భూ వరాహ క్షేత్రం "శ్రీమూష్ణం", తమిళనాడు - Bhu Varaaha Kshetram "Sree Mushtam" - TamilNadu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

భూ వరాహ క్షేత్రం "శ్రీమూష్ణం", తమిళనాడు - Bhu Varaaha Kshetram "Sree Mushtam" - TamilNadu

P Madhav Kumar

 భూ వరాహ క్షేత్రం "శ్రీమూష్ణం", తమిళనాడు - Bhu Varaaha Kshetram "Sree Mushtam" - TamilNadu

శ్రీ మహావిష్ణువు భారత దేశంలో 8 ప్రదేశాలలో స్వయం వ్యక్తంగా ఆవిర్భవించాడు.  

ఆ క్షేత్రాలు: 
  • 1. శ్రీరంగం, 
  • 2. శ్రీ మూష్ణం, 
  • 3. తిరుపతి, 
  • 4. వానమామలై, 
  • 5. సాలగ్రామం, 
  • 6. పుష్కరం, 
  • 7. నైమిశారణ్యం మరియు, 
  • 9. బదరికాశ్రమం.  
వాటిలో ఒక క్షేత్రం శ్రీమూష్ణం తమిళనాడులోని కడలూరు జిల్లాలో, వృధ్ధాచలానికి 19 కి.మీ. ల దూరంలోనూ, చిదంబరంనుంచి 39 కి.మీ. ల దూరంలోనూ వున్నది.

శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవది వరాహావతారం.  ఇక్కడ స్వామి భూమిని రక్షించిన తర్వాత వరాహమూర్తిగా వెలిశాడు.  అందుకే ఇది వరాహ క్షేత్రం.  ఈ క్షేత్రంలో శ్రీమహావిష్ణువు మూడు రూపాలలో వున్నాడని భక్తుల నమ్మకం.  అవి అశ్వధ్ద వృక్షం, నిత్య పుష్కరిణి, భూవరాహం.  నిత్య పుష్కరిణిలో స్నానం చేస్తే రోగాలు పోతాయి.  అశ్వధ్ధ వృక్షాన్ని పూజిస్తే పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారు.  ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడి అశ్వధ్ధ వృక్షంకింద గాయత్రి మంత్రాన్ని జపిస్తే స్వర్గం లభిస్తుందంటారు.
సమున్నతమైన గోపురం
సమున్నతమైన గోపురం
ఆలయ నిర్మాణం:
సమున్నతమైన గోపురంతో, విశాలమైన ఆవరణలో, మండపాలతో అలరారే ఈ అత్యంత పురాతనమైన ఆలయం ప్రకృతి ఆటుపోట్లని ఎన్నింటినో తట్టుకుంది.  ఇక్కడవున్న శాసనాల ఆధారంగా ఈ ఆలయం 16వ శతాబ్దంనుంచి ప్రాముఖ్యత సంతరించుకుంది.  విజయనగరాన్ని పాలించిన రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించటమేగాక వివిధ మండపాలను నిర్మించారు.  నిత్య పూజలకి ఏర్పాటు చేసి, స్వామి ఊరేగింపుకి వాహనాలు ఏర్పాటు చేశారు.
శ్రీమూష్ణం క్షేత్రం లోపలి ఆవరణం
శ్రీమూష్ణం క్షేత్రం లోపలి ఆవరణం 
స్ధల పురాణం:
హిరణ్యకశిపుడి సోదరుడైన హిరణ్యాక్షుడు విశ్వమంతా తమ ఆధిపత్యమే సాగాలని భూదేవిని ఎత్తుకుపోయి సముద్రంలో  వుంచుతాడు.  భూదేవి శ్రీమహావిష్ణువుని ప్రార్ధిస్తే ఆయన వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు.  తర్వాత ఇక్కడ ఆయన తన నేత్రాలనుంచి అశ్వధ్ధ వృక్షాన్నీ, తులసిని సృష్టించాడు. యుధ్ధంలో చిందిన ఆయన స్వేదంతో నిత్యపుష్కరిణి ఏర్పడింది. భూదేవిని రక్షించిన తర్వాత  స్వామి సాలగ్రామ శిలలో స్వయంభూగా ఇక్కడ వెలిశాడు.
శ్రీమూష్ణం క్షేత్రం లోపలి ఆవరణం 
అమ్మవారు అంబుజవల్లీ తాయారు. ఆలయ విశేషాలు:
స్వామి విగ్రహం చిన్నదే.  ఇక్కడ స్వామి పడమర ముఖంగా వెలిశాడు.  శరీరమంతా పడమర ముఖంగా వున్నా,  ముఖం మాత్రం దక్షిణం వైపు చూస్తుంటుంది.  హిరణ్యాక్షుడు తన ఆఖరి సమయంలో స్వామిని తనవైపు చూడమని ప్రార్ధించాడు.  అందుకే స్వామి అతనున్న దక్షిణం వైపు చూస్తుంటాడు.  స్వామి చేతులు నడుంమీద పెట్టుకుని వుంటాడు.
  • ⧫ స్వామి వరాహ రూపం అమ్మవారికి నచ్చక స్వామిని తన అందమైన రూపంలో కనిపించమని ప్రార్ధిస్తుంది.  అమ్మవారి కోరికపై స్వామి  యజ్ఞనారాయణస్వామిగా అందమైన రూపంలో, శంఖు చక్రాలతో వెలిశాడు.  అందుకే ఇక్కడ ఉత్సవ విగ్రహం వరాహ రూపంలో వుండదు.
  • ⧫ ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో మూల విరాట్ దగ్గర వుండవు.  ముందు మండపంలో వుంటాయి.
  • ⧫ స్వామి దగ్గర చిన్న కృష్ణుడి విగ్రహం వుంటుంది.  ఇదికూడా స్వామితోబాటు స్వయంభువు.
  • ⧫ స్వామికి సాలగ్రామాల మాల అలంకరించబడి వుంటుంది.
  • ⧫ స్వామికి 7గురు అక్క చెల్లెళ్ళున్నారని చెబుతారు.  వీరి విగ్రహాలు ఆలయంలో వేరే మండపంలో చూడవచ్చు.
అన్నింటికన్నా ఆసక్తికరమైన విశేషం పదిరోజులపాటు బ్రహ్మాండంగా జరిగే స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు, భరణీ నక్షత్రంవున్న రోజున స్వామివారిని ఊరేగింపుగా సముద్రం దగ్గరకు తీసుకెళ్తారు.
ఉత్సవాలలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని ఆలయం చుట్టూ వున్న నాలుగు మాడల వీధులలో ఊరేగిస్తూ
ఉత్సవాలలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని ఆలయం చుట్టూ వున్న నాలుగు మాడల వీధులలో ఊరేగిస్తూ 
ఉత్సవాలు:
  • ❂ ఏప్రిల్, మే నెలలలో వచ్చే చిత్రై ఉత్సవాలలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని ఆలయం చుట్టూ వున్న నాలుగు మాడల వీధులలో ఊరేగిస్తారు.  తర్వాత నిత్య పుష్కరిణిలో కన్నులపండుగగా జరిగే తెప్పోత్సవంతో ఇది ముగుస్తుంది.
  • ❂ బ్రహ్మోత్సవాలలో జరిగే ఊరేగింపు చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళనుంచికూడా భక్తులు తరలివస్తారు.  ఫిబ్రవరి, మార్చిలలో వచ్చే ఈ ఉత్సవాలలో దేవేరులతో సహా స్వామి చుట్టుపక్కల గ్రామాలకి ఊరేగింపుగా వెళ్ళి భక్తులకు దర్శనమిస్తాడు.
  • ❂ అమ్మవారు అంబుజవల్లికి నవరాత్రులలో విశేష ఉత్సవాలు జరుగుతాయి.  తమిళ నెలలైన అడి, తాయ్ లలో ఆఖరి శుక్రువారంనాడు అమ్మవారిని సువాసన భరితమైన పుష్పాలతో అలంకరించిన పల్లకీలో ఊరేగిస్తారు.
పూజా విశేషాలు
:ఈ స్వామిని పూజించటంవల్ల జీవితంలో సకల సంపదలూ లభిస్తాయంటారు.  గ్రహ దోషాలున్నవారు ఈ ఆలయంలో స్వామిని సేవిస్తే ఆ దోషాలు తొలగిపోతాయంటారు. 
కొత్త వాహనాలు కొన్నవెంటనే,  ముందు ఈ స్వామి దగ్గర పూజ చేయిస్తారు.  అలాగే యాక్సిడెంట్ అయిన వాహనాలుకూడా బాగు చేయించాక వాడక ముందు ఇక్కడికి తీసుకు వచ్చి పూజ చేయిస్తారు.

దర్శన సమయాలు:
ఉదయం 6 గం. ల నుంచి 12 గం. ల దాకా, తిరిగి సాయంత్రం 4 గం. ల నుంచి 8-30 దాకా.
వసతి, ఆలయం పక్కనే అతిధి గృహం వున్నది.
మార్గం
చెన్నైనుంచి, వృధ్ధాచలంనుంచి బస్సులున్నాయి.  రైలులో వచ్చేవారు వృధ్ధాచలంలో దిగి, అక్కడనుంచి బస్ లో రావచ్చు.

రచన: శ్రీ రాజ గోపాల్ భట్టార్ - 9442378303
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow