ఆత్మ జ్ఞానం" "మోక్షమార్గం

P Madhav Kumar


                        

*"ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదయితే మార్పు అనేదే లేకుండా ఒకటి ఈ శరీరంలో ఉందో..."* 

*అదే ఆత్మ.* 

*ఆ ఆత్మే నువ్వు."*


*"ఏదో ఒకనాటికి తప్పక పోయే ఈ శరీరం నువ్వు కాదనే ఎరుక నీ అనుభవంలోకి వచ్చిన మరుక్షణం ఈ లోకాలనే భ్రమల్లోకి నువ్వు వచ్చిన పని పూర్తయినట్లే."*


*"ఈ సత్యాన్ని అందరి మనసుకూ అర్ధం అయ్యేలా తెలియజేసే ప్రయత్నమే ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం."*


*“ఆత్మజ్ఞానం” అంటే “ఈ శరీరమే నేను” అని నమ్మే మానవుని యొక్క మనస్సును శరీర భ్రమ నుంచి దృష్టిని మళ్ళించి తన స్వస్వరూపమయిన ఆత్మ అనే ఆనంద సాగరంలో ఏకం చెయ్యడమే."* 


*"మానవుని మనసులోకి చేరుతున్న లోక విషయాలే మానవుని దుఃఖానికి కారణం అవుతున్నాయి."* 


*"మానవుని మనసులోనుంచి విషయాలు అన్నీ తొలగిపొతే అప్పుడు మానవునికి శాశ్వతంగా దుఃఖం తొలగినట్లే."*


*మనస్సు అంటే విషయాలే.*

*విషయాలు లేని మనస్సు లేదు.* 

*అలానే దుఃఖం లేని విషయాలూ లేవు."* 


*"కాబట్టి విషయాలు లేక మనస్సు అనేవి తొలగించుకున్నట్టి స్థితిలో ఉన్న మానవునికే ఆ ఆత్మానందం లభిస్తుంది."*


*"అజ్ఞానాన్ని తొలగించుకుని ఒకసారి ఆ ఆత్మ స్థితిలోకి ప్రవేశించిన మానవుడు ఆ ఆనందాన్ని నిరంతరాయంగా పొందుతుంటాడు."*


*అక్కడ మరణం ఉండదు.*

*కాలం ఉండదు.*

*శరీరం ఉండదు.*


*"కేవలం అనంతమయిన ఆనందం మాత్రమే ఉంటుంది."* 


*"అందుకే మానవుడు మనస్సులో విషయాలు చింతించకుండా కోరికలు కలిగి ఉండకుండా నేను, నాది, నావి అనేదంతా వదలిపెట్టి మనస్సును నిర్విషయ స్థితిలో దీర్ఘ కాలం పాటు నిలిపి ఉంచితే ఒకానొక సమయానికి ఆ మనస్సు విషయ రహితం అయిపోయి ఆత్మ అనే ఆనందసాగరంలో ఏకమైపోతుంది."* 


*"అప్పుడు మానవునికి అనిర్వచనీయమయిన మాటలతో చెప్పలేని అమితమయిన ఆనందం లభిస్తుంది."*


*"శరీరం, మనస్సుతో అనుభవించే ఆనందాలను అయితే శరీరంలో భాగమయిన నాలుక వర్ణించగలదు."* 


*"ఆత్మానందం శరీరానికి గాని, మనస్సుకు గాని అందేది కాదు. అందుకే ఆ ఆనందాన్ని శరీరంలోని భాగమయిన నాలుక వర్ణించలేదు."* 


*"మానవుని స్థితే అక్కడ ఆనందమయం అయిపోతుంది."*


 *"ఈ లోకంలోకి మానవశరీరంతో వచ్చాక ఆ ఆత్మస్థితిని పొందాలని ప్రయత్నం చేసేవాడే మానవుడు అనిపించుకుంటాడు."* 


*"ఒకసారి ఆ స్థితిని పొందాక ఆ మానవుడే భగవంతుడు అయిపోతాడు."*


*"కాబట్టి మానవులు తమ మనస్సులో లోక విషయాలను భావన చెయ్యకుండా ఏ వస్తువుల మీద గాని, బంధువుల మీద గాని, ఆస్తుల మీద గాని, చివరికి తన శరీరం మీద గాని ఇవి నావి, నాకు చెందినవి, నాతో ఉండవలసినవి అనే అభిమానం కలిగి ఉండకుండా వాటి అన్నింటినీ ఒక గోడ, రాయి, కొయ్య లాంటి బయటి వస్తువులను చూసినట్లుగా చూస్తూ వాటి రాక వాటి పోకలను మనసులోకి ఎక్కించుకోకుండా నిరంతరం ఒక యజ్ఞం లాగా మనస్సును కట్టడి చెయ్యాలి."* 


*"దీనర్ధం కర్మలు చెయ్యడం మానేసి చతికిలపడి ఏ చెట్టు క్రిందో లేక మరో చోటో కూర్చొని మౌనంగా ఉండమని మాత్రం ఎవ్వరూ అనుకోకండి."*


*"ప్రతి మానవుడు తాను జన్మించిన కుటుంబ నేపద్యానికి తగినట్లుగా కర్మలు తప్పక చెయ్యాలి."*


*"అయితే ఆ కర్మల ఫలితాన్ని అతడు తన మనసులోకి రానివ్వకుండా తన కర్తవ్యంలో భాగంగానే ఆ కర్మలు చేస్తున్నట్లుగా అతడు భావించాలి."*


*"కర్మ ఫలాన్ని కాలానికి వదిలెయ్యాలి."*


*"అప్పుడు ఆ కర్మల ఫలితం అతడిలోకి ప్రవేశించదు."*


 *"ఎవరయితే కర్మల యొక్క ఫలాన్ని పొందగోరి కర్మలు చేస్తారో అట్టి వారియొక్క మనస్సుగాని ఇంద్రియాలుగాని వారి వశంలో ఉండవు."* 


*"ఇంకా కర్మ ఫలాన్ని నాది నాకు చెందినది అనుకునే వారి మనస్సులో కామం, క్రోదం, లోభం, మోహం, మధ మాత్సర్యాలు అనే లక్షణాలు అధికమవుతూ ఉంటాయి."* 


*"ఎవరిలో అయితే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అధికంగా ఉంటాయో వారికి ముక్తి ఎలా లభిస్తుంది?"*


*"కాబట్టి కర్మల యొక్క ఫలం మీద నాది అనే అభిమానం పెంచుకోకుండా కర్మలు చెయ్యాలి."*


*"ఈ సాధన వల్ల అతి త్వరలోనే ఆత్మ అని చెప్పబడే మానవుని స్వస్వరూపం మానవునికి అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మానవునికి అనంతమయిన ఆనందం కలుగుతుంది."*


*"ఆ ఆనందం మాటలతో వర్ణించగలిగేది కాదు."* 


*"ఒకవేళ శిష్యులకు బోధించడానికి మాటలతోనే ఆ ఆత్మానందం గురించి చెప్పుకోవాల్సి వస్తే.!"*


*"అప్పుడు ఆ ఆత్మానందాన్ని సప్త సముద్రాలలోని మొత్తం జలంతో గనక పోల్చుకుంటే ఈ రాజ్యాలను పరిపాలించే అధికారం సంపాదించిన ఒక చక్రవర్తి పొందే ఆనందం అందులోని ఒక నీటి చుక్కలాంటిదని ఆ ఆత్మానందాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానులు మనకు చెబుతున్నారు."* 


                 *"కాబట్టి సృష్టి అనే భ్రమలో ఉన్న ఒకే ఒక్క ఆ ఏకైక సత్యాన్ని అందరూ అర్ధం చేసుకుని ఒక దృడ సంకల్పంతో ఆ ఆత్మస్థితి కొరకు గట్టి ప్రయత్నం చేసి ఈ జన్మలోనే ఆ అనంతమయిన ఆనందసాగరంలోకి ప్రవేశించి ఈ జన్మ - మృత్యువుల నుంచి ముక్తి చెందాలని కోరుకుంటూ జ్ఞాన విచారణ లోకి ప్రవేశిద్దాం."*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat