భువనేశ్వరి మాత - Bhuvaneswari Mata

P Madhav Kumar

  

భువనేశ్వరి అనగా హిందూ దేవత పార్వతీదేవి. భువనేశ్వరీ పరమమైనది, శాంతిమయమైనది. కాళి, తార, సుందరీల ప్రకాశమునకు భువనేశ్వరి తెరవంటిది. దశమహావిద్యలు, వామ, కౌళ సంప్రదాయములకు చెందినది. వామ, కౌళములు సిద్ధపురుషులకే గాని సామన్యులకు కాదు, పరమదేవతా అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న ఆ దేవి యంత్ర, మంత్ర, తంత్ర, పూజా కల్పానాసారము విధి విధానం తెలుసుకొని అర్చించి దేవీ కృపకు పాత్రులు కావలసి ఉంటుంది.

మహామాయయైన భువనేశ్వరీదేవి దశ మహావిద్యలలో భువనేశ్వరీ విద్య నాల్గవది. భువనేశ్వరీ అనగా విశ్వమంతటికి మహారాజ్ఞి. భువనేశ్వరీ బీజం హ్రీం. దీనినే మాయా బీజం అని అంటారు మంత్ర శాస్త్ర పరిభాషలో ‘హృల్లేఖ’ అని అంటారు.

సమస్త భువనాలకు అధీశ్వరియైన ఈ దేవత ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. కిరీటం మీద చంద్రకళ మూడు కన్నులు చిరునవ్వు, ఆమెకు అలంకారాలు నాలుగు చేతులలో పాశాంకశాలను వరదా భయముద్రలను దాల్చి ఉంటుంది. ఈమె పరమ శాంతి స్వరూపిణి ‘‘పరమాం శాంతిం కామయ మానో భువనేశ్వరీ ముపాసీత’’. సర్వజీవులు అంతిమంగా కోరేది శాంతి శృంగార వీరాది సమస్త రసాలు స్థాయి భావమును చేరుకోవాలంటే సుప్రకాశానంద చిన్మయమైన శమ స్థితిని పొందాలి. ఆ శమములో ఆనందముంది. ఆ ఆనందం ప్రేమకు లక్షణం. ఆమె సమస్త విశ్వాన్ని ప్రేమతో చూస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఋషులు ఇలా స్తుతించారు.

దయామయమైన ఆమె చూపుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు త్రిమూర్తులు ఆమె చేతనే సృష్టించబడినారు. బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువునకు స్థితి శక్తిని, మహేశ్వరునకు సంహారశక్తిని ఆమె ప్రసాదించింది. త్రిమూర్తులకు అతీతమైన ఒక మహాశక్తిగా భువనేశ్వరిని భావించవలసి ఉంటుంది. తనను ఉపాసించే వారికి ఆమె ఇంద్రియ విజయాన్ని ప్రసాదిస్తుంది. జీవులలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఏనుగును అంకుశంతో లొంగతీసుకొన్నట్లుగా వాటిని లొంగదీసి శాంతిని ప్రసాదిస్తుంది. హ్రీంకార బీజ రూపిణిగా, మహామాయగా, శక్తిగా, ఏకాక్షరిగాని, త్య్రక్షరిగాని, స్వీకరించి సంప్రదాయ క్రమంలో సాధన చేస్తే భువనేశ్వరీ కరుణ తప్పక కలుగుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat