నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గ్రామము.
చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచల కోన గా మారింది.దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి.వాటి నడుమనే దివ్యమైన దేవస్ధానం వెలసింది.
శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మీ మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడి పోయినట్లు చరిత్ర చెపుతుంది. దీంతో ఆమే ధైర్య సాహసాలు, అందచందాలకు ముగ్ధుడైన స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామి వారిని పెనుశిల లక్ష్మీనసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మీని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్ధానం నిర్మించారు.
తూర్పుకనుమల మధ్య పర్వత ప్రాంతాలల్లో నెల్లూరు-కడప జిల్లాల మద్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున వున్న కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగోందుతుంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది.భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కనే వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకథనం. పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గోర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవి లోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో కాపరికి కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కోద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈప్రాంత వాసులు చెబుతుంటారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్ధానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది.
ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండలంకి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుశిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని ప్రతీతి. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టరుకు, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు మరియు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి.
ఓం లక్ష్మినరసింహాస్వామియే నమః