..............................................................
(౧) సాని లేదా సానే - సాని అనేమాట స్వామిని అనే సంస్కృతపదమునుండి వచ్చింది.
ఇప్పుడు సాని అంటే వేశ్య అనే అర్థముంది కాని నిజానికి సాని అంటే అదో హోదా. దేవాలయంలో ప్రతిరోజు రంగమండపములో దేవుడి ఎదుట నృత్యగీతాలను ఆలపించేవారు. సాని నాడు సమాజములో చాలా గౌరవమైన వర్గంగా వుండేది. వీరు సకలశాస్త్ర పారంగతులుగా వుండేవారు. ముఖ్యంగా సాహిత్యము, సంగీతము, నాట్యము, మాలధారణ, అలంకరణ వంటి అంశాలలో పరిణితి సంపాదించి వుండేవారు. పట్టపురాణి తరువాత వీరిదే గౌరవనీయ స్థానము,ఎందుకంటే వీరు అంతగా పవిత్రులన్నమాట. వివాహితులు కూడా సాని వృత్తిని అవలంభించిన దాఖలాలున్నాయి.వీరి జీవనాధారము కొరకు మడిమాన్యాలు ఇండ్లస్థలాలు వగైరాలు ఇచ్చిన దాఖలాలు కూడా వున్నాయి. ఉదా॥ గుంటూరు జిల్లా. వేల్చూరు శాసనము ప్రకారము మహమండవశ్వర కోట గణపతిదేవుడు అక్కమసానిని రామేశ్వరస్వామికి దానము చేసి ఆమెకు వృత్తిగా కొన్ని భూములను, ఇంటిస్థలాన్ని దానముచేశాడు. ఏలేశ్వరములోని 1271 ACE నాటి శాసనము ప్రకారము మంకిసెట్టి ఇద్దరిని ఏలేశ్వరదేవుడికి సానులుగా ఇచ్చాడు. అంటే వీరు దాత తరపున ఆయా దేవాలయాలలో నృత్యగీతాలు చేసేవారు. ఏలేశ్వరం నాగార్జునసాగర్ లో మునిగిపోయింది.
అల్లసాని, పెమ్మసాని, కొమ్మసాని, ఎరుకలసాని, రెడ్డిసాని మొదలెైన ఇంటిపేర్లు మనకు తెలుసు.సాని మాటకు వేశ్య అనే అర్థముంటే గొప్పవారు తమ ఇంటిపేరుగా సానిని ఎలా స్వీకరిస్తారు. సాని లాంటిదే నేని, ఉదా॥ అక్కినేని, కామినేని, త్రిపురనేని మొదలైనవి. నాయకుడు నుండి నాయుడు, నాయుడు నుండి నేని అనే పదవ్యుత్పత్తి జరిగింది.
(౨) పెరికలు, పెరికబలిజలు, పెరికకాపులు - పెరికలు అనేవారు నాడు రవాణా వ్యవస్థలో ముఖ్యభూమిక పోషించారు.ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు అనగా బియ్యం ఉప్పు పప్పు బెల్లాలు ఔషధాలు బట్టలు పత్తి ఇనుము వ్యవసాయపనిముట్లు మొదలైనవి, ఖరీదైన సుగంధద్రవ్యాలు బంగారు వెండి వజ్రాలు, దేశరక్షణకు అవసరమైన ఆయుధాలు వంటివి ఒక ప్రాంతము నుండి మరోప్రాంతానికి రవాణా చేసేవారు. ఉదా॥ మోటుపల్లి ఓడరేవు నుండి ఓరుగల్లు కొలనుపాక బళ్ళారి కళ్యాణ్ గోలుకొండ ధర్మపురి గుత్తి పెనుకొండ తిరుపతి చంద్రగిరి శ్రీరంగపట్టణము మైసూరు వంటి ప్రాంతాలకు బండ్లు గుఱ్ఱాలు ఎద్దులు గాడిదలు ఒంటెలు మొదలైన వాటిని ఉపయోగించి సరుకులను భద్రంగా నమ్మకంగా తీసుకుపోయేవారు. ఒక్కొసారి వర్తకబిడారులను (Caravans) అనుసరించి సరుకుల రవాణా చేసేవారు. వీరు సమయాలు అనే కులసంఘాలకు బాధ్యులుగా వుండేవారు. సమయాలకు అధిపతి సమయాధిపతి. సరుకులను సూదూరప్రాంతాలకే కాకుండా ఒక ఊరినుండి సంతకు, సంతనుండి మరో సంతకు రవాణా చేసేవారు. వీరు సరుకు రవాణా చేసినందుకు ప్రభుత్వానికి సుంకాలు చెల్లించేవారు. కాని దేవాలయాలకు సరుకు రవాణా చేస్తే కొన్ని సందర్భాలలో సుంకాలు మినహాయింపు పొందేవారు. సుంకాలు సరుకును బట్టి కాకుండా ఎద్దుకు ఇంత గుఱ్ఱానికి ఇంత అని సుంకాలు చెల్లించేవారు. కాకతీయ గణపతిదేవుని 1245 ACE కాలంనాటి త్రిపురాంతక దేవాలయశాసము దేవాలయానికి సరుకులు రవాణా చేసినందుకు 200 ఎద్దులకు సుంకాలను సర్వాధికారైన పోచన ప్రగ్గడ గణప సుంకాలను పరిహరించినాడు. 1680 ACE కాలమునాటి శాసనములో పెరికలెత్తు అన్న పదముంది. వీరు అప్పట్లో సరుకులు రవాణా చేసి పొట్టపోషించుకొనే వృత్తివారు గానే వుండేవారు. తరువాతి కాలములో ఒకకులముగా ఏర్పడటము జరిగింది.
(౩)“పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనన్
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ"
............ బద్దెన
వైశ్యులనే తెలుగువారు కోమట్లు అంటారు. పై బద్దెన పద్యాన్ని చూడగా వర్తకవాణిజ్యాలలోను సమాజానికి వీరు అందిస్తున్న ఆర్థికపరిపుష్టిని బట్టి చూస్తే నాడు వీరు దేశములో ప్రముఖపాత్ర వహించినట్లు తెలుస్తోంది. జైన తీర్థంకరుడైన గోమఠేశ్వరుని పేరున కోమటి అనే పదవ్యుత్పత్తి జరిగిందని కొందరి పండితుల అభిప్రాయమైనా తెలుగునేలలలో వీరు జైనులు కాదు, అందువలన గోమఠేశ్వరవాదము నమ్మదగినదిగా లేదు. కోమట్లు మధ్యయుగములోనే కాదు ప్రస్తుతము కూడా వర్తకవాణిజ్య అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి కారణమైతున్నారు.
(౪ ) నాటి సమాజములో
అష్టాదశ ప్రజలు దేశాభివృద్ధికి కారణమైవుండేవారు. అష్టాదశ ప్రజలు అంటే పదునెనిమిది కులములకు చెందిదిన జనులు. వారు (1) బ్రహ్మణ, (2) క్షత్రియ, (3) వైశ్య, (4) శూద్ర, (5) వ్యావహారిక, (6) గోరక్షక, (7) శిల్పక, (8) పంచాణము, (9) కుంభకార, (10) తంతువాయ (నేసేవారు) (11) పౌరక, (12) రజక, (13) వస్త్రచ్ఛేదక (దర్జీలు ), (14) చర్మకార, (15) తిలఘాతుక (గాండ్లవారు), (16) లబ్ధక, (17) చండాల, (18) మాతంగులు.
/సేకరణ/
.