అవధూత అంటే ఎవరు ? సన్యాసి అంటే ఎవరు ?

P Madhav Kumar



ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు :

అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.

అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము.

సన్యాసం నాలుగు రకాలు .


*౧. వైరాగ్య సన్యాసం :

వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.


*౨. జ్ఞాన సన్యాసం :

సత్ సాంగత్యం ద్వారా, లౌకిక వాంచలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ,

ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .


*౩. జ్ఞాన వైరాగ్య సన్యాసం : సాధన ద్వారా , ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని

నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు.*


*౪. కర్మ సన్యాసం : బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ , ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం .


ఈ సన్యాసులు ఆరు రకాలు :


*౧. కుటిచకుడు :

శిఖ, యజ్ఞోపవీతము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.


*౨. బహుదకుడు :

ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు.


*౩. హంస :

ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.*


*౪. పరమహంస :

వెదురు దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కౌపీనం మాత్రం ధరించి నిరంతర సాధన లో ఉంటారు .


*౫. తురియాతీతుడు :

దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .


*౬. అవధూత :

ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్ మిధ్య నేను సత్యం అంటూ, నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు. నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము,

అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.


కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు.( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం )


అవధూత’ అంటే ఎవరు?

బట్టలు విప్పుకు తిరిగే పిచ్చివాడా? భగవదన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరా?

కాదు! కానే కాదు!

ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచానీయమో ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలకు అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరినవారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.


అట్టి అవధూత స్థితిని తెలియజెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంతవాజ్గ్మయంలో ఇది అతి ప్రశస్తమయినది. ఇది అష్టాధ్యాయాల్లో 289 గీతలతో విరాజిల్లుతున్నది. తీవ్ర వైరాగ్యవంతులై, మొక్షాపేక్షగలవారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. 


ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరు, ఎవరికి బోధించారు?


త్రిమూర్తుల అంశగా ఆవిర్భవించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యస్వామికి దీనిని బోధించారు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ.


ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు? ఏమా కథ?


కలహప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాత ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వండలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.


ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.

అనసూయ పాతివ్రత్యమహిమ తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డుచెప్పక అనసూయను పరీక్షించడానికి సన్యాసుల వేషంలో అత్రిమహాముని ఆశ్రమానికి వస్తారు. అనసూయాదేవిని ‘నిర్వాణభిక్ష’ కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు! అనసూయ, అప్పటి కప్పుడు తన చనుదోయి చేపుకి రాగా, పాలను ఆపిల్లలకు కుడుపుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అనసూయ త్రిమూర్తులవంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ కావాలన్నది గనుక, అత్రిమహాముని ఆ ముగ్గురు పసిపాపలను కౌగలించుకోగానే, వారు ముగ్గురూ అదృశ్యమై మూడు శిరస్సులు, ఆరు చేతులుగల ఒకే పిల్లవాడిగా మారిపోతారు. అత్రిమహాముని ఆ పిల్లవానికి ‘దత్తాత్రేయుడు’ అని నామకరణం చేస్తాడు.


త్రిమూర్తులు అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రిమహామునీశ్వరుని పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. 


మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తాత్రేయుడే నిత్యవైరాగ్యంతో అవధూతలా అడవిలో సంచరిస్తున్నపుడు ఎదురుపడ్డ సుబ్రహ్మణ్యస్వామికి ఆయన అభ్యర్థనమేరకు అవధూత గీతను బోధిస్తాడు. 


ఇంతకీ అవధూత లక్షణాలేమిటి?


ఆశాపాశాల నుంచి విడువబడినవాడు, ఆదిమధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానందస్వరూపుడు అయిన అట్టివానికి ‘అ’ కారం అతని లక్షణం.


ఎవని చేత వాసనలు విడువబడినవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలలో ఉనికి కలిగివున్నాడో అట్టివానికి ‘వ’ కారం లక్షణమైఉన్నవాడు

ఎవని శరీరం ధూళిధూసరితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవడు ధ్యాన ధారణల విముక్తుడై ఉన్నాడో వానికి ‘ధూ’కారం లక్షణమై ఉన్నది.


తత్త్వచింత కలిగియున్నవాడు, చింతాచేష్టాలు వీడినవాడు, అహంకార మాంద్యములను విడిచినవాడు ఎవడో వానికి ‘త’కారం లక్షణం.✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat