శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు జరుగు వైదిక క్రతువులు ..

P Madhav Kumar


Part - 16

 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు జరుగు వైదిక క్రతువులు ..


      అంకురార్పణ


స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి.

అంకురార్పణ అంటే అర్ధం? ....


అంకురార్పణ అనే మాట ఎక్కువగా వైదిక కార్యక్రమాల్లో వాడుతుంటాం.ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించటానికి శ్రీకారం చుట్టే ప్రక్రియనే అంకురార్పణం అంటారు.


   విశిష్టత ..


 వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతోపాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ఏదైనా ఉత్సవానికి 9 రోజుల ముందుగానీ, ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందుగానీ అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.


 ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు, ఆలయంలో నైరుతిథిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే 'మత్సంగ్రహణం' అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే 'అంకురార్పణ' అయింది.


 మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయిఈ విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. 


అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. ఆలయానికి నైరుతి మూలలో అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.దీన్నే అకురార్పణ అంటారు .


 అంకురార్పణ ఘట్టానికి వైఖానసం, పాంచరాత్ర ఆగమాల్లో విశేష ప్రాధాన్యం ఉంది.వైఖానసంలో మంత్రభాగాన్ని ప్రధానంగా తీసుకుని విష్ణువును అర్చిస్తారని, పాంచరాత్రంలో మంత్రం, తంత్రం, క్రియ, ముద్రలు ప్రధానంగా ఉంటాయి....


సీతానాయక గోవిందా || 

శ్రితపరిపాలక గోవిందా

దరిద్రజనపోషక గోవిందా || ధర్మసంస్థాపక గోవిందా..


గోవిందాహరి గోవిందా ||

 గోకులనందన గోవిందా.



⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat