నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ
మందాకినీ సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ
శివాయ గౌరీవదనాబ్జవృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ
యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచిత శివపంచాక్షరీ స్తోత్రం సమాప్తం
తాత్పర్యము:
నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, 'న'కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు.
మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి, గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన 'మ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.
సకల శుభకరుడు, కమలము వంటి గౌరీ దేవి వదనమును వికసింప చేసే సూర్యుడు, దక్ష యజ్ఞము నాశనము చేసిన వాడు, నీలకంఠుడు, వృషభము (ఎద్దు) పతాకముపై చిహ్నముగా కలవాడు, 'శి'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.
వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలగు మునీంద్రులచే పూజింపబడిన శిరస్సు (లింగం) కలిగిన, చంద్రుడు, సూర్యుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగిన, 'వ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.
యక్ష రూపములో ఉన్న, జటా ఝూటములు కలిగిన, పినాకము (అనే ధనుస్సు) చేత కలిగిన, సనాతనుడు (ఆది/అంతము లేని వాడు, అన్నిటికన్నా ముందు వచ్చిన వాడు), దివ్యమైన వాడు, దేవ దేవుడు, దిగంబరుడు, 'య'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.
ఫల శృతి:
శివుని సన్నిధిలో ఈ పంచాక్షరి స్తోత్రమును పఠనం చేసిన వారికి శివలోక ప్రాప్తి, శివుని సహవాసం కలుగును. ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన పంచాక్షరీ స్తోత్రం.