సూర్యుడు కదలని జ్యోతిర్మండలం కదా!
సూర్యునికి ఏడు గుర్రాలేమిటి? రథమేమిటి? అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనిలోని ఆంతర్యం ఏమిటి ? మన ప్రాచీన శాస్త్రాల పట్ల గౌరవదృష్టి కలిగి, నిర్మలాంతఃకరణతో గమనించితే ఈ విశేషాలను తెలుసుకోగలం.
సూర్యుని 'సప్తాశ్వరథ మారూఢం' అనే నామంతో స్తోత్రించడం ఆనవాయితీ. ఏడు గుర్రాల రథంపై సూర్యభగవానుడు ఆరోహిస్తాడని వర్ణన.దీనిలోని వైనాలను గమనించుదాం:
రంహణశీలత్వాత్ రథః -" కదిలే లక్షణం కలది రథం. గమనం చేయడం (ప్రసరించడం) కాంతి లక్షణం. ఈ కాంతికి మూలమైనవాడు ప్రభాకరుడు. 'అశ్వం' అంటే 'కాంతికిరణం' అని అర్ధం. 'అశూ వ్యాప్తౌ...' శీఘ్రంగా వ్యాపించే లక్షణం కలది అశ్వం. ఇది కాంతి స్వభావమే . అందుకే సూర్యకిరణాలనే అశ్వాలన్నారు.
'ఏకో అశ్వో వహతి సప్తనామా...' ఒకే అశ్వమది. 'సప్త' అని వ్యవహరించబడుతోంది అంటూ వేద మంత్రం విశదపరచింది. దీనిని మనం గమనించినట్లయితే, మన శాస్త్రాల ఆధారంగా అనేక భావాలను స్వీకరించవచ్చు.
1. ఒకే సూర్యకాంతి... ఏ వర్ణ వికారమూ లేని శుద్ధ వర్ణంలో ఉంటుందని, అదే వివిధ పరిణామాల వల్ల సప్త వర్ణాలుగా విభజింపబడుతున్నది సర్వజన విదితమే. ఈ సప్తవర్ణాలే సప్తాశ్వాలు. ఇది వర్ణరూప కాంతి స్వరూపం.
2. సూర్యోదయాన్ననుసరించి దినగణన చేస్తాం. పగటికి కారకుడు దివాకరుడే. ఇలాంటి ఉదయాలతోనే వారాలు ఏర్పడతాయి. ఈ వారాలు ఏడు. కాలస్వరూపుడైన ఆదిత్యుడు ఏడురోజులనే అశ్వాలుగా చేసుకుని విహరించే దైవం.
3. పురాణ ప్రకారంగా సూర్యుని సప్తాశ్వాల పేర్లు: జయ, అజయ, విజయ, జితప్రాణ, జితశ్రమ, మనోజవ, జితక్రోధ... (ఆధారం: భవిష్యపురాణం). కాంతి ప్రసరణలోని వివిధ దశలు. శక్తి విశేషాలే ఈ పేర్లు.
4. వేద స్వరూపునిగా (ఋగ్యజుస్సామపారగః) భానుని భావిస్తుంది మన ధర్మం. హనుమంతుడు, యాజ్ఞవల్క్యుడు సూర్యోపాసన వల్లనే వేద విజ్ఞానవేత్తలయ్యారు. ఈ వేదంలోని ముఖ్య ఛందస్సులు ఏడు: గాయత్రి, త్రిష్టుప్, అనుష్టుప్, జగతీ, ఉష్ణిక్, పంక్తి, బృహతీ.
5. సూర్యునిలోని 'సుషుమ్నా' అనే కిరణశక్తి చంద్రగ్రహకారణం. అలాగే కుజగ్రహానికి సంపద్వసు (మరియొక పేరు ఉదన్వసు) నామకిరణం కారణం. 'విశ్వకర్మ' బుధగ్రహానికి, 'ఉదావసు' బృహస్పతికీ, 'విశ్వవ్యచస్సు' శుక్రగ్రహానికి, 'సురాట్' శనికీ, 'హరికేశ' సర్వనక్షత్ర వ్యాపక జ్యోతిస్సుకీ హేతువులు. ఈ ఏడు అశ్వాల (కిరణశక్తులు) ద్వారా విశ్వరథచక్రం నడిపిస్తున్న నారాయణుడే గ్రహస్వరూపుడు.
6. మన శరీరంలో చర్మం, అస్థి, మాంసం, మజ్జ, రక్తం, మేదస్సు, శుక్రం... అనే సప్త ధాతువులున్నాయి. వీటితో సంచరించే రథం ఈ దేహం. వీటిని నిర్వహించే అంతర్యామి రూప చైతన్యమే ఆదిత్యుడైన పరమాత్మ.
7. మన ముఖంలోని నేత్రాలు (రెండు) నాసికలు (రెండు), చెవులు (రెండు), ముఖం (ఒకటి)... ఈ ఏడు జ్ఞానేంద్రియాలను నడిపే బుద్ధి స్వరూప చైతన్యమితడే.
8. మూలాధారం నుండి సహస్రార చక్రంవైపు సాగే కుండలినీ స్వరూపుడే అర్కుడు. ఈ మార్గంలో ఏడు చక్రస్థానాలే ఏడు గుఱ్ఱాలు.
ఈ ఏడు అశ్వాలతో సాగే సూర్యకాంతి విస్తరణనే సప్తాశ్వరథ చలనంగా పేర్కొన్నాయి వేదశాస్త్రాలు. ప్రతి భగవద్రూపమూ ఒక తత్త్వప్రతీక. వేదాలలోని సౌరశక్తికి సాకారమే సప్తాశ్వరథారూఢుని హిరణ్మయ స్వరూపం.
మన శాస్త్రాలలో చెప్పిన అంశాల్ని అర్థం చేసుకోవడానికి భౌతిక దృష్టి సరిపోదు. ఉపాసన దృష్టి, తాత్విక దృష్టితో చూసినప్పుడే అవి అర్థం అవుతాయి.
[సేకరణ - శ్రీ సామవేదం గారు రచించిన _ఏష ధర్మః సనాతనః_ పుస్ నుండి]
సేకరణ:-
💐#శుభమస్తు💐
🙏🕉🙏