దక్షిణ కూడా ఒక విధమైన దానమే. దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక నిబద్ధత అనేది ఏమి ఉండదు. అనగా ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడుతుంది. అది ఒక బాధ్యత.
ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన.
ఇది ఎవరికైనా ఇవ్వతగినదే కానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో, రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన.
ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే. దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు.
ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను.
సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , ' విత్త శాఠ్యము ' లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను.
బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది. కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను.
దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి.
ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఆ పురోహితులకు ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును.
అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను.
ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను.
రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను.
సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.