావు. మానస పుత్రులు ఇచ్చే సృష్టి సంకల్ప సృష్టి. ఇది సృష్టి ప్రక్రియలో మొదటిది. మహాద్భుతమైన , మహోన్నతమైన సంకల్ప సృష్టి సాగించే అధికారం , అర్హతా విశ్వపతి అయిన విష్ణువుదీ , ఆయన పుత్రుడనైన నాదీ ! సంకల్ప సృష్టి నీకు సత్ఫలితాన్ని ఇవ్వదు !”* 


“ఈ మానస పుత్రుడి అజ్ఞానాన్ని మన్నించి , కర్తవ్య బోధ చేసి , అనుగ్రహించండి !" దక్షుడు సిగ్గుపడుతూ అన్నాడు.


"పుత్రా ! సంకల్ప సృష్టితో బాటు మరో మూడు విధాల సృష్టి ప్రక్రియలున్నాయి. అవి సందర్శన సృష్టి , స్పర్శ సృష్టి , సంపర్క సృష్టి..” బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. "సంకల్ప సృష్టి అంటే ఏమిటో నీకు స్వానుభవమే ! రెండవది సందర్శన సృష్టి. కేవలం పురుష ప్రాణికి దృష్టి మాత్రం చేతనే స్త్రీ ప్రాణి గర్భం ధరించి సంతానాన్ని కంటుంది. అచిర కాలంలో మయూరాలలో ఈ దృష్టి సృష్టిని నీవు ప్రత్యక్షంగా చూడగలవు !"


"ఇక స్పర్శసృష్టి... స్త్రీ , పురుష ప్రాణుల శరీరాలు ఒకదానినొకటి స్పృశించడం మూలంగా , తాకడం మూలంగా స్త్రీ ప్రాణి సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ స్పర్శ సృష్టిని కూడా ముందు ముందు నీవు జలచరాలైన మత్స్యాలలో చూడగలవు !"


"ఇక చివరిదీ , నాలుగవదీ అయిన సంపర్క సృష్టి అంటే ఏమిటో తెలియజేస్తాను. స్త్రీ , పురుష ప్రాణుల శరీరాల పరస్పర సంయోగం ద్వారా జరిగే సృష్టి ఇది ! జననాంగాలు ఈ సృష్టి ప్రక్రియలో సాధనాలు. పురుష ప్రాణి స్త్రీ ప్రాణి గర్భంలో సంతానకారకమైన తన వీర్యాన్ని యజ్ఞకుండంలో హవిస్సును చేర్చే విధంగా చేర్చాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat