పూరి జగన్నాథ - Purii Jagannath

P Madhav Kumar

 

భారతీయ సంస్కృతిలో అదో అద్భుతం. పౌరాణిక- చారిత్రిక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒకానొక దివ్యయాత్రా ధామం. అక్కడ విగ్రహం నుంచి ప్రసాదం వరకూ అంతా విశిష్టమే. ఆషాడ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర మహిమ ఏమిటి? మన సంస్కృతీ- సంప్రదాయాలకూ ఇక్కడి యాత్రకూ సంబంధమేంటి? జగన్నాథుడు దేవేరులతో కాక సోదర- సోదరీ మణులతో దర్శనమివ్వడానికి కారణాలేమిటి?

రథోత్సవం అంటే అదే. అశేష భక్తజనులను ఒక్కసారిగా దర్శించాలంటే ఆ ఉత్సవాలకు వెళ్తే సరి. ప్రపంచంలో భక్తజనం పోటెత్తే.. కొన్నంటే కొన్ని ఉత్సవాల్లో దీనికి ప్రత్యేక స్థానముంది. ఆ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే  జనసంద్రాన్ని దగ్గరుండి చూడ్డం. సోదర తత్వానికీ, మత సామరస్యానికీ ప్రతీక అయిన జగన్నాథ్ రథయాత్ర విశేషాలు ..
  • 9 రోజులు
  • 18 ఏనుగులు
  • 38 మంది మల్లయోధులు
  • 101 వాహనాలు
  • 136వ రథయాత్ర
  • మొత్తంగా  = 420 ఏళ్ల చరిత్ర..
ఇదీ గణాంకాల్లో పూరీ జగన్నాథ రథయాత్రా వైభవం. జగన్నాథుడంటే విశ్వానికి అధిపతి అని అర్ధం. అలాంటి జగన్నాథుడు కొలువైన పురుమే పూరీ. అంతటి జగన్నాథమూర్తికి చేసే రథయాత్ర ఎలా వుండాలి? అదే కనిపిస్తుందీ యాత్రలో. ఈ వేడుకలు తొమ్మిరోజుల పాటూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. కుల- మత- వర్గ బేధాలను మరచి దేశవిదేశీ భక్తులు పోటెత్తుతారు. బలభద్ర, సుభద్రా సమేత జగన్నాథుడ్ని తనివితీరా దర్శిస్తారు. 

ఎప్పటికప్పుడు కొత్తగా చేసే రథాలతో ఆ ఉత్సవ తీరు అద్భుతం. మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలు రెండూ ఒకటిగా వుండే ఏకైక ఆలయం. అంతే కాదు  మహావిష్ణు అవతారాల్లో ఒకటైన కృష్ణుడు  ఇక్కడ తన దేవేరులతో కాక, సోదరుడు బలరాముడు.. సోదరి సుభద్రలతో దర్శనమిచ్చే అరుదైన పుణ్యధామం.. పూరీ జగన్నాథ్  దేవాలయం. 

వైష్ణవాలయాల్లో పూరీ జగన్నాథ్ కి విశిష్ట స్తానముంది. ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్ ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది.
పూరీ రథోత్సవం
జగన్నాథ్ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుంచి మధుర వరకూ చేసే యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి.. రథంలో పత్రిష్ఠించి యాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయ్యే యాత్ర.. కిలో మీటరు దూరంలోని 'గుండీచ' మందిరం వరకు సాగుతుంది.  రథయాత్ర ప్రారంభంమయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని.. రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైనా.. దేవుడి ముందు సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఈ ఆచారం పాటిస్తుడటం విశేషం. 

రథోత్సవాలు ఎన్నో జరుగుతాయి. కానీ పూరీ రథోత్సవానికి మాత్రమే విశేషమైన ప్రాధాన్యత వుంది. ఇక్కడి జగన్నాథుడు రథమెక్కి వూరేగడానికే ఉన్నాడనిపిస్తుంది. ఇంతకీ రథోత్సవ సంబరం దేన్ని సూచిస్తుంది? జగన్నాథడి తత్వం ఇందులో దాగి వుందా? రథాల తయారీ నుంచి విగ్రహాల మార్పు వరకూ జగన్నాథుని ఇతర విశేషాలేమిటి? 

రథోత్సవం అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడే భక్తుడెక్కడ వున్నాడో వెతుక్కుని మరీ రావడం. కృష్ణుడసలే భక్తజనసమ్మోనుడు. అందుకే ఆయనకు జనార్ధనుడన్న పేరు. నరులతో అత్యంత సన్నిహిత సంబంధాలుంటాయి కనుకనే, నరనారాయణ స్వరూపుడిగా  పూజలందుకుంటాడు. ఆయనకు భక్తజనులతో కలసి మెలసి వుండటం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన బాల్యం, యవ్వనం, జనసమూహంతో కలసి కనిపిస్తుంది. కృష్ణుడికి చిన్నప్పుడు ఎందరో మిత్రులు. పెద్దయ్యాక పదహారు వేల మంది గోపికలతో సహవాసం. అష్టభార్యలతో సంసారం. ఇలా కృష్ణుడు ఏది తీసుకున్నా అసంఖ్యాక భక్తజనంతో సరస-సంభాషణలు సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. భాగవతం చదివితే కృష్ణుడెంతటి ప్రజాదైవమో అర్ధమవుతుంది. కనుక జనమంటే కృష్ణుడు కృష్ణుడంటే జనంగా భావించడం వుంది. అందుకే జగన్నాథుడి రథోత్సవానికి  భక్తజనులు అంతగా పోటెత్తుతారు.

జగన్నాథ రథయాత్ర విశేషాల సమాహారం. అందులో ప్రతిదానికీ ఓ వైశిష్ట్యం వుంది. రథయాతల్రో జగన్నాథుని రథాన్ని 'నందిఘోష్‌' గా  వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి  పదహారు చక్రాలుంటాయి. బలభద్రుడి రథాన్ని 'తాళ్‌ధ్వజ్‌'  పేరుతో పిలుస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీన్ని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. తాళ ధ్వజ్ కు 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని 'దర్ప దళన' అంటారు. ఈ రథానికి 12 చక్రాలుంటాయి.  జగన్నాథుడు ఎన్ని ఆటంకాలనైనా దాటుకుని తన భక్తజనాన్ని కలుసుకోడానికి పెద్ద పెద్ద చక్రాలను రథానికి పూన్చుకుని అంగరంగ వైభవంగా వస్తాడు.  అందుకే వాటికి 'జగన్నాథ రథచక్రాల్' అన్న పేరొచ్చింది. 

గర్భాలయంలో రత్న సింహాసనంపై కొలువై ఉంటాడు జగన్నాథుడు. జగన్నాథుడు, ఆయన సోదరుడు బల భద్రుడు, సోదరి దేవి సుభద్ర దేవతా మూర్తులను ఆలయ సింహద్వారం గుండా బయటకు తీసుకువచ్చి అలంకరించిన రథాలలో ఉంచి ఊరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వం మాటల్లో చెప్పడం కష్టం. విశేష పూజలు నిర్వహిస్తారు.  ప్రత్యేక రీతిలో మూడు రథాలు  ముందుకు కదులుతూ అదో సంబరంగా ఉంటుంది. రథం కదిలే సమయంలో శంఖారావం, గంటానాదం చేస్తారు. ప్రాచీన ఐరోపా నావికులు ఈ రథచక్రాల కింద ప్రమాదవశాత్తు పడటమో, మొక్కు కోసం ఆత్మబలిదానాల ఇవ్వడమో జరిగేదని కథలు కథలుగా చెబుతారు.

జగన్నాథ విగ్రహాలు, రథాల నిర్మాణానికి  ఒక విధానముంది. జగన్నాథ ఆలయంలో జరిగే విశేష పూజలు కూడా నియమనిష్టలతో కూడి వుంటాయి.  ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిదేళ్లకొకసారి ఏ ఏడాదిలో ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో.. అప్పుడు 'నబకలేవర' ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను  మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే 'చందన యాత్ర'  రథాల నిర్మాణం మొదలు పెట్టడాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం 'స్నానయాత్ర' పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున జగన్నాథ తదితర ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో 'డోలయాత్ర' వర్షాకాలంలో 'ఝులన్‌' యాత్ర పండుగలు చేస్తారు. 
పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు. ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి వాటిస్థానే కొత్తవి చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కానీ, తీసి వేయటం జరుగదు.
సుదర్శన చక్రం
ఇంతకీ పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి? స్థలపురాణం ఏం చెబుతోంది. జగన్నాథ ఆలయంపై నున్న సుదర్శన చక్రానికీ, ఎగిరే జెండాకూ అర్ధం ఏమిటి? జగన్నాథ ఆలయానికీ బౌద్ధానికీ వున్న సంబంధమేమిటి?  తెలుసుకుందాం.

వాస్తవానికి మహావిష్ణువును జగన్నాథుడితో పాటు పద్మనాభుడని కూడా పిలుస్తారు. విష్ణువు నాభిలోంచి బ్రహ్మ పుట్టాడని చెబుతుంది విష్ణు పురాణం. అందుకే జగన్నాథుడి విగ్రహాలను మార్చినా, నాభి మాత్రం అలాగే వుంచుతారు. జగన్నాథుడి నాభిలో బుద్ధుడి దంతం పొందుపరచబడి వుండేదన్న మరో కథనం కూడా ప్రచారంలో వుంది. అందుకే ఇక్కడి మూర్తి నాభికి అంతటి విలువని చెబుతారు. బుద్ధడి దంతానికీ ఇక్కడి ఆలయంలోని స్థూపానికీ సంబంధముందని కూడా చెబుతారు. బుద్ధుడి దంతం కూడుకున్న స్థూపం.. తర్వాతి కాలంలో శ్రీలంకలోని కాండీకి తరలించబడిందని అంటారు.  

జగన్నాథుడ్ని హిందువులందరూ దర్శించవచ్చు. కానీ అన్యమతస్తులకు అనుమతి లేదు. ఇలాంటి వారు దగ్గర్లోని రఘునందన లైబ్రరీ భవనంపై నుంచి ఆలయం మొత్తాన్ని చూడవచ్చు. ఇక్కడ బడే కృష్ణ, రోహిణీ, మార్కండేయ, మహారథి, నరేంద్ర అనే పంచతీర్ధాలున్నాయి. బడే కృష్ణ, రోహిణీ తీర్ధాలు వీటిలో ప్రముఖమైనవి. నరేంద్ర తీర్ధం స్వచ్ఛమైన జలాలతో నిండి వుంటుందట. అందువల్ల దీనిలో స్నానం చేస్తే మంచిదని చెబుతారు.


 పూరీ జగన్నాథ ఆలయ గోపురపు అంచు మీద.. సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. ఇది నారాయణ రూపంలో నాలుగోది. దీనిపై ఒక పసుపు జెండా ఎగురుతూ కనిపిస్తుంది. దీనిలోని ఎరుపు గుర్తు జగాన్నాథుడు ఆలయంలోనే వున్నాడని సూచిస్తుందని భావిస్తారు. 
ఈ మధ్య కనుగొన్న గంగా రాజవంశానికి చెందిన రాగి ఫలకాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయం ఎప్పటిదో తెలిసింది.  ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన 'అనంతవర్మన చోడ గంగాదేవ' ప్రారంభించాడట. ఈ ఆలయంలోని జగన్మోహన, విమన భాగాలు ఈ రాజు హయాంలో.. అంటే 1078 - 1148 CE మధ్య కాలంలో నిర్మించబడ్డాయి. అయితే 1174 CE లో ఒరిస్సా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునర్నిమించాడని తెలుస్తోంది.  ప్రస్తుతమున్న ఆలయ రూపు అప్పటిదే అంటున్నారు.

ఈ ఆలయ మూలాలకు సంభందించిన సంప్రదాయ గాథల గురించి  చెప్పాల్సి వస్తే కృతయుగానికి వెళ్లాల్సి వుంటుంది. ఇక్కడ ప్రచారంలో వున్న కథనం ప్రకారం, కృతయుగంలో  జగన్నాథుడు  పూరీ సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల ఆభరణంగా అవతరించాడట. అది ఎంత ప్రకాశావంతమైందంటే, దాన్ని చూసిన వారికి తక్షణ మోక్షం లభిస్తుందన్న నమ్మకం వుండేది. ఈ నీలాభరణాన్ని యముడు   భూమిలో దాచిపెట్టాలనుకున్నాడట. అందులో విజయం సాధించాడు కూడా. ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు.. అంతుపట్టని ఆభరణ రూపం గురించి తెలుసుకోవాలన్నాడట. అందుకోసం ఘోర   తపస్సు చేసాడట. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, జగన్నాథ పురి సముద్ర తీరానికి వెళ్లి.. అక్కడ తేలుతున్న చెట్టు దుంగను కనుక్కొని.. దాని కాండం నుంచి తనకు కావలసిన రూపు తయారు చేయమని ఆజ్ఞాపించాడట.

విష్ణు మూర్తి ఆజ్ఞ ప్రకారం.. రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడట. తర్వాత అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు.  యజ్ఞ ఫలంగా యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై.. నారాయణుడ్ని నాలుగు రూపాల్లో నిర్మించమని చెప్పాడట. అలా చెట్టు దుంగ నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన రూపాలను తయారు చేశాడు.  ఆ రూపాలే వాసుదేవ, సంకర్షణ, యోగమయీ, సుదర్శన రూపాలు. ఇలా కృష్ణమూర్తి తన సోదరులు, సుదర్శన చక్రంతో దర్శనమిస్తూ.. భక్తజన నీరాజనాలు అందుకుంటున్నాడు. 

హైందవాలయాల్లో మూలవిరాట్టును రాతి రూపంలో, ఉత్సవ విగ్రహాలను పంచ లోహ విగ్రహాల్లో చేస్తారు. కానీ పూరీలో విగ్రహాలను కొయ్యతో చేస్తారు. ఎందుకిలా? దీనికి కారణంగా పౌరాణిక గాథలను చెప్పుకున్నా.. ఇందులో మరేదైనా సాంస్కృతిక మర్మం దాగి వుందా? ఇక్కడి విగ్రహం ధర్మం, ప్రధాన ద్వారం, ప్రసాదం వరకూ ప్రతిదీ ఓ చారత్రాత్మక- సాంస్కృతిక- ఆధ్యాత్మిక వైభోగమే. అదేమిటో చూద్దాం.

జగన్నాథ్ ఆలయమున్న స్థలాన్ని శ్రీక్షేత్రగా పిలుస్తారు. ఇది మన   భారతీయ సంస్కృతులకు అద్దం పడుతుందని అంటారు.  ఈ స్థలాన్ని భారతీయ చరిత్రలోకెల్లా భిన్నమైందిగా భావిస్తారు. పౌరాణికాంశాలను పక్కన పెట్టి చరిత్ర ప్రస్తావిస్తే.. శబరాలనే ఆదివాసీలు జగన్నాథుడ్ని చెక్కరూపంలో చెక్కి నారాయణ రూపంగా పూజించేవారు. ఈ చెక్క విగ్రహాలు, ప్రాచీన కాలం నుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడిన అంశాలని అంటారు. అంతేకాదు ఒడిశ్శాకు చెందిన ఆదివాసీ వంశస్థులుగా చెప్పుకొనే ధైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజా కార్యకలాపాల్లో పాల్గొంటారు. దీన్ని బట్టి..  శ్రీక్షేత్ర చరిత్ర హైందవ- ఆదివాసీ సంస్కృతులకు చెందిందని చెప్పవచ్చు. 

ఇలా జగన్నాథ సేవ భారతీయ సంస్కృతిలో భాగమయ్యింది. అంతే కాదు జైన సంప్రదాయానికీ జగన్నాథ ఆరాధనకూ సంబంధముంది. ఈ మూడు విగ్రహాలు.. త్రిరథ జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరిత్రకు ప్రతీకగా భావిస్తారు.  మోక్షం లేక అనంతమైన ఆనందానికి మార్గమని దీనర్ధం. 

జగన్నాథుడు  ఇక్కడ వైష్ణవ రూపుగా కొలవబడుతున్నాడు. అదే సమయంలో ఈ ఆలయంలోని మరికొన్ని విగ్రహాలను శివ రూపమైన భైరవ, శివ పత్ని  విమలగా కొలుస్తుంటారు.  పూరి జగన్నాథ్ శ్రీక్షేత్ర  సంస్కృతీ సంప్రదాయాలు.. హైందవంలోని శివ-శక్తి- వైష్ణవ తత్వాలకు ప్రతీకలుగా నిలిచాయి. అలాగే జైన, బౌద్ధమతాల్లోని అంశాల మేలుకలయికతో ఏర్పడినట్టు కూడా చెబుతారు.   

పూరీ ఎంతటి ప్రసిద్ధ క్షేత్రమంటే, ఇప్పటి వరకూ ప్రతి హైందవ మతాచార్యుడూ ఈ క్షేత్ర దర్శనం చేశారు. ఒక్క మాధవాచార్యులు తప్ప.. ఈ క్షేత్రాన్ని ప్రముఖ ఆచార్యులందరూ దర్శించారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు. అలాగే రామానుజాచార్య, నింబర్కాచార్యలతో పాటు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరీని సందర్శించినప్పుడు.. ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు. గురునానక్, కబీర్, తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించిన ఆధారాలున్నాయి. 

పూరీ ఆలయం విశాలమైంది. నాలుగు లక్షల చదరపు అడుగుల  కన్నా ఎక్కువ వైశాల్యంలో నిర్మించబడి వుంది. ఇందులో సుమారు 120 ఉపాలయాలు, ఇతర పూజా స్థలాలున్నాయి. ఒడిశ్శా నిర్మాణ శైలిలో.. అమోఘమైన శిల్ప సంపద దర్శనమిస్తుంది. అందుకే పూరీ జగన్నాథ ఆలయాన్ని భారత అద్భుత కట్టడాలలో ఒకటిగా చెబుతారు. ప్రధాన ఆలయంలో విష్ణువుకు చెందిన శ్రీచక్ర నిర్మించబడి వుంటుంది. ఇది ఎనిమిది ఆకుల చక్రం. దీన్ని "నీలచక్ర"గానూ పిలుస్తారు. అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైంది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన  రాతి దిమ్మపై ఉంది. ఇది విగ్రహాలున్న గర్భగుడి కన్నా ఎత్తులో వుంటుంది. 

మాములుగా ఆలయంలోకి వెళ్లే ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సింహద్వారంగా పిలుస్తుంటారు. పూరీ ఆలయం చూస్తే ఇలా ఎందుకు పిలుస్తారో అర్ధమవుతుంది. దీనికా పేరు రావటానికి కారణం.. ద్వారాలకు ఇరువైపులా వుండే రాతి సింహాలు. ఆలయంలోని మిగిలిన మూడు ద్వారాల పేరేమిటో తెలుసా.. హాథీద్వార, వ్యాఘ్రద్వారా, అశ్వద్వారా. అంటే ఏనుగు, పులి, గుర్రపు ద్వారాలన్నమాట. ప్రధానమైన సింహ ద్వారం.. తూర్పు ముఖంగా ఉండి 'బడా దందా' గా పిలిచే  పెద్ద రోడ్డు కు దారి చూపుతుంది . బైసీ పహచ అంటే, ఇరవై రెండు మెట్ల వరుస.. ఆలయంలోకి దారి చూపుస్తుంది. 

రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు. వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి  యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారం తలుపులపై ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుందని నమ్ముతారు. అంతే కాదు పూరీ ఆలయ ప్రసాదం కూడా అద్భుతమైన రుచి కలిగి వుంటుంది. నూనె చుక్క వాడకుండా మట్టికుండలను ఒకదానిపై ఒకటి పెట్టి, వేడి చేసి వుడక పెడతారిక్కడి ప్రసాదాన్ని. దీనికింతటి రుచి రావడానికి కారణం..  సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీ దేవి పర్యవేక్షణలో వంటావార్పు జరగడమే అని నమ్ముతారు.  

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి 
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat