తప్పులెన్నువారు....

P Madhav Kumar

 *మాంచి మాట* 


  🔹పరనింద మానవ స్వభావంలో సర్వసాధారణ లక్షణం. తప్పులుగా తమకు తోచేవి ఎదుటి వ్యక్తిలో కనపడినప్పుడు, ఆ మనిషిలో మరెన్ని మంచి గుణాలున్నా, ఆ తప్పులనే పట్టిచూపిస్తుంటారు కొంతమంది. తప్పులుగా వాటిని అతడు అంగీకరించక ప్రతిస్పందిస్తే, చులకనగా చూడటమే కాక, అపరాధిగా ముద్ర వేయడానికైనా వెనకాడరు.


 🔹మనిషి ఎప్పుడూ తప్పులే చేయడా? 

మరొకరి తప్పులపై తనకంత ఆసక్తి ఎందుకని? 


ఆత్మవిమర్శ చేసుకునేందుకు కొందరు అవకాశమివ్వరు.

 సర్వం విష్ణుమయమన్నప్పుడు భగవంతుడి సృష్టిలో తప్పులెలా ఉంటాయన్న పరమ భావన మహాత్ముల్లోనే కనిపిస్తుంది.


  🔹గీతలో కర్మయోగం, తప్పొప్పులను విభజించి భగవంతుడు మనిషికిచ్చినదేమీ లేదని, అవి రెండూ అతడి కర్మాచరణల ఫలితాలని అంటుంది. 

ధర్మశాస్త్రాలన్నీ అతడిని, తన అహంభావనలతోనే అవి నిర్ణయించి నిర్దేశించే న్యాయాధికారివి కావద్దంటాయి. 


 🔹అదే వాస్తవాన్ని, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని, వేమన శతకంలోని ఒక చిన్న పద్యపాదం అతడికి చిరకాలం జ్ఞాపకం ఉండేలా చెబుతుంది.


 🔹ఇటాలియన్‌ మేధావి లియొనార్డో ఒకరిలో తప్పులుగా కనిపించేవి, భూతద్దాల్లో పెద్దవిగా చేసి చూపించి ప్రపంచాన్ని ఉద్ధరించాలని మనుషులనుకుంటే అది చవకబారు ప్రయత్నమంటాడు. దాన్ని మానుకొమ్మంటాడు. 


 🔹తప్పు మీద తప్పు చేసుకుపోతున్న శిశుపాలుడు అతడు నూరు తప్పులు చేసేదాకా కృష్ణపరమాత్ముడు ఉపేక్షించి ఊరుకున్నాడు.


🔹 ఆ తరవాతనే అతడిని సంహరించాడు. తప్పు చేసే వ్యక్తికి తగినన్ని అవకాశాలిచ్చికానీ భగవంతుడు శిక్షించడని చెప్పే పురాణ గాథల అంతరార్థం అదేనని మనుషులు గ్రహించరు.


 🔹తప్పు చేసినప్పుడు చేసిన వాడికది తప్పని చెప్పి సరిదిద్దుకొమ్మని ఒప్పించగల కుశలత కలిగినవాడు గొప్పవాడు. 


🔹గౌతమ బుద్ధుడు అటువంటి మార్గదర్శకుడు. కరడుగట్టిన బందిపోటు అంగుళీమాలుడి దోషభూయిష్ఠమైన ప్రవర్తనలో గుణాత్మకమైన పరివర్తనకు కారణమై ఆయన అతడిని తనకు ప్రధాన శిష్యుడయ్యే స్థాయికి చేర్చాడు.


🔹తప్పులు చేసేవారికి తమ తప్పులు తెలుసుకునేందుకు భగవంతుడే సమయం ఇస్తున్నప్పుడు, సాటి మనిషి తప్పులపై అంత తొందరగా స్పందించవలసిన అగత్యం తమకేమిటని మనుషులు ఆలోచించరు. నిందారోపణలు చేస్తూ జీవించే మనిషి నిజ జీవితంలో ఎన్నటికీ విజేత కాలేడు.


 🔹భగవంతుడు మనుషులందరినీ దోష రహితులుగా, సమగ్రత తొణికిసలాడే పరిపూర్ణులుగా సృష్టించలేదు. తప్పులు చేయవద్దని, అవి జరగకుండా చూసుకొమ్మని మనిషి మరో మనిషికి చెప్పడం ధర్మవిరుద్ధం కాదు. 


🔹చేసిన తప్పు తెలియజెబుతున్నప్పుడు, తప్పు చేసిన వ్యక్తికి అది తనపై ప్రేమాభిమానాలతో, సదుద్దేశంతో జరిగిన ప్రయత్నంగా అనిపించాలి.


🔹యుక్తాయుక్తాలు నిర్ణయించే అధికారి తానన్న భావన అతడికి కలిగిస్తూ, తప్పులు సరిదిద్దాలనుకుంటే- ఈ ప్రపంచంలో అతడు ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముంటుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat