ఇది ప్రతి యేటా ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే ఉత్సవం.
తిరుమలలోని స్వామివారి పుష్కరణిలో ప్రతి ఏటా వైభవంగా ఐదు రోజుల పాటు జరుగుతుంది.
మొదటి రోజు
సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా పూజింపబడతాడు.
రెండవ రోజు
శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి పూజింపబడతారు
మూడు, నాలుగు మరియు ఐదవ రోజు
చివరి మూడు రోజుల పూజలు త్రయోదశితో మొదలయ్యి పౌర్ణమితో ముగుస్తాయి.
ఈ మూడు రోజుల్లో ఉత్సవ విగ్రమైన మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి పూజింపబడతారు. ఈ ఉత్సవ మూర్తుల్ని అద్భుతంగా అలంకరించి పుష్కరిణి పై ఉన్న ప్రత్యేక తెప్పలపై ఉంచి పూజిస్తారు
తిరుమలేశుని వసంతోత్సవాలు
కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలను చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు. చైత్ర పూర్ణిమ గురువారంతో కలసిరావడం మరీ పుణ్యప్రథమంటారు పెద్దలు. తిరుమల వసంతోత్సవాలు క్రీ.శ. 1360 నుంచీ సంతరించుకున్నట్లుగా దేవస్థానం వారు చెబుతున్నారు.
ఈ కార్యక్రమం కోసం శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న వసంత మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు.
మొదటి రెండురోజులు
మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేవేరులతో కూడి సుగంధ ద్రవ్యాలతో వసంతాలాడుతూ, ఉత్సాహంగా తిరుమంజనంలో పాల్గొనడాని కోసం, శ్రీదేవి-భూదేవి సమేతంగా మలయప్ప స్వామి (వేంకటేశ్వరస్వామి) సిద్ధమవుతారు. బంగారు శ్రీ పీఠంలో బయలుదేరి, ఆలయానికి ప్రదక్షిణంగా పురవీధుల్లో, ఛత్రచామర మర్యాదలతో, వేద-దివ్య ప్రబంధ పారాయణాలతో, బాజాభజంత్రీలతో ఊరేగుతూ వసంత మండపానికి బయలుదేరుతారు. మండపానికి వచ్చాక దేవేరులతో కూడిన స్వామిని స్నానం చేయించి, శుద్ధజలం, ఆవుపాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకిస్తారు; ధూప దీప నివేదన, కర్పూర హారతులు జరుగుతాయి. చివరగా చందనాన్ని ఆ ముగ్గురికి చక్కగా అలదుతారు; శ్రీ తిలకాన్ని తీర్చిదిద్దుతారు, తులసి మాలల్ని అలంకరిస్తారు. కుంభహారతి, నక్షత్ర హారతి సమర్పించిన తరువాత కలశంలోని మంత్రజలంతో, బంగారు పళ్లెంతో సహస్ర ధారాభిషేకం జరుగుతుంది. వారిని తుడిచి పట్టు వస్త్రాలు, సర్వాభరణాలతో, పుష్పహారాలతో అలంకరించి, సాయంత్రం బయలుదేరి, ఊరేగుతూ ఆలయానికి తిరిగి తీసుకువెళ్తారు. ఆ సహస్రధారాభిషేక తీర్థాన్ని, భక్తులు పవిత్రులు కావాలనే భావంతో వారిపై సంప్రోక్షిస్తారు. స్వామి కి అలదిన పసుపు, చందనాన్ని ప్రసాదంగా పంచుతారు.
మూడవ రోజు
మూడవనాడు దేవేరులతో కూడిన స్వామితో పాటు, సీతారామలక్ష్మణ హనుమంతులు, రుక్మిణీ-శ్రీకృష్ణులు కూడా వసంతోత్సవంలో పాల్గొంటారని ప్రతీతి. ముగ్గురినీ ప్రత్యేక బంగారు పీఠాల్లోనే ఊరేగిస్తూ తీసుకువచ్చి, ముగ్గురికీ విడివిడిగానే అభిషేక నైవేద్యాదులు సమర్పిస్తారు. 'త్రేతాయుగం నాటి రాముణ్నీ, ద్వాపర యుగం నాటి కృష్ణుణ్నీ నేనే' అనే భావాన్ని వేంకటేశ్వరస్వామి ప్రకటిస్తున్నాడని చెబుతారు. ఈ భావాన్నే వేంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి రెండు శ్లోకాలు 'కౌసల్య పుత్రుడైన రాముడి'గాను 'గోవిందుడు, గరుడ ధ్వజుడు'గానూ (కౌసల్యా సుప్రజా రామ...; ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ...) ధ్రువపరుస్తున్నాయి.
పార్వేట ఉత్సవం
ఉత్సవ విగ్రమైన మలయప్ప స్వామిని సంప్రదాయ క్షత్రియ వేటగాని వేషంవేసి, శంకం, చక్రం, గద, బాణం మరియు ఖడ్గం వంటి పంచాయుధాలతో పార్వేటి మండపానికి తీసుకెడతారు. ఈ మండపం ముఖ్య ఆలయం నుండి సుమారు 2 కి.మి దూరం ఉంది. అక్కడ దగ్గరలో పొదల్లో బంగారంతో చేసిన జింక మున్నగు జంతువులను ఉంచుతారు. అర్చకుడు బంగారంతో చేసిన బల్లెం తీసువచ్చి వేటను కొనసాగిస్తారు.
లక్ష్మీవల్లభ గోవిందా || లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా || కాంచనాంబరధర గోవిందా..
గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా..
జై శ్రీమన్నారాయణ🙏🏻
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️