శ్రీకృష్ణుడు బాల కృష్ణుని రూపంలో వెలసిన క్షేత్రమే ఉడిపి. కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా. ప్రసిద్ధ కృష్ణమందిరం ఇక్కడ ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని శివళ్లి అని పిలిచేవారు. ద్వైతమత స్థాపకులు శ్రీమధ్వాచార్యులు అవతరించిన స్థలం భాగ్యతక్షేత్రం. దానికి సమీపంలో ఉడిపి ఉంది. శ్రీమధ్వాచార్యులు శిష్యులతో కలిసి శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ జరిపించారు. దీనికి సంబంధించిన గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
శ్రీమధ్వాచార్యులు తనకున్న దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను రక్షించినప్పుడు ఓడలోని నావికుడు వీరికి గోపిచందనం మూటను కానుకగా సమర్పించాడు. అందులో చందనంతో పాటూ చిన్ని కృష్ణుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని మధ్వాచార్యులు 800 సంవత్సరాల క్రితం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉడిపిలో భక్తులకు గర్భాలయ దర్శనం లేదు. తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తూర్పుముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండడం వెనుక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంత్యకులానికి చెందిన కనకదాసు కృష్ణదర్శనం కోసం ప్రాధేయపడగా పూజారులు నిరాకరించారు. కనకదాసు భక్తిని మెచ్చిన కృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు స్థలపురాణం. కనకదాసుకు కనిపించిన కిటికిలో నుంచే నేటికీ భక్తులు స్వామివారిని దర్శించుకొంటారు. దీనిని కనకుడి కిటికీ అంటారు. కనకదాసు ప్రార్థించిన చోట దివ్యమండప నిర్మాణం చేశారు. దీనికే కనకదాసు మండపమని పేరు. శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. వాటిలో శ్రీకృష్ణమఠం ఒకటి.
ఆలయానికి కుడివైపున శ్రీమధ్వతీర్థం ఉంది. తీర్థం మధ్యభాగంలో అందమైన మండపం ఉంది. అందులో శ్రీమధ్వాచార్యుల ప్రతిమ ఉంది. ఉత్సవాల సమయంలో ఇక్కడే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. తీర్థానికి ఒకవైపున భగీరథుని మందిరం, మరోవైపు చెన్నకేశవస్వామి మందిరం ఉన్నాయి. ప్రధాన ఆలయమంతా శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే అందమైన తైలవర్ణచిత్రాలతో నిండి ఉంటుంది. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలోనే తీర్థమండపం ఉంది. మండపంలోనే స్వామివారికి ఇష్టమైన అటుకులపొడిని ఉంచుతారు. పూజలు నిర్వహించే సమయంలో తీర్థమండపంలో జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో మండపం శోభాయమానంగా ఉంటుంది.
గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చేతుల్లో ధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది. గర్భాలయం బయట శ్రీమధ్వాచార్యుల విగ్రహం ఉంది. మరోపక్క శ్రీమధ్వాచార్య పీఠం ఉంది. ఆంజనేయస్వామి భవ్యమందిరంలో స్వామివారు వీరాంజనేయస్వామి అవతారంలో కన్పిస్తారు. ఇదే ప్రాంగణంలో సుబ్రమణ్యేశ్వరస్వామి కొలువుదీరాడు. నవగ్రహాలయం, గోశాల, గీతామందిరాలు ఉన్నాయి.
ఉడిపి వంటకాలు, హోటళ్లు విశేష ఆదరణ పొందాయి. శాకాహార వంటల్లో ఉడిపి శైలి వంటలు ప్రసిద్ధి చెందాయి. కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశమంతటా ఉడిపి హోటళ్లు ఉన్నాయి. దక్షిణ భారతీయ శాకాహార వంటలు ఉడిపి ప్రత్యేకత.
ప్రయాణ మార్గం
హైదరాబాద్ నుంచి ఉడిపి 767 కి.మీ. దూరంలో ఉంది. రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. విమానంలో వెళ్లాలనుకునేవారు మంగుళూరు వెళ్లి అక్కడి నుంచి ఉడిపి చేరుకోవచ్చు.
కృష్ణం వందే జగద్గురుమ్.