ఉండవల్లి గుహాలయాలు

P Madhav Kumar

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. 

.ఇక్కడి గుహాలయాలు క్రీ.శ 420 -620  ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలు గా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు.

 విష్ణు కుండినులు మొదట్లో బౌద్ధమతానుయాయులుగా అనంతరం హిందూమతాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెపుతోంది

 ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్థంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా  వివిథా కృతులలో మలచిన ఆనాటి  శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి జోహార్లు .ప్రతి యాత్రీక భక్తుడు వందనాలు సమర్పించాల్సిందే.

  శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల  ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతిఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోతున్నారు.  

                                     
మొదటి అంతస్తు :- క్రింద  భాగం  మొదటి అంతస్తులో  గుప్తుల,చాళుక్యుల  కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ద సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం  ప్రారంభమైంది.    వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి   మార్గము , విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది.               

రెండవఅంతస్తు :- రెండవ అంతస్తు లోనికి   మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా  చెపుతున్నారుగాని  ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న  వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతి గా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి.   
 

మూడవ అంతస్తు పూర్తిగా  విష్ణు బంధమైన గుహాలయము. సాథారణం గా బౌద్ధ ,జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు.

 కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాథికారిగా పనిచేసిన మాథవరెడ్డి చేత ఈ అనంత పద్మనాభుని గుహాలయము నిర్మింపజేసినట్లుగా చెప్పబడుతోంది.

రెండవ అంతస్థుకు వెళ్ళే మెట్లమార్గం ప్రక్కనే ఉన్న కొండపై శాసనం ఒకటి శిథిలమై కన్పిస్తోంది. ఇక్కడ నుండి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి  కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించేవారని జనశృతి.  

                                        
లంబోదరుని సహస్ర రూపాలను దర్శించిన సందర్శకునికైనా ఇక్కడి  వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది

. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను  శిల్పం లో దర్శింపజేయడం  ఎంతో దర్శనీయం.    
                     
ఉగ్రనరసింహుడు :- ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితో పాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి.     
  
స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు.
                                                              
మరొకస్థంభం మీద కన్పించే శిల్పం ఉగ్రనరసింహుడు.
 హిరణ్యకశిపుని సంహరిస్తున్న నరసింహునిలో మహోగ్ర రూపాన్ని చూస్తాం. కాని ఈ నారసింహుని వదనంలో ఒక మహోన్నతమైన ఆనందాన్ని ఎంత స్పష్ఠంగా ఆ శిల్పి చెక్కాడో మనం గమనించ వచ్చు.

 ఉగ్ర నరసింహుని ముఖంలో ఆనందాన్ని చూపించడానికి కారణం ఆ శిల్పి గొప్ప  దైవభక్తుడు, ఉపాసనాపరుడై ఉండాలి. హిరణ్యకశిపుని సంహరించడం వలన తన ప్రియభక్తునికి విమోచనం కలిగించాననే ఆనందం ఆ పరమాత్మకు కల్గిందనేది ఆ శిల్పి భావన. అందుకే ఆ ఉగ్రమూర్తి ముఖంలోని ఆనందాన్ని  అంత స్పష్టంగా  ప్రదర్శింపచేశాడో.                 
 ఆ ప్రక్కనే కన్పించే
వామనావతార ఘట్టము  ,          
                                         హనుమత్సందేశం
 మూడవ అంతస్తు చివరి మందిరంలో కొలువుతీరి ఉన్నాడు శ్రీ అనంతపద్మనాభుడు. చూడటానికి రెండు కళ్లు చాలవనేది మనలో మాట. 

నల్లని గ్రానైటు లో ఏకశిలా నిర్మితమై. పద్మపత్ర విశాలాక్షుడై, అనంతశయనుడై, పద్మనాభుడై, గగనచరులైన దేవతలందరూ ఆనందంనాట్యం చేస్తుంటే, జయ-విజయులు పాదాల చెంత  కర్తవ్య పాలనలో ఉండగా, మహర్షులు తపోమగ్నులై యుండగా, ఆకాశంలో గరుడుడు నాట్యం చేస్తుంటే, దర్శనమిస్తున్నాడు శ్రీ అనంతపద్మనాభస్వామి.

 ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించవలసిందే కాని వర్ణింపవలవికాదు. 

ప్రతిరోజు పూజారి గారు ఏడున్నరకు వచ్చి తొమ్మిదింటి దాక ఉంటారట.

శ్రీ పద్మనాభుని మందిరంలోని సమస్త దృశ్యాన్ని ఒకేసారి మనం చూడగలిగితే, స్వామితో పాటు పద్మోద్భవుడైన  బ్రహ్మ, ఆనందంలో సురేశుని కీర్తిస్తున్న దేవతలు, ధ్యానంలో ఉన్న ఋషులు, ఆయుథ పాణులైన అంగరక్షకులు, గగనంలో నర్తిస్తున్న గరుత్మంతుడు ఇదీ దృశ్యం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat